విశ్వశాంతి విధాత | Global Peace vidhata | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి విధాత

Mar 8 2017 1:04 AM | Updated on Sep 5 2017 5:27 AM

విశ్వశాంతి విధాత

విశ్వశాంతి విధాత

అశాంతి, అలజడి, ఘర్షణ, యుద్ధం వంటి సంక్షోభాలను పరిష్కరించడంలో...

అశాంతి, అలజడి, ఘర్షణ, యుద్ధం వంటి సంక్షోభాలను పరిష్కరించడంలో, చర్చలను ఓ కొలిక్కి తీసుకు వచ్చి శాంతిని స్థాపించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది. మహిళల చొరవతో, వారి భాగస్వామ్యంతో నెలకొనే శాంతి కూడా సుదీర్ఘ కాలం కొనసాగుతుంది. అందుకు కొన్ని నిదర్శనాలివి.

విరోధులను ఒకటి చేశారు
జాతి, మత, రాజకీయ విభజనలతో, అంతర్గత ఘర్షణలతో సతమతవుతున్న లిబియాలో... మహిళలు శాంతి వారధులుగా క్రియాశీలంగా ఉన్నారు. లేమా గ్బోవీ అనే మహిళ క్రైస్తవ, ముస్లిం మహిళలను ఏకతాటిపైకి తెచ్చారు. ఏళ్ల తరబడి ఘర్షణ పడుతున్న ఇరువర్గాలూ ఆ హింసకు చరమగీతం పాడేలా ఒత్తిడి తేగలిగారు. ఈ కృషికి గాను ఆమెకు 2011లో నోబెల్‌శాంతి బహుమతి లభించింది.

ముందే మేల్కొలిపారు!
హింస పేట్రేగే ప్రమాద సూచనలను పసిగట్టి, దానిని నివారించడంలో మహిళలు ముందు నిలుస్తారు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్‌ హింస ప్రమాదాలను భద్రతా బలగాలు విస్మరించగా, స్థానిక మహిళలు గుర్తించారు. అనుమానాస్పద సంచారం, రవాణాలను, తమ కొడుకులను ఉగ్రవాదం వైపు మళ్లేలా జరుగుతున్న ప్రమాదాలను ఆ మహిళలు గుర్తించి అప్రమత్తం అయ్యారు.

విభజనను వ్యతిరేకించారు
బోస్నియాలో మహిళలు దేశ విభజనను వ్యతిరేకించారు. అలా చేయడం వల్ల ఆర్థిక, రాజకీయ, సమాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. దేశంలోని విభిజన్న జాతుల వారితో ఈ రంగాలన్నీ ముడిపడి ఉన్నాయన్న బలమైన అవగాహన వారికి ఉంది.

విరమణకు కృషి చేశారు
సాధారణంగా మహిళలను ప్రమాదకారులుగా చూడరు. ఈ కారణం వల్ల సిరియాలో మహిళలు తటస్థ మధ్యవర్తులుగా, రాయబారులుగా వ్యవహరిస్తున్నారు. హింసతో తలపడుతున్న విభిన్న సాయుధ బృందాల మధ్య స్థానికంగా కాల్పుల విరమణ ఒప్పందాలు జరగడానికి కృషి చేస్తున్నారు.

దేశాన్ని పునర్నిర్మించారు
జాతి నిర్మూలన హింస జరిగిన రువాండాలో... మహిళలు వినూత్న పద్ధతులతో దేశాన్ని పునర్నిర్మించారు. జాతుల మధ్య వైరాన్ని అంతం చేయడానికి, పరిపాలన సక్రమంగా సాగడానికి దోహదపడ్డారు.  

‘భద్రతకు’ బలమిచ్చారు
పోలీసులు, సైన్యం తదితర భద్రతా బలగాలు సమర్థవంతంగా పనిచేయడానికి అందులోని మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. పాకిస్తాన్‌ పోలీసు, సైనిక దళాల్లో పనిచేస్తున్న మహిళలు.. చెక్‌పోస్టుల వంటి ప్రదేశాల్లో ఇతర మహిళలను తనిఖీ చేయడం, మహిళా బాధితులతో మాట్లాడడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

అయితే... ఇంత చేస్తున్నా ప్రధాన నిర్ణయాల్లో మహిళల పాత్ర నామమాత్రమే!: ప్రపంచ జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు ఎన్నో సమర్థతలు ఉన్నా కానీ... ఏ దేశంలోనైనా సరే శాంతి, భద్రత, పరిపాలన, న్యాయం వంటి అంశాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు ప్రధానంగా పురుషులే చేస్తున్నారు. చర్చలు, సంప్రదింపుల వంటి వాటిలోనూ మహిళల పాత్ర నామమాత్రమే. శాంతి చర్చల్లో పాల్గొంటున్న మహిళలు 9 శాతంగా ఉంటే.. అధికారికంగా ఆ శాంతి చర్చలను ఖరారు చేసే వారిలో కేవలం 4 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement