జాగ్రత్తలు చెప్పండి

Online Safety for children should be told in advance - Sakshi

సైబర్‌ కిడ్స్‌

మనం స్మార్ట్‌గా ఉన్నా లేకపోయినా సరే, చేతిలో ఉన్న ఫోన్‌.. స్మార్ట్‌ కాకపోతే చిన్న పిల్లలు కూడా చికాకు పడే రోజులివి. ఫోన్‌ విషయంలో పెద్దవాళ్ల కంటే పిల్లలే ఎక్కువ స్మార్ట్‌. అయితే, నాణానికి బొమ్మాబొరుసూ ఉన్నట్టే, టెక్నాలజీ వల్ల పిల్లలకు.. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో ప్రమాదం కూడా పొంచి ఉందని మైక్రోసాఫ్ట్‌ డిజిటల్‌ సివిలిటీ ఇండెక్స్‌ సర్వే పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. సైబర్‌ ప్రపంచంలో పిల్లల్ని వాళ్ల మానాన వారిని వదిలేసి ఉదాసీనంగా ఊరుకోవడం వల్ల ముందు ముందు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల ప్రవర్తనలో ఏమైనా తేడాలు వస్తే ఏమాత్రం అలక్ష్యం చేయకూడదని  సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ జ్యోతి కపూర్‌ మదన్‌ చెబుతున్నారు. ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. 
     
పిల్లలకు ఆన్‌లైన్‌ సేఫ్టీ గురించి ముందుగానే చెప్పాలి. డిజిటల్‌ ప్రపంచంలోకి వారు అడుగుపెట్టేముందే దేనినీ అతిగా చేయకూడదని, పరిమితి ప్రకారమే వాడుకోవాలని ముందే చెప్పాలి.స్మార్ట్‌ఫోన్‌ కానివ్వండి, డెస్క్‌టాప్‌ కానివ్వండి, లాప్‌టాప్‌ కానివ్వండి. ఏదైనా సరే, దానిని వాడుకోవడానికి మీ పిల్లలకు ఇచ్చేముందే, అది ఎంత భద్రమైనదో చెక్‌ చేయాలి. దాని అడ్మిన్‌గా మీరే ఉండాలి.ఏ వెబ్‌సైట్‌ పడితే ఆ వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయకూడదని చెప్పండి. ముఖ్యంగా అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించండి.  సోషల్‌ నెట్‌వర్క్‌లో అపరిచితులను యాడ్‌ చేసుకునేముందు వారి వివరాలు తెలుసుకోవాలని, యాడ్‌ రిక్వెస్ట్‌ పెట్టిన ప్రతి ఒక్కరినీ యాక్సెప్ట్‌ చేయకూడదని, ఎవరితో పడితే వారితో చాటింగ్‌ చేయడం, వారితో వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకోవడం మంచిది కాదని స్పష్టంగా చెప్పండి. అందుకు అనుగుణంగా వారి ప్రైవసీ సెట్టింగ్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పండి. 

కోపంలో లేదా సంతోషంలో ఉన్నప్పుడు వారు సోషల్‌ మీడియా వైపు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఎప్పటికప్పుడు స్టేటస్‌ అప్‌డేట్‌ చేయడం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పండి. రోజూ నిర్ణీత సమయంలోనే నెట్‌ ఓపెన్‌ చేయడం, నిర్ణీత కాలానికే దానిని క్లోజ్‌ చేయడం వంటి సమయ పరిమితులు విధించండి. అవసరమైతే కఠినంగా ఉండండి.  చివర గా ఒక్క మాట... వారికి పరిమితులు విధించేముందు పైన చెప్పిన అన్ని జాగ్రత్తలూ మీరు తీసుకుంటున్నారో లేదో చెక్‌ చేసుకోండి.
– బాచి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top