నానో వైద్యం ఇంకెంత దూరం?

నానో వైద్యం  ఇంకెంత దూరం?


నానో టెక్నాలజీ గురించి తరచూ వింటూ ఉంటాం... ఇది అందుబాటులోకి వస్తే అద్భుతాలు జరిగిపోతాయని...  మనిషి ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకూ మేలైన, మెరుగైన పరిష్కారాలు దొరుకుతాయని పత్రికల్లో, టీవీల్లో చూస్తూ ఉంటాం. కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న, ఈ మాటలు చేతలయ్యేదెప్పుడు? మిగిలిన వాటి  మాటెలా ఉన్నా... ప్రాణాంతకమైన జబ్బులకు సంజీవిని అనదగ్గ నానోవైద్యం ఇంకెంత దూరం?

 

1959... ప్రపంచానికి నానో టెక్నాలజీ అన్న పదం పరిచయమైంది ఆ ఏడాదే. విఖ్యాత శాస్త్రవేత్త రిచర్డ్ ఫేమన్ ‘దేర్ ఈజ్ ప్లెంటీ రూమ్ అట్ ద బాటమ్’ శీర్షికతో చేసిన ప్రసంగం పరమాణుస్థాయి నానో శాస్త్రానికి, టెక్నాలజీకి బీజం వేయగా... ఎరిక్ డ్రెక్స్లర్ 1985లో ‘ద ఇంజిన్స్ ఆఫ్ క్రియేషన్’ ద్వారా జనసామాన్యంలోనూ విసృ్తత ప్రాచుర్యం కల్పించారు. నానో ఇంజిన్లు, సెల్ఫ్ రెప్లికేటింగ్ మెషీన్లతో ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించవచ్చునన్న ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం లేకపోలేదు. వైద్యాన్నే ఉదాహరణగా తీసుకుంటే నానోటెక్నాలజీ పూర్తి సామర్థ్యంతో కాకపోయినప్పటికీ ఎంతో కొంత పురోగతి సాధించిందని చెప్పకతప్పదు.

 

డీఎన్‌ఏ రోబోలు...



ఆధునిక వైద్యం మనిషి ఆయుఃప్రమాణాలను పెంచిందనడంలో ఎవరికీ సందేహం లేదు. అంతమాత్రాన ఇది పూర్తిస్థాయి ప్రభావశీల చికిత్స? కాకపోవచ్చు. కేన్సర్ చికిత్సనే తీసుకోండి. సమస్య కొన్ని కణాలది మాత్రమే. కాని చికిత్స మాత్రం మొత్తం శరీరానికి జరుగుతుంది. ఫలితంగా వ్యాధికారక కణాలతోపాటు ఇతర ఆరోగ్యకర కణాలు, అవయవాలపై దుష్ర్పభావం. నానోవైద్యంతో ఈ సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు డేనియల్ లెవ్‌నర్. ఈ హార్వర్డ్ విశ్వవిద్యాలయ బయో ఇంజినీర్ ప్రత్యేకంగా తయారు చేసిన డీఎన్‌ఏ పోగులే ఆయుధాలుగా కేన్సర్‌పై విజయం సాధించవచ్చునని చెబుతారు. ప్రొటీన్లను మోసుకెళ్లగల ఈ డీఎన్‌ఏ రోబోలు శరీరంలో ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితులకు తగ్గట్టుగా తెలివిగా వ్యవహరిస్తూ అటు వ్యాధులను ముందుగా గుర్తించగలగడంతోపాటు చికిత్స కూడా చేపట్టగలవని ఆయన అంచనా. కేన్సర్ ఛాయలున్న కణజాలంతో ఢీకొన్నప్పుడు మాత్రమే కీమోథెరపీ రసాయనాలను అతిసూక్ష్మ మోతాదులో ఆ ప్రాంతానికి మాత్రమే అందించేలా ఈ డీఎన్‌ఏ రోబోలను ప్రోగ్రామ్ చేయవచ్చు కూడా.



నానోటెక్నాలజీ సాయంతో కేన్సర్‌ను అధిగమించేందుకు జరుగుతున్న మరో ప్రయత్నం సిలికా, బంగారు రజనులను కేన్సర్ కణితిలకు తగిలించి నాశనం చేయడం. ఈ పద్ధతిలోనూ కేవలం కేన్సర్ కణితపై మాత్రమే ప్రభావం పడుతుంది. నానో రజను ఈ కణితులు ఎక్కడున్నాయో గుర్తించేందుకు సాయపడుతుంది.

 

వ్యాధి నిర్ధారణలోనూ...




ముందుగా చెప్పుకున్నట్లు నానోటెక్నాలజీ వ్యాధుల నిర్ధారణలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అంతెందుకు.. శరీరంలోని రసాయనిక మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించగలిగే నానోస్థాయి పరికరాలతో వ్యాధి సోకకముందే వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా రోగుల ఆరోగ్య పరిస్థితిని క్షణక్షణం గుర్తించేందుకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేసేందుకు, క్వాంటం డాట్స్ సాయంతో ప్రొటీన్లను విశ్లేషించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొంతమేరకు విజయం సాధించారు కూడా. కొన్ని రకాల కేన్సర్లున్న కణజాలాన్ని ఈ పద్ధతి ద్వారా గుర్తించగలిగారు.

 

మెదడు మిస్టరీలు ఛేదించేందుకు కూడా....



సైన్స్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ ఆధునిక యుగంలోనూ మన మెదడు పనితీరు గురించి తెలిసింది చాలా తక్కువే. నానోటెక్నాలజీ ద్వారా ఈ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నానోస్థాయి వజ్రపు రజనును మెదళ్లలోకి జొప్పించడం ద్వారా అక్కడి విద్యుత్ క్రియలను బయటి సెన్సర్లలో నమోదు చేయవచ్చునని ఏ రకమైన ఉద్వేగానికి ఎలాంటి స్పందన ఉంటుందో రియల్‌టైమ్‌లో గుర్తించవచ్చు కాబట్టి మెదడు పనితీరుపై మన అవగాహన మరింత పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తమ్మీద చూస్తే... ఇప్పటివరకూ ఉన్న వైద్యం ఒక ఎత్తై... నానో వైద్యం మరో ఎత్తు అన్నమాట!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top