గౌట్‌  సమస్యకు పరిష్కారం ఉందా? 

 Family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 36 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్‌ అని చెప్పారు.  మందులు వాడినా  సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?  – ఆర్‌. కోటయ్య, నరసరావుపేట 
గౌట్‌ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్‌’ అంటారు. 

కారణాలు: 
∙సాధారణంగా రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది.
∙ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం.
∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. 

లక్షణాలు: 
∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 

నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. 
చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

పొద్దున్నే  మడమల్లో నొప్పి...తగ్గేదెలా? 
నా వయసు 34 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఏదైనా సపోర్ట్‌ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. హోమియో పరిష్కారం చెప్పండి.  – మంజరి, సికింద్రాబాద్‌ 
అరికాలులో ఉండే ప్లాంటార్‌ ఫేషియా అనే లిగమెంటు  ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి  ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్‌ ఫేషియా డ్యామేజ్‌ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తుంది. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్‌ ఫేషియా డ్యామేజ్‌ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్‌ ఫేషిౖయెటిస్‌ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. 

కారణాలు: ∙డయాబెటిస్‌ ∙ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం ∙తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ∙ఎక్కువగా హైహీల్స్‌ చెప్పులు వాడటం (మహిళల్లో) 

లక్షణాలు: ∙మడమలో పొడినట్లుగా నొప్పి ∙ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం ∙కండరాల నొప్పులు 

చికిత్స: మడమనొప్పికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.  మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో),  స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

యానల్‌  ఫిషర్‌   బాధిస్తోంది! 
నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పి ఆపరేషన్‌ చేయాలన్నారు. హోమియోలో ఆపరేషన్‌ లేకుండా దీనికి చికిత్స ఉందా? – ఎమ్‌. రత్తయ్య, అనకాపల్లి 
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. 
కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.
లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట. 
చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top