బౌద్ధ వర్ధనుడు

He established the Buddhist community for the first time in Sarnath - Sakshi

వైశాఖ పున్నమి రోజున పుట్టిన సిద్ధార్థుడు తన పదహారో ఏట యశోధరను వివాహమాడాడు. ఆయనకు 29వ ఏట సంతానం కలిగింది. రాహులుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే ధర్మమార్గాన్ని, దుఃఖ నివారణ మార్గాన్నీ వెతుక్కుంటూ, తల్లిదండ్రులని, భార్యాబిడ్డల్నీ, మిత్రుల్నీ, అన్నదమ్ముల్నీ, ఆస్తిపాస్తుల్నీ రాజ్యాధికారాన్నీ వదిలి వనాలకు వెళ్లిపోయాడు. ఆరేళ్లు అనేక చోట్ల తిరిగి, అనేకమందితో చర్చించి చివరికి వైశాఖ పున్నమి నాడే బోధగయలోని రావి చెట్టుకింద జ్ఞానోదయం పొందాడు. దుఃఖ నివారణ మార్గాన్ని ఆవిష్కరించాడు.

ఆ తర్వాత సారనాథ్‌లో తొలిసారిగా ఐదుమంది అనుయాయులతో బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొద్ది నెలల్లోనే ఆ సంఘం మహా సంఘంగా విస్తరించింది. ఎందరో వేలాదిమంది ఆ సంఘంలో చేరారు. ఎవరో తాత్వికులు కాదు. గృహస్థులు కూడా. రాచకుటుంబాలకు చెందినవారు, వ్యాపారులు, పనీపాటలు చేసే కూలినాలీ జనం, అంటరాని కులాలవారు– అందరూ సంఘంలో చేరారు. నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోయినట్లు సంఘంలో చేరిన వారంతా తమ తమ కులం, గోత్రం, నామం, ప్రాంతీయతలు అన్నింటినీ కోల్పోయారు.

బౌద్ధ సంఘంలో అందరూ సమానులే!
అందరూ భిక్షాటన మీదే బతకాలి. అందరూ కాషాయ చీవరాలే ధరించాలి. నేలమీదే నిద్రించాలి.ఈ నిరాడంబర జీవితానికి, సంఘంలో చేరి బంధువులుగా గడపడానికీ బుద్ధుడు చెప్పిన ధర్మవ్యక్తికి తమ వంతు కర్తవ్యాన్ని జోడించడానికి అందరిలాగే .. బుద్ధుని కుటుంబ సభ్యులు, శాక్యరాజ్యం వంశీకులు దాదాపుగా అందరూ ముందుకొచ్చారు. వారిలో మొదటివాడు ఆయన తండ్రి శుద్ధోదనుడే!శాక్యరాజవంశంలో ప్రముఖులు ఐదుగురు. వారు శుద్ధోదనుడు, అతని నలుగురు సోదరులు శుక్లోదనుడు, శాక్యోదరుడు, ధోతోదనుడు, అమితోదనుడు. వారికి ఒక చెల్లి, అమితాదని. ఐదుగురు అన్నదమ్ములకూ ఎనిమిది మంది సంతానం. సిద్ధార్థుడు, నందుడు, ఆనందుడు, మహానాముడు, అనిరుద్ధుడు, భద్దియడు, భాడవుడు, కింబిలుడు.అమితాదనికి ముగ్గురు సంతానం.

తిష్యుడు, దేవదత్తుడు, యశోధర.వీరిలో తొలుత బుద్ధోపదేశం విని బౌద్ధాభిమానిగా మారిన తొలి వ్యక్తి శుద్ధోదనుడే!సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాక శుద్ధోదనుడు తమ నగరం కపిలవస్తుకు రమ్మని బుద్ధుని బాల్యమిత్రుడు కాలు ఉదాయితో కబురు పెడతాడు.బుద్ధుడు కపిలవస్తు నగరం వదిలిన తర్వాత ఏడేళ్లకు తిరిగి అక్కడికి వెళ్తాడు.అనారోగ్యంతో మంచి పట్టిన తండ్రికి ధర్మోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంతో ఆయనలో అంతకుముందు ఉన్న దుఃఖం తీరిపోతుంది. తననూ బౌద్ధునిగా అనుమతించమని వేడుకుని నమస్కరిస్తాడు తండ్రి. అలా శుద్ధోదనుడు శాక్యవంశ తొలి బౌద్ధ ఉపాసకుడయ్యాడు. ఆ తర్వాత యశోధర తన ఏడేళ్ల బిడ్డను బుద్ధుని దగ్గరకు పంపుతుంది. ‘వారే నీ తండ్రిగారు. నీకు రావలసిన ఆస్తి, అధికారానికి సంబంధించిన హక్కుల్ని అడిగి తెచ్చుకో’ అని రాహులుణ్ణి బుద్ధుని దగ్గరకు పంపుతుంది యశోధర.‘‘నాయనా! నాకున్న ఆస్తి ఇదే’ అని ఏడేళ్ల కొడుకు చేతిలో భిక్షాపాత్ర పెడతాడు బుద్ధుడు. ‘‘నాకుంది ధర్మాధికారమే. అది నీవూ గ్రహించు’’ అని బౌద్ధసంఘంలో చేర్పించుతాడు.
అలా తొలి బౌద్ధ సంఘం బాలభిక్షువు రాహులుడయ్యాడు!ఆ తర్వాత బుద్ధుని మిత్రుడు కాలు ఉదాయి, అతని సోదరులు, మేనత్త బిడ్డలు దాదాపుగా కాస్త వెనకాముందుగా అందరూ బౌద్ధసంఘంలో చేరి భిక్షువులుగానే జీవితాంతం జీవించారు.తన భర్త శుద్ధోదనుడు మరణించాక సిద్ధార్థుని పెంచిన తల్లి, పిన్నమ్మ గౌతమి కూడా కపిలవస్తు నుండి రాజగృహకు కాలినడకన వెళ్లింది. తనతోపాటు కోడలు యశోధరను, మిగిలిన కోడళ్లనూ, మరికొంతమంది శాక్య స్త్రీలనూ వెంటబెట్టుకుని వెళ్లింది.‘తమకూ భిక్షుసంఘంలో అర్హత కల్పించమని అడిగింది.బుద్ధుడు అందుకు అనుమతించి తొలిగా తన తల్లినే భిక్షుణిగా మార్చాడు. భిక్షుణీ సంఘాన్ని ఏర్పాటు చేశాడు.

అలా బౌద్ధభిక్షువుగా మారిన తొలి మహిళా మూర్తి గౌతమే!శాక్యవనం ఆస్థాన క్షురకుడు ఉపాలీ, రథచోదకుడు చెన్నుడూ– ఎందరెందరో బౌద్ధ సంఘంలో చేరారు. ఉపాలికి ఎంత గౌరవ సంస్కారం దక్కిందంటే బుద్ధుని పరినిర్యాణం తర్వాత మూడు నెలలకి ఏర్పాటైన మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఆయనే!తానా కాకుండా తన కుటుంబాన్ని, తన శాక్యవంశాన్ని మొత్తం రాచరిక వ్యవస్థ నుండి బైటకు రప్పించి ధర్మమార్గంలో నడిపించిన ఆదర్శ దార్శనికుడు గౌతమ బుద్ధుడే!బుద్ధుని జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ఆయన లుంబినీవనంలో పుట్టిందీ, బుద్ధగయలో బుద్ధత్వం పొందిందీ, చివరకు కుసీనగరంలో నిర్వాణం చెందిందీ వైశాఖ పున్నమి రోజునే! అందుకే ఈ వైశాఖ పున్నమి ఒక బుద్ధ జయంతి... ఒక బుద్ద వర్ధంతి! అంతేకాదు.. యశోధర జయంతి కూడా ఈనాడే!
– డా. బొర్రా గోవర్ధన్‌

బుద్ధుణ్ణి సంసార చక్ర విధ్వంసకుడు అంటారు. సుఖదుఃఖాల గానుగ మరలాంటి సంసార చక్రాన్నుండి మానవాళిని బైట పడేసి, రక్షించిన ధార్మికునిగా బుద్ధుని కీర్తిస్తారు. కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, పదవి, అధికారం, శాసనం, యుద్ధం... ఇవన్నీ ఒకే ఒరలో దాగిన రకరకాల కత్తులు. వీటివల్ల హింస, ఉన్మాదం కలిగి చివరికి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది మానవ జీవితం. ఈ దుఃఖ మహాసాగరాన్నుండి బైటకు వచ్చి, యోగం, ధ్యానం, సమాధి, ఇలాంటి స్థితుల్ని సాధించి ముక్తి, కైవల్యం లేదా నిర్వాణ మార్గాన సాగితే శాశ్వతంగా దుఃఖం నుండి మనిషి విముక్తుడవుతాడని భారతదేశంలో పుట్టిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు చెప్పాయి.

వాటిలో బౌద్ధం కూడా ఒకటి. దుఃఖ నివారణ మార్గంలో నిర్వాణాన్ని అది చెప్పింది. సంసారాన్ని త్యజించి భిక్షువులుగా, సంసారంలోనే ఉంటూ, ఉపాసకులుగానూ ఈ నిర్వాణ స్థితుల్ని పొందవచ్చునని బుద్ధుడు చెప్పాడు. దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరించే వారందరికీ ఒక సంఘాన్ని స్థాపించాడు. అదే బౌద్ధ సంఘం. ఆ సంఘంలో చేరి ధర్మాచరణ ద్వారా, ధర్మాన్ని ప్రచారం చేసే వారే భిక్షువులు. వీరికి కుటుంబం ఉండదు. ఆస్తిపాస్తులుండవు. వ్యక్తిగత వస్తువులు ఉండవు. అన్నీ సంఘానివే. అన్నీ ఉమ్మడివే! నియమ నిబంధనల రూపకల్పనలో కూడా ఉమ్మడి నిర్ణయమే తుది నిర్ణయం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top