
సన్మార్గం : ధన్యజీవి... నరసీ మెహతా
‘‘నన్ను నమ్మి సేవించువారి బరువు బాధ్యతలు నేనే చూసుకుంటాను’’అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు నరసీమెహతా జీవిత చరిత్ర చక్కని ఉదాహరణ. అడుగడుగునా తన భక్తుని మానమర్యాదలు కాపాడుతూ భక్తజన రక్షకుడన్న తన బిరుదును సార్థకం చేసుకున్నాడు.
‘‘నన్ను నమ్మి సేవించువారి బరువు బాధ్యతలు నేనే చూసుకుంటాను’’అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు నరసీమెహతా జీవిత చరిత్ర చక్కని ఉదాహరణ. అడుగడుగునా తన భక్తుని మానమర్యాదలు కాపాడుతూ భక్తజన రక్షకుడన్న తన బిరుదును సార్థకం చేసుకున్నాడు.
నరసీమెహతా జున్యాగడ( నేటి జునాగడ్) అనే నగరంలో జన్మించాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ పరమపదించారు. అందువల్ల అతని పోషణభారం అన్నావదినల మీద పడింది. వదినకు ఈ పిల్లాడిని పెంచటం సుతరామూ ఇష్టం లేదు. తన అయిష్టాన్ని అనేక రకాలుగా నరసీమెహతా మీద చూపిస్తుండేది. వయసుకు మించిన పనులు పురమాయిస్తూ వేళకు అన్నం పెట్టకుండా ఎంత చిన్న పొరపాటు జరిగినా తిట్టి, కొట్టి హింసిస్తూ ఉండేది. తన బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తనే దుఃఖిస్తూ ఉండేవాడు నరసీ మెహతా. ఆమె పెట్టే బాధలు అంతకంతకూ ఎక్కువకాగా విరక్తిచెందిన నరసీమెహతా ఒకరోజు ఇల్లు విడిచి అడవిలోకి పారిపోయాడు. ఎక్కడకు వెళ్లాలో, ఏమిచేయాలో దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతున్న నరసీమెహతాకు ఒక శిథిలాలయం, అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కనిపించారు. నిర్జనమైన అడవిలో సాధువు కనిపించగానే నరసీ మెహతాకు భయం తీరి ఆయన దగ్గరకు వెళ్లాడు.
ఆయన నరసీమెహతా కథ విని జాలిపడి అన్నపానీయాలనిచ్చి ఆదరించాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత నీకు ఇష్టమైన చోటుకు వెళ్లవచ్చునని చెప్పి అక్కడే పడుకోమన్నాడు. ఆదమరచి నిద్రపోతున్న నరసీమెహతాకు అర్ధరాత్రివేళ దివ్యమైన వేణుగానం వినిపించగా లేచి కూర్చున్నాడు. ఆలయం ఎదుట ఉన్న ప్రదేశంలో దివ్యమంగళ స్వరూపుడైన శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుండగా గోపికలు ఆనందంతో ఒళ్లుమరచి నాట్యం చేయసాగారు. అదంతా తాను విన్న భాగవతంలోని శ్రీకృష్ణ రాసలీలా వైభవంగా తోచింది. ఆ అద్భుత దృశ్యం చూసి ఒళ్లు పులకరించగా నరసీ మెహతా కూడా నృత్యం చేయసాగాడు.
ఆ చప్పుడుకు సాధువు లేచి ‘‘అర్ధరాత్రి వేళ నృత్యం ఏమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు నరసీమెహతా ‘‘అయ్యా! శ్రీకృష్ణుడు గోపికలతో కలసి రాసలీల చేస్తుంటే నాకు కూడా వారితోపాటు నృత్యం చేయాలనిపించింది’’ అంటూ తాను చూసిన సన్నివేశాన్ని వర్ణించి చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా తాను అక్కడ ఉంటున్నా ఎప్పుడూ తనకు కనిపించని దృశ్యం ఏ పూర్వపుణ్యం వలన అతనికి కనిపించింది? అని దివ్యదృష్టితో చూసి సాధువు విషయమంతా తెలుసుకున్నాడు. ‘‘నీవు పూర్వజన్మలో క్రూరమైన పెద్దపులివి. ఒకసారి శ్రీకృష్ణుని భక్తుడైన పిపాజీ రాజును చంపబోగా అతను తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ నామమంత్రం జపించాడు. ఆ మంత్రం విన్న పుణ్యం వలన ఇప్పుడు ఉత్తమమైన నరజన్మ ఎత్తగలిగావు. అప్పుడు నీవు చేసిన దుష్కర్మల ఫలితమే ఇప్పుడు నీవు అనుభవించిన బాధలు’’ అని చెప్పి ‘‘నీవు చూసిన రాసలీలలను వర్ణిస్తూ ఒక ప్రబంధ కావ్యాన్ని రాయి. ఆయన ఆశీస్సులు నీపై సమృద్ధిగా ఉన్నాయి కనుకనే మహాపురుషులకు సైతం కనిపించని దృశ్యాన్ని నీవు కన్నులారా చూడగలిగావు’’ అని అన్నాడు.
సాధువు ఆదేశం మేరకు నరసీ మెహతా అక్కడే ప్రబంధ కావ్యరచన ప్రారంభించాడు. శ్రీకృష్ణుని లీలలు అతని కన్నులముందు కనిపిస్తుండగా నరసీ మెహతా నిమిత్తమాత్రుడై రాశాడు.
గుజరాతీ భాషలో అతడు వర్ణించిన రాసక్రీడా వైభవాన్ని ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా పాడుకోసాగారు. లోహానికి స్పర్శవేది (పరశువేది) తగిలితే బంగారమైనట్లు భగవంతుని కృపకు పాత్రుడైన నరసీమెహతా కీర్తిమంతుడయ్యాడు. అతనికి సద్గుణవతి అయిన కన్యతో వివాహం జరిగింది.
- జక్కా విజయకుమారి