డయాబెటిస్‌ రోగుల వ్యాయామాలెలా ఉండాలి? | People With Diabetes Can Live Better By Exercising | Sakshi
Sakshi News home page

డయాబెటిస్‌ రోగుల వ్యాయామాలెలా ఉండాలి?

Jan 22 2020 1:25 AM | Updated on Jan 22 2020 1:26 AM

People With Diabetes Can Live Better By Exercising - Sakshi

నా వయసు 62 ఏళ్లు. గత పదేళ్లుగా నేను డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. డయాబెటిస్‌ రోగుల వ్యాయామం విషయంలో మేమెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి వివరించండి.

డయాబెటిస్‌ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలరు. దీనివల్ల ఇన్సులిన్‌ పట్ల శరీరం బాగా స్పందించడంతో పాటు ఒంట్లోని చక్కెరపాళ్లు కూడా తగ్గుతాయి. అయితే దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
►వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులు ఏవైనా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో  కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు.

►వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్‌ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు. డయాబెటిస్‌ ఉన్నవారిలో ఒక్కోసారి వ్యాయామం వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

►ఒకవేళ రక్తంలోని చక్కెరపాల్లు 100 ఎంజీ/డీఎల్‌ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త టిఫిన్‌ తిన్నతర్వాతే మొదలుపెట్టాలి. అంటే కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటే శ్నాక్స్‌ లేదా ఏదైనా పండు వంటిది తినాలి. ఒకవేళ రక్తంలో చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్‌ లాంటి తీపిపదార్థం  ఏదైనా తీసుకోవాలి.

►మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగా, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు.

►వాతావరణంలో చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు శరీరం వెంటనే అలసిపోయే వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే కొందరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధంగా ఉంచేంత సామర్థ్యం ఉండదు. అలాంటి సందర్భాల్లో  చెమటను, రక్తప్రసరణను నియంత్రించే అటనామిక్‌ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే బాగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు.

►డయాబెటిస్‌ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్‌ న్యూరోపతి) రావచ్చు.  మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైనా వెంటనే తమకు దగ్గరివారికి తెలియజేసేలా మీ మొబైల్‌ఫోన్‌ను వెంటే ఉంచుకోండి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్‌ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకుంటూపొండి.
డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement