సేంద్రియ ఆహారం దివ్యౌషధం!

Organic Food good For Health - Sakshi

సాధారణ, సేంద్రియ ఆహారోత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఐసీటీలో  పరీక్షలు

రసాయనిక పద్ధతుల్లో పండించిన వరి బియ్యం, దొండ, బెండ, కాలీఫ్లవర్‌లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్‌ సున్నా

సేంద్రియ ఆహారోత్పత్తుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ వేల రెట్లు అధికమని వెల్లడి

సేంద్రియ వరి బియ్యంలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్‌  

ఇంటిపట్టున గాని, పొలంలో గాని రసాయనాలు బొత్తిగా వాడకుండా పూర్తిగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, తిండి గింజలు, పప్పుధాన్యాలు సాగు చేయడానికి అదనంగా శ్రమపడాల్సి వస్తుందన్నది నిజమే. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడినప్పటికన్నా ప్రకృతి/సేంద్రియ పద్ధతుల్లో పండించడం కొంచెం కష్టమే కావచ్చు. అయితే, ఈ కష్టం ఊరికే పోదంటున్నారు నిపుణులు.

అదెలాగంటారా? సేంద్రియ ఆహారోత్పత్తులలో స్థూల, సూక్ష్మ పోషకాలతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’ వంటి విశిష్ట పోషకాలు అత్యధిక మోతాదులో ఉంటాయి కాబట్టి! కొన్ని సేంద్రియ ఉత్పత్తుల్లో రెట్టింపు ఉండగా, మరికొన్నిటిలో వేల రెట్లు అదనంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసిటి) తాజా పరీక్షల్లో వెల్లడైంది.
ఆశ్చర్యంగా ఉందా..?ఇది ముమ్మాటికీ నిజమే సుమా! ఇక చదవండి మరి..

ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మనందరికీ తెలిసిందే. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేసిన ఆహార పదార్థాల కన్నా సేంద్రియ ఆహారోత్పత్తులు ఎంతో ఆరోగ్యదాయకమని మనకు తెలిసిందే.అయితే, పూర్తిగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు ఆ ఔషధ గుణం ఎలా వచ్చింది? వాటిల్లోని ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’ వంటి పోషకాల వల్ల ఆ సద్గుణం వచ్చింది!
యాంటీ ఆక్సిడెంట్స్‌ ఏయే ఆహారోత్పత్తుల్లో ఏయే స్థాయిలో ఉన్నాయి? రసాయనిక పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో ఎంత మేరకు ఉంటాయి? సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో ఎంత ఎక్కువ మోతాదులో ఉంటాయి? అనేవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానం వెతికేందుకు ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రయత్నించింది. తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ ఫౌండేషన్‌.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐ.ఐ.సి.టి.– హైదరాబాద్‌)లో కొన్ని ఆహారోత్పత్తులపై ఇటీవల పరీక్షలు చేయించింది. వరి బియ్యం, గోధుమలు, కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలపై పరీక్షలు జరిగాయి.

ఆక్సిజన్‌ రాడికల్‌ అబ్సార్బెన్స్‌ కెపాసిటీ(ఓ.ఆర్‌.ఎ.సి.) అనే పరీక్ష నిర్వహించారు. యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వులో కరిగేవి(లిపోఫిలిక్‌), నీటిలో కరిగేవి(హైడ్రోఫోలిక్‌) ఏయే ఆహారోత్పత్తుల్లో ఏయే మోతాదుల్లో ఉన్నాయన్నది తెలుసుకున్నారు. ఐఐసిటి పరీక్షల ఫలితాలను ఏకలవ్య ఫౌండేషన్‌ ట్రస్టీ చిట్టూరి సుబ్రహ్మణ్యం ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు.

‘యాంటీ ఆక్సిడెంట్లు’ అంటే?
మానవ దేహంలో నిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. జీవక్రియలు జరిగే సమయంలో మన దేహంలో కొన్ని కలుషిత పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీ రాడికల్స్‌ అంటారు. అవి కణాలను దెబ్బతీసి మనకు అనారోగ్యం కలిగిస్తాయి. వీటి బారిన పడిన ఆరోగ్యకరమైన కణం కేన్సర్‌ కణంగా మారిపోయే అవకాశం ఉంది. ఇలా మన ఆరోగ్యానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిస్తేజంగా మార్చే శక్తి మనం తీసుకునే ఆహారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలకు ఉంది. జీవక్రియల ద్వారా వెలువడే వ్యర్థాల్లోని హానికారక పదార్థాలను నిర్వీర్యం చేసి, కణ విధ్వంసాన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ నిలిపివేస్తాయి. అందువల్లనే యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునే వారు ఎక్కువ కాలం యౌవనంగా ఉండటంతోపాటు కేన్సర్‌ తదితర వ్యాధుల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు(సాక్షి ఫ్యామిలీ హెల్త్‌కాలమ్‌లో 01–08–2019న ‘యాంటీ డిసీజ్‌ ఆహారం’ శీర్షికన కేర్‌ హాస్పిటల్స్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌ డా. హరిచరణ్‌ రాసిన వ్యాసం చదవండి). అంతేకాదు.. కేన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు, అల్జిమెర్స్, పార్కిన్సన్‌ వంటి జబ్బులను యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారం నివారించగలుగుతుందని అమెరికా వ్యవసాయ శాఖలోని ఆహార–పోషకాల విశ్లేషణ విభాగం చెబుతోంది.

రసాయనాలతో పండించిన వరిలో సున్నా
రసాయనిక పద్ధతిలో పండించిన వరి బియ్యం, దొండకాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ బొత్తిగా సున్నా. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వరి బియ్యం, దొండకాయలు, బెండకాయలు, కాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా.. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన గోధుమలు, కందులు, బొప్పాయి పండ్లు, బీర, కాకర, కరివేపాకు, తోటకూర, చిక్కుళ్లలో రసాయనాలు వాడి పండించిన వాటిలో కన్నా అనేక రెట్లు ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నట్లు తేలింది.

మొక్కలు తెగుళ్లు, కీటకాలు, వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి వృక్ష రసాయనాల(ఫైటో కెమికల్స్‌)ను తయారు చేసుకుంటాయి. సేంద్రియ వ్యవసాయ విధానంలో సాగయ్యే పంటలు వీటిని అధిక మోతాదులో తయారు చేసుకుంటాయి. ఆయా పంటల నుంచి లభించే ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు తదితర ఉత్పత్తుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. అంటే.. సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట దిగుబడుల ద్వారా మన ఆకలి తీర్చుకోవడానికి కావాల్సిన ఆహారంతోపాటు, ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఔషధ శక్తి కూడా పుష్కలంగా లభిస్తోందన్న మాట.

ఈ కారణంగానే సేంద్రియ ఆహారోత్పత్తులను అధిక ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు గిరాకీ 20% మేరకు పెరుగుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదిలో ఎక్కువ కాలంపాటు పంటలు పండించుకోవడానికి అనువైన సానుకూల వాతావరణ పరిస్థితులున్న మన దేశంలో రైతాంగానికి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం బంగారు భవిష్యత్తును అందించనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.    – పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్‌

సేంద్రియ విశిష్ట పోషకాల సాంద్రతను వెలుగులోకి తెచ్చిన తొలి పరీక్ష!
సేంద్రియ ఆహారంలో రసాయనాల అవశేషాలు ఉండవు కాబట్టి ఆరోగ్యదాయకమని ఇప్పటి వరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే, మనకు ప్రాణాంతక జబ్బులు రాకుండా అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి అసమాన పోషకాల సాంద్రత(న్యూట్రిషన్‌ డెన్సిటీ) సేంద్రియ ఆహారంలో ఇంత ఇబ్బడి ముబ్బడిగా ఉందన్న వాస్తవం ఐఐíసీటీ శాస్త్రవేత్తల పరీక్షల్లో తాజాగా వెలుగులోకి రావడం కనువిప్పు కలిగించే విషయం. బహుశా మన దేశంలోనే ఇది మొదటిసారి కావచ్చు. సేంద్రియ ఆహారోత్పత్తులను భారీ మొత్తంలో ఏడాదిలో ఎక్కువ నెలల పాటు సాగు చేయడానికి తగిన సానుకూల పరిస్థితులు పారిశ్రామిక వ్యవసాయం సాగే ఇతర దేశాల్లో కన్నా మన దేశానికే ఎక్కువగా ఉన్నాయి. ఆరుగాలం స్వయంగా నడుము వంచి పనిచేసే 80% మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్న మన దేశానికి సేంద్రియ వ్యవసాయం బాగా నప్పుతుంది. మన ప్రజలందరికీ పౌష్టికాహార భద్రత, ఆరోగ్య భద్రతను ఇవ్వడంతోపాటు.. విదేశాలకు అమృతాహారాన్ని ఎగుమతి చేయగల సత్తా మన దేశానికి మాత్రమే ఉంది. అయితే, ప్రభుత్వాలు ఈ అద్భుత అవకాశాలను గుర్తెరిగి ఈ దిశగా పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించాల్సిన తరుణం ఆసన్నమైంది.– చిట్టూరి సుబ్రహ్మణ్యం,ట్రస్టీ, ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్‌
chbs@shanders.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top