శానిటైజర్‌ తయారీ ఇక ఇంట్లోనే

Doctor Siva Kalyani Homemade Sanitizer - Sakshi

హోమ్‌ మేడ్‌

డాక్టర్‌ శివకల్యాణి ఆడెపు హైదరాబాద్‌ ఐఐటీలో మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చ్‌స్కాలర్‌. ఆమె తన పరిశోధన సమయంలో చేతులను శుభ్రం చేసుకోవడానికి సొంతంగా హ్యాండ్‌ శానిటైజర్‌ను తయారు చేసుకుని వాడుకునే వారు. నగరంలో కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పుడు ఐఐటీ క్యాంపస్‌లో ఉన్న మూడు వేల మందికీ హ్యాండ్‌ శానిటైజర్‌ల అవసరం ఏర్పడింది. దేశవిదేశాల నుంచి కూడా స్టూడెంట్స్‌ వస్తుంటారు. వారందరి అవసరాల కోసం శివ కల్యాణి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసుకున్న శానిటైజర్‌కు గిరాకీ పెరిగింది. యూనివర్సిటీ అవసరాలకు తగినంత మోతాదులో తయారు చేశారు శివకల్యాణి. ఇదే ఫార్ములాను ఇంట్లో తయారు చేసుకోదగినట్లు కొద్దిపాటి మార్పులతో సాక్షికి వివరించారు.

అర లీటరు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఆ నీటిని ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వచ్చేవరకు వేడి చేయాలి. నీటిని నేరుగా పాత్రను స్టవ్‌ మీద పెట్టి కాచేటట్లయితే నీరు బుడగలు వచ్చి మరిగే వరకు వేడి చేయాలి. ఆ నీటిని గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు పక్కన ఉంచాలి. చల్లారిన తర్వాత పావు లీటరు నీటిని మాత్రమే ఒక బాటిల్‌లో పోసి అందులో 750 మి.లీ ఐసోప్రొఫెనాల్, యాభై మి.లీల గ్లిజరిన్, ఒకటి నుంచి ఒకటిన్నర ఎం.ఎల్‌. హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ను కలపాలి. ఈ మిశ్రమం సమంగా కలిసే వరకు బాటిల్‌ను షేక్‌ చేయాలి. ఇలా తయారైన శానిటైజర్‌ బాటిల్‌లో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. శానిటైజర్‌ను చేతుల్లో వేసుకున్న తర్వాత ముప్పై సెకన్ల పాటు వేళ్లసందుల్లో మొత్తం బాగా పట్టేటట్లు రుద్దాలి.

ఇలా తయారు చేసుకున్న శానిటైజర్‌ పాడవదు. అయితే... ఇది ఆల్కహాల్‌ ఆధారితం కావడంతో మూత గట్టిగా పెట్టుకోకపోతే ఆవిరైపోతుంది. కాబట్టి మూత గట్టిగా పెట్టుకోవాలి. మంచి వాసన కోసం లెమన్‌ గ్రాస్, టీ ట్రీ ఆయిల్‌ వంటివి కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. ఈ ఆయిల్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి సువాసనతోపాటు శానిటైజర్‌ పనితీరును మరింతగా మెరుగుపరుస్తాయి కూడా. హోమ్‌మేడ్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ తయారీలో వాడే బాటిళ్లను హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌తో శుభ్రం చేయాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top