పురుగుతో కైలాసం

Great Writer Chalam E Lokam Story Summary - Sakshi

కథాసారం

మా పెద్ద తగాదా ఐన తరవాత మూడువారాలకి జయలక్ష్మి ఓనాటి ఉదయం చీటీ పంపింది.

కాని నాకు తెలుసు. కలుసుకున్నా లాభం లేదు. సాయంత్రం లోపలే మళ్లీ పోట్లాడుకుంటాము. కాని పోట్లాడి విడిపడ్డ తరవాత, జీవితంలో యీ కాసిని గంటలూ ఎందుకు వృథా చేసుకుంటున్నామా అని నిశ్చయంగా పరితాపపడి నిలవలేక నిమిషాలమీద కలుసుకుంటాము.

కాదు. ఈవేళ స్పష్టంగా మాట్లాడి వొస్తాను. ఇక లాభం లేదని, నా కోసం చీటీ రాయవద్దని, నిశ్చయంగా చెప్పేసి వెళ్లిపోతాను. ఈ మాత్రం అందం దొరకదా ఏమిటి నాకు?

సామాను సద్దమన్నాను నౌకర్ని. బొంబాయికి బెర్తు రిజర్వు చేయించాను. తాత్సారం చేసి చేసి నాలుగింటికి బైలుదేరాను జయలక్ష్మి ఇంటికి.

తలుపు లోపల గడియవేసి వుంది. గట్టిగా తలుపు కొట్టాను. దూరంనించి దాసీది కనకం వొస్తున్నానని కేకవేసింది. అమ్మగారు తలంటి పోసుకుంటున్నారుట.

గదిలో కూచున్నాను. అరగంటయింది. దూరంగా నీళ్లు పోసుకుంటున్న చప్పుడు తప్ప ఇంకేం వినపట్టంలేదు. రాదేం ఇంకా? కావలిసే ఈ ఆలస్యం? సరాసరి నీళ్ల గదిలోనికి వెడితే?

‘‘జయా!’’ నమ్రతగా పిలిచాను.
‘‘ఏం సంగతి!’’ వెక్కిరింపు.
‘‘ఎంతసేపు’’

‘‘నాలుగు గంటలు కాలయాపన చెయ్యగలిగిన అయ్యగారికి యీ పది నిమిషాలు భారమైనాయి గావును’’ అని చీదరించుకుంది.

నా కోపాన్ని మింగుకుని– ‘‘ఒక్కసారి నిన్ను చూడనీ.’’

‘‘వీల్లేదు. నేను వొచ్చేలోపల దొడ్లోకి వెళ్లి స్తానం చేస్తున్న నీటి కాలవని ఆరాధించండి.’’

విసుక్కుని దొడ్లోకి పోయినాను. తూములోనుంచి నవ్వుతో దూకుతున్నాయి తెల్లటి నీళ్లు– వట్టివేళ్ల సున్నిపిండితో పరిమళమైన నీళ్లు.

ఇంతేనా? ఈమెని విడవలేనా? మళ్లీ ఆ మాయలో పడుతున్నానా? స్త్రీలేంది బతకలేను. స్త్రీతో వేగలేను. ఈ చక్రంలోంచి విముక్తి లేదా? మోహప్రవాహంలో ఇట్లా కొట్టుకుపోవడానికి వొప్పుకోను.

ఆ నీళ్ల కాలవ వెంట పదడుగులు నడిచాను. ఆ నీళ్లు ఓ మురిగిన పేడకుప్పని పాయలై చుట్టుకుంటున్నాయి, స్త్రీ హస్తాల వలె. చప్పున పెద్ద విరక్తి తోచింది. ఇంతే స్త్రీ మోహం. ఇంతకన్న నీచం ఇంకేంలేదు.

నా కళ్లముందు ప్రపంచం తళతళమంది. దివ్యచక్షువు తెరుచుకున్నట్టయింది. ఇల్లు దొడ్డి అన్నీ మాయమైనాయి. నా ముందు ఆ మురిగిన పేడకుప్ప తప్ప యింకేం కనిపించలేదు. ఆ పేడకుప్ప పెరిగి నా లోకమైపోయింది. నా దృష్టి ఆ పేడని చీల్చుకుని చూస్తోంది. కుప్పనిండా పురుగులు– పెద్దవీ, చిన్నవీ. వాటి సంభాషణ కూడా అర్థమౌతోంది.

టీచరు: ‘‘భూమి గుండ్రముగా వుందనడానికి నిదర్శనం ఏమిటి?’’
విద్యార్థి: ‘‘ఎంత తిరిగినా పేడ తప్ప ఏం కనిపించదండీ.’’
టీచరు: ‘‘రైట్, పది మార్కులు. కొన్ని యుగాల కిందట, ఈ భూమి పొగలు కక్కుతూ ఉండేదిట. ఇప్పుడు చల్లారింది. అటు తరవాతే యీ జీవసృష్టి ప్రారంభమైంది.’’
(ఇందాకనేకదా ఆవు పేడ వేసింది. ఆ వేడి సంగతి గావును!)

పక్కనే ఇంకోచోట ఒక సభ జరుగుతోంది. అక్కడ కాషాయ వస్త్రాలు వేసుకున్న పురుగూ, నల్లటి సూటు వేసుకున్న తెల్లటి పురుగూ సభలో ఎత్తు స్తలం మీద కూచున్నారు. సూటు పురుగు ఉపన్యాసం ఇస్తోంది.

‘‘నిన్న రాత్రి నాకు కలలో ఈశ్వరుడు కనబడ్డాడు. ఈ కొత్త మతవిధానాన్ని ప్రసాదించాడు. ఇంక కొత్తయుగం ప్రారంభం కాబోతోంది. ఇంక మరణభయం లేదు’’

ఇంతలో పొరుగమ్మ వొచ్చి పేడ ఓ ముద్ద చేతిలోకి తీసుకుంది. ఆ ముద్దలో యీ ఉపన్యాసకుడు కూడా లేచి వెళ్లిపోయినాడు. సభాసదులంతా ‘బొందితోనే కైలాసానికి వెళ్లాడని’ అతనికి గొప్ప సమాధి కట్టించడానికి తీర్మానాలు చేసుకుంటున్నారు.

ఆ పక్కనే ఓ ఆడపురుగు తన పిల్లతో అంటోంది– ‘‘ఒసే ఎన్నడన్నా మన వంశంలో వుందే ఇట్లాంటి నీచపు గుణం? ఆ పాడు మురికి నల్లపురుగుని నీ తోకతో దాని ముదనష్టపు తోకని కలవనిచ్చావే!’’
ఇంకోవేపు చూశాను. రెండు పురుగులు పోట్లాడుకుంటున్నాయి.

‘‘నా గీతాలు ఆచంద్రార్కంగా నిలుస్తాయి. ఈ పేడకుప్పలో నా అంత అందంగా రాసేవాణ్ణి చూపగలవా? నీ మొహం నువ్వూ ఓ కవివే!’’

రెండో పురుగు: ‘‘నా కవిత్వం ఈనాటి ప్రజలకు కాదు. నాలుగు యుగాలు పోయాక పుట్టబోయే పురుగులకి. అవి నీకన్న తెలివైన మెదడుతో పుడతాయి.’’

ఇంతలో ఓ బొండుపురుగు సమీపించి ‘‘నాకో పుస్తకం అంకితం ఇవ్వరా మీలో వొకరు? నా పేరు ఆకల్పాంతం నిలుస్తుంది. నేను పుస్తకాన్ని అందంగా పేజీకి ఒక్క పంక్తి చొప్పున అచ్చు వేయిస్తాను’’ అంటోంది.
ఇంక కొంతదూరంలో ఒక మొండిగోడల ఇల్లు కనపడ్డది. దాంటో కొన్ని పురుగులు తలకిందుగా వేళ్లాడుతున్నాయి. కొన్ని మేకుల మీద పడుకునివున్నాయి. చెక్క మీద ‘‘యోగాశ్రమం. దీంటోకి స్త్రీలు ప్రవేశించకూడదు’’ అని వుంది.

వాకిలిముందు ఒక పెద్ద సభ. ఆశ్రమపు అధ్యక్ష పురుగు ఉపన్యాసం ఇస్తోంది. ‘‘ఈలోకం అసత్యం. ఆత్మ శాశ్వతం. ఇంద్రియాల్ని అరికట్టితేనేగానీ ఆత్మజ్యోతి దర్శనం కాదు. యోగప్రభావం వల్ల గాలిలో పైకిలేచే శక్తి వొస్తుంది.’’

అంటోవుండగా ఆ వేపుకు వొచ్చిన ఓ కోడి ఆ యోగిపురుగుని ముక్కుతో పైకెత్తింది. పురుగుల కళ్లదృష్టి అంతయెత్తుకి చూడలేదు గనక ఆ యోగి అట్లా పైకి లేచి వెళ్లిపోయినాడనుకొని భక్తితో అన్ని పురుగులు సాష్టాంగపడ్డాయి.

కొన్ని పురుగులు ఒకచోట చేరి, సభ చేస్తున్నాయి. ‘‘మన పేడ వేరు, మన జాతి వేరు. పక్కనున్న నల్ల పురుగులు, అవి పేడని వుండలుగా చేసుకునిగాని తినవు. మనం ఎట్లానన్నా సత్యాగ్రహం చేసి ఐనా సరే విడిపోవాలి’’ అంటూ వుండగా పైనించి ఆవు వుచ్చపోసింది. ఆ ధారతో ఆ దేశమంతా జలమయమయింది. బతికిన ఒక జడలపురుగు ‘‘ఈ వరదలు మన తాతలు చేసిన పాపాలకి ఈశ్వరుడు కోపించి చేసిన ప్రతీకారం’’ అంటున్నాడు.

ఒక తెల్లని గడ్డంపురుగు, ‘‘ఇదేమి మూర్ఖం, మన తాతలు చేసినదానికి మన మీద కోపం కలుగుతుందా ఈశ్వరుడికి? అదేదో నీటిధార పడ్డది. శాస్త్రజ్ఞులు దానికి కారణం కనుక్కోగలరు!’’ అన్నాడు. ఆ మాటలకి పురుగుజాతికి కోపమొచ్చి, ఆ గడ్డంపురుగుని మోసుకుపోయి గట్టిపేడలో వూపిరాడకుండా పాతి చంపేశాయి.

ఇంకొకచోట అఖిల సారస్వత సమ్మేళనం. ఒక సంపాదకీయ పురుగు చచ్చిన చిన్న పురుగుమీద నుంచుని ఉపన్యాసమిస్తోంది. ‘‘ఈ పురుగు పేడ వాంగ్మయానికి చాలా సేవచేసింది. మనం ఒక్క సన్మానమూ చెయ్యలేదు. మనం చందాలిచ్చి గొప్ప స్మారకచిహ్నం కట్టాలి.’’

గుసగుసలాడుతున్నారు సభాసదులు. ‘‘చందాలన్నీ వీడే కొట్టెయ్యడానికి.’’

అక్కడే ఓ ముసలిపురుగు కొంత పేడని పోగుచేసుకుని దానిమీద కూచుంది. పిల్ల కవి పురుగులు తమ రచనల్ని అర్పించి, వరుసగా చదువుతున్నాయి. ఆ పురుగు తన యిష్టప్రకారం ‘‘ఈ కావ్యం తుక్కు. ఈ కావ్యం పదేళ్లు నిలుస్తుంది’’ అంటోంది. అందమైన ఆడపురుగుల కావ్యాలు మాత్రం ఆచంద్రార్కంగా నిలుస్తాయని దీవించి, తన పీఠం మీద కూచోపెట్టుకుంటోంది.

ఇంతలో పెద్దపెద్ద జండాలతో అరుపులతో ఓ పురుగు గుంపు ప్రవేశించింది. ‘‘లాగెయ్యండి వాణ్ణి. కిందికి లాగెయ్యండి. ఇదంతా పేడ గలవారి సారస్వతం. వీళ్లు రాసే గ్రంథాలూ, కవిత్వాలూ, ఎవరికీ అర్థం కావు. దేవుడూ భక్తీ శృంగారం ఇట్లాటివే రాస్తారు వీళ్లు. వీళ్లనీ వీళ్ల కవిత్వాన్ని ధ్వంసం చేస్తేనేగానీ శాంతి లేదు లోకానికి’’ అని చిందరవందరచేసి పోయినారు వాళ్లు.

ఇంతలో పెద్ద పెద్ద జండాలు పట్టుకుని ఓ గుంపు ప్రవేశించింది. దాంటో బక్కపురుగు, గంభీరోపన్యాసం ప్రారంభించింది. ‘‘యీ పురుగు దేశముందే యిది దేవతలు స్వయంగా నిర్మించుకున్న భూమి. దీనికి పతనం లేదు. ఇది అనంతకోటి యుగాల వరకు ప్రపంచానికి జ్యోతిౖయె వెలగాలంటే, నాకు మీ ఓట్లు యివ్వండి...’’

ఇంతలో జయలక్ష్మి స్నానం నీళ్లు పేడకుప్ప చుట్టూ పెద్దమడుగు కడుతున్నాయి. పేడ నాని పెళ్లలు పెళ్లలుగా కూలిపోతోంది.

‘‘అసలు పచ్చి పేడనేగానీ మగ్గిన పేడని తినకూడ’’దని కొన్ని పురుగులు బోధిస్తున్నాయి. పేడరసాన్ని పులిపించి తాగడంవల్ల ఘోరాలు తటస్తిస్తున్నాయననీ, పేడ మద్యాన్ని నిషేధించమనీ ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నాయి కొన్ని పురుగులు.

ఇంతలో జయలక్ష్మి దాసీది వొచ్చి పొయ్యి అలకడానికి ఆ పురుగులున్న పేడనంతా ముద్దచేసి తీసుకుపోయింది. ఆ ముద్దకింద నించి రెండు తెల్లటి పురుగులు బైటపడ్డాయి. ఒకదానికి జయలక్ష్మి మొహం, ఇంకాదానికి నా మొహం. వెంటనే పేడకుప్ప నా కళ్లముందు మాయమై ప్రపంచం మామూలుగా ప్రత్యక్షమయింది. జయలక్ష్మి తలలో కదంబం, గులాబి పువ్వులు పెట్టుకుని, ఆకుపచ్చ వెంకటగిరి చీర కట్టుకుని, నవ్వుతోంది నన్ను చూసి.

‘‘ఆరాధన అయిపోయిందా?’’
‘‘ఏం బతుకు మనది?’’
‘‘ఈ తగాదాలేనా?’’
‘‘అసలు ఈ ప్రేమ’’
‘‘బతుక్కీ ప్రేమకీ కూడా అర్థం కనపట్టం లేదా మీకు?’’
‘‘ఏమిటో యిప్పుడు పుట్టి రేపు నశించే పురుగులం’’
‘‘కాని ఈ రాత్రికి దేవతలం’’
‘‘పోట్లాడతావు నాతో’’
‘‘నా పోట్లాట మాత్రం ఏం శాశ్వతం? ఎందుకంత బాధగా తీసుకోవాలి నువ్వు? ఏదో రేపు పొద్దున్నకి నశించేవాడివి? పద.’’
రెండు పురుగులు గూట్లోకి వెళ్లాయి.

-మహారచయిత చలం(1929–89) కథ ‘ఈలోకం’ సంక్షిప్త రూపం ఇది. కానీ దీని పూర్తి పాఠం చదివితేనే అసలైన మజా!

చలం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top