జల్లెడని నీళ్లతో నింపండి!

Disciples gave a wonderful lesson about creativity - Sakshi

చెట్టు నీడ

ఒక గురువు తన శిష్యులకు సృజనాత్మకత గురించి అద్భుతమైన పాఠం చెప్పాడు. ఆ పాఠం మనసులో నాటుకుపోయి, తమ సృజనాత్మకత నిరూపించుకునే అవకాశం అడిగారు శిష్యులు. వారి చేతికి ఒక జల్లెడ అందించి దాని నిండా నీరు నింపమని ఆదేశించాడు గురువు. దగ్గరలోని నదికి వెళ్ళి నీటితో జల్లెడ నింపుతున్నారు శిష్యులు. ప్రతిసారీ రంధ్రాల ద్వారా ధారలు కురిసి జల్లెడ ఖాళీ అవుతోంది తప్ప శిష్యులు సఫలీకృతులు కాలేదు.  చాలా సేపటి తరువాత వారిని  వెతుకుతూ వచ్చిన గురువు జరిగింది తెలుసుకుని చిరునవ్వు నవ్వాడు. జల్లెడ అందుకుని ప్రవాహంలో దిగి నీటి లోపల వదిలాడు. జల్లెడ నీటిలో పూర్తిగా మునిగింది. జల్లెడ నీటితో  నిండింది. ఆ ఆలోచన రానందుకు సిగ్గుపడ్డారు శిష్యులు. ‘‘జల్లెడను వెనక్కు ఇవ్వమనే నిబంధన లేనప్పుడు సృజనాత్మకంగా ఆలోచించి వుంటే జల్లెడ నింపడం సులువయ్యేది’’ అన్నాడు గురువు.    

శిష్యుల మాదిరిగానే చాలా మంది మూస ధోరణిలో ఆలోచిస్తూనే  తమ ప్రయత్నాలను గుర్తించడం లేదని, సృజనాత్మకత మరుగున పడి మసక బారుతోందని గగ్గోలు పెడతారు. ఇందుకు మరో ఉదాహరణ చూద్దాం... జైలులో ఉన్న యువకుడైన కొడుక్కి వృద్ధుడైన తండ్రి ‘వయసు మీద పడి తోట తవ్వలేక పోవడం వలన తల్లికి ఇష్టమైన బంగాళ దుంపలు వేయలేక పోయానని’ ఉత్తరం రాసాడు. ఆ కొడుకు ఆలోచించి  ‘‘పొరపాటున కూడా  తోట తవ్వకు. అందులో తుపాకులు దాచానని తంతి సమాచారం తిరిగి పంపాడు. ఆ ఉత్తరం చదివిన పోలీసులు మందీ  మార్బలంతో  వెళ్లి తోట మొత్తం తవ్వించారు. ఆ భూమిలో తుపాకులు దొరకలేదు. పోలీసులు చేసిన పని వివరిస్తూ మరో ఉత్తరం కొడుక్కి రాసాడు తండ్రి.  ‘‘జైలులో వున్న నేను ఇంతకన్నా సాయం చేయలేను. ఎలాగూ పోలీసులు భూమిని తవ్వారు. ఇప్పుడు అమ్మకిష్టమైన బంగాళదుంపలు పండించు’’  అని జవాబిచ్చాడు కొడుకు. ఆ యువకుడిలా కొత్తగా ఆలోచిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. 
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top