తలిస్తే... అనుగ్రహిస్తాడు | Devotional information | Sakshi
Sakshi News home page

తలిస్తే... అనుగ్రహిస్తాడు

Dec 3 2017 12:51 AM | Updated on Dec 3 2017 12:51 AM

Devotional information - Sakshi

మనిషిని సంస్కరించి, కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది, ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చి తద్వారా యావత్‌ మానవ సమాజాన్నీ స్వర్గ ధామంగా, కలియుగ వైకుంఠంగా, ఆనంద నిలయంగా మార్చుకోవడానికి మార్గదర్శకమైనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమే దత్తప్రభువు వివిధ కాలాల్లో వివిధ గురు స్వరూపాలుగా వెలుస్తూ, లోకులకు జ్ఞానబోధ కావిస్తూనే ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనృసింహసరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, అక్కలకోట మహరాజు, షిరిడి సాయిబాబాలను దత్త పంచకమంటారు. నేడు మార్గశిర పౌర్ణమి... దత్తులవారి అవతరణ దినోత్సవం సందర్భంగా... 

అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువయ్యాడు.  మాయా ప్రభావంతో దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధలకు, ఆచార వ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్టరక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే ఆయన గురుతత్త్వం.

జ్ఞానజ్యోతులు వెలిగించి, ప్రజల అజ్ఞానపు చీకట్లు తొలగించేందుకు వెలసిన దత్తస్వామి రూపం నయన మనోహరం, భద్రపదం, భవ బంధ నాశనం, భవసాగరతారకం. సర్వసృష్టినీ ప్రేమించే ఆ కరుణామూర్తి అనేక విశిష్టతలకు కాణాచి. దత్తావతార ముఖ్యోద్దేశం భిన్నత్వంలో ఏకత్వసాధన. అన్ని సాధనలను ఏకం చేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలచి, వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి, సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేయడం... సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహించడం దత్తాత్రేయుడి తత్వం. సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చన్నదే దత్తసాంప్రదాయం.

దత్తాత్రేయుని స్వభావంలో మూడు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి. మెుదటిది ఆయన తమ నామ స్మరణతో సంతుష్ఠులై స్మరించగానే కదలి వస్తారు. అందుకే ఆయనను స్మర్తృగామిగా కీర్తిస్తారు. రెండవది వారు భక్తులకు ఇహ పర సౌఖ్యాలను ఇస్తూ, యోగశక్తిని ప్రసాదించి, జీవన్ముక్తులుగా చేస్తారు. మూడవ లక్షణం... భక్తుల వెన్నంటే ఉంటూ, వారి మంచి చెడ్డలు చూస్తూ, వారికి దత్తమౌతాడు. ఈ మూడు లక్షణాలు వారిలోని దైవ, గురు లక్షణాలను సూచిస్తాయి. ఈ స్వభావం ఆధారంగానే లక్షణాలను, లక్ష్యాలను గుర్తించవచ్చు.

దత్తునిది జ్ఞానతత్త్వం. ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు. దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. అలాగే ప్రహ్లాదునికి ఆథ్యాత్మిక విద్య, వశిష్టునికి యోగవిద్య, పరÔ]æురామునికి శ్రీవిద్య, కార్తవీర్యునికి ఆత్మవిద్య, అలర్కునికి యోగవిద్య... ఇలా ఎంతోమంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు. ఇందులో సంతులు, సాధువులు, అవధూతలు ఎందరో వున్నారు.

దత్తాత్రేయునిది నిత్యం ఆసేతు హిమాచలం చుట్టివచ్చే తత్త్వం. ప్రతి ఉదయం కాశీలో గంగాస్నానం, గాణుగాపురంలో ధ్యానం, కొల్హాపురంలో భిక్ష, కురుక్షేత్రంలో ఆచమనం... ఇలా వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ భక్త జనావళిని జాగృతపరుస్తూ ఉంటాడు. దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది. ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒõ  సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల దత్తజయంతినాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది. ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

దత్తాత్రేయునిది శివకేశవుల అభేద తత్త్వం. జ్ఞానం కోసం పరమేశ్వరుని, మోక్షం కోసం విష్ణువును ప్రార్థించి, పూజాపురస్కారాలు లేని బ్రహ్మతోకలసి, బ్రహ్మవిష్ణువుల రూపంతో వెరసి దత్తాత్రేయావతారం భువిపైకి వచ్చింది. శైవం, వైష్ణవం వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని తెలిపేందుకే దత్తతత్త్వం ఉదయించింది. దత్తుని పూజిస్తే మోక్షం, జ్ఞానం ఒకేసారి పొందవచ్చు.
ఈ దత్తావతారాల విశిష్టత ఏమిటంటే, వీరి భౌతికదేహాలు అంతమైనా, వీరి ఉనికికి భంగం రాదు. దేహంతో ఉన్నప్పుడు కూడా వీరు ఆపదలో ఉన్నవారిని అనేక విధాలుగా కాపాడారు. వీరి భౌతిక శరీరాలు గుప్తమైనా వీరి లీలలు కొనసాగుతూనే వుంటాయన్నది వీరి వాగ్దానం. అందుకే శిరిడీసాయి ‘‘నా సమాధి అనంతరం నా మట్టే మీ కోర్కెలకు ప్రతిస్పందిస్తుంది’’ అని అన్నారు. వీరి చరిత్రల పారాయణల ద్వారా దత్తరూపాలన్నింటిని ఏదో విధంగా సేవించి, తరించే దారి దొరుకుతుంది. చింతనం, నామస్మరణం వీరి అనుగ్రహం సంపాదించేందుకు సులభమైన, శ్రేష్ఠమైన మార్గాలు.

దత్తాంశతో వారి అవతారాలుగా జన్మించిన వారందరి అవతారలక్ష్యం ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం తెలుపుతూ, నడిపించటమే. ప్రతి అవతారంలో సారూప్య, స్వభావాలు ఇంచుమించు ఒకేవిధంగా ఉండటం విశేషం. గురుపరంపరలో దత్తాత్రేయుడు ఒక అవతారం పరి సమాప్తి అయిన తరువాత మరొక నామధేయంతో వేరొక అంశావతారంతో కాలానుగుణంగా తన ప్రవర్తనను సమన్వయ పరుస్తూ జనులను ఉద్ధరించారు. అందుకే దత్త జయంతిని గురుప్రచార తత్త్వానికి అంకితం చేస్తూ, ఆ రోజు, జప, తపాలతో ధ్యానించి తరించాలి.

– దువ్వూరి భాస్కరరావు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement