అమృత సేద్య సేనాని!

Deepak Sachde Amrut Krushi Farming special story In Sagubadi - Sakshi

తెలుగు నాట సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసిన వారికి ‘అమృత జలం’, ‘అమృత మట్టి’ వంటి వాటి గురించి కూడా తెలిసే ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన సుభాష్‌ పాలేకర్‌ ప్రచారంలోకి తెచ్చిన జీవామృతం, ఘన జీవామృతం మాదిరిగానే.. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ సచ్‌దె ‘అమృత కృషి (నేచు–ఎకో ఫార్మింగ్‌)’ పేరుతో తనదైన ప్రత్యేక ప్రకృతి వ్యవసాయ పద్ధతిని వ్యాప్తిలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. టెర్రస్‌ కిచెన్‌ గార్డెన్లు, పెరటి తోటల పెంపకంపై కూడా కృషి చేశారు. దీపక్‌ సచ్‌దె నవంబర్‌ 1న రైలులో ప్రయాణిస్తూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దేశంలో రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల వ్యాప్తికి విశేషంగా దోహదపడిన కొద్ది మంది ప్రముఖుల్లో దీపక్‌ సచ్‌దె ఒకరు. ‘అమృత కృషి’ ద్వారా ఆహార స్వావలంబన దిశగా ఆయన చూపిన వెలుగు బాటలో ముందడుగు వేయడమే మనం సమర్పించగల ఘన నివాళి..

‘ఈ కంపోస్టును మా(ఇక్రిశాట్‌) ప్రయోగశాలలో పరీక్షించి చూశాం. ఒకగ్రాము కంపోస్టులో పంటల పెరుగుదలకు దోహదపడే సూక్ష్మజీవరాశి సుమారు 10 కోట్ల వరకు ఉన్నట్లు తేలింది. మేము పరీక్షించిన ఏ ఇతర కంపోస్టులోనూ సూక్ష్మజీవరాశి ఇంత ఎక్కువగా కనిపించలేదు’ అని ప్రసిద్ధ మైక్రోబయాలజిస్టు దివంగత డా. ఓ.పి. రూపేల(అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా స్థానం(ఇక్రిశాట్‌)లో ఆయన ముఖ్యశాస్త్రవేత్తగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు) ఒక వ్యాసంలో రాశారు. ముంబైలో జన్మించిన దీపక్‌ సచ్‌దె మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్య భావజాలంతో ప్రభావితుడై 1980లలో శారదగ్రామ్‌లో సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. గ్రామీణ కుటీర పరిశ్రమల వ్యాప్తిపై పనిచేసి అనుభవం గడించారు. 

1995 నుంచి వ్యవసాయంపై దృష్టి
రసాయనిక వ్యవసాయం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాల గురించి గుజరాత్‌కు చెందిన కపిల్‌ షా వంటి వారు అప్పట్లో రాసిన వరుస వ్యాసాలతో ప్రభావితమైన దీపక్‌ సచ్‌దె.. 1995 నుంచి సహజ వ్యవసాయ పద్ధతుల వ్యాప్తికి కృషి చేయడం ప్రారంభించారు. ప్రయోగ్‌ పరివార్‌ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్త డా. శ్రీపాద ఎ. దబోల్కర్‌ ద్వారా నేచురో–ఎకో ఫార్మింగ్‌ పద్ధతులను దీపక్‌ సచ్‌దె అనురక్తితో నేర్చుకున్నారు. తాను తెలుసుకున్న ప్రకృతి సేద్య మెలకువలను ముంబైకి సమీపంలోని యూసుఫ్‌ మెహరాలి సెంటర్‌ సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఆచరణలో పెట్టి సరిచూసుకున్న తర్వాతే ఇతరులకు చెప్పడం ప్రారంభించారు. 

దబోల్కర్‌ సూచించిన పద్ధతులను మెరుగుపరచడంతోపాటు ఈ సాగు పద్ధతికి ‘అమృత్‌ కృషి’గా పేరు పెట్టారు. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున ఇండోర్‌ సమీపంలోని బజ్‌వాడ అనే ప్రాంతంలో తన మల్పని ట్రస్టు నెలకొల్పిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కనీసం పదేళ్లకు పైగా రసాయన రహిత వ్యవసాయంపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తూ.. రైతులకు శిక్షణ ఇస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో చేసిన ప్రయోగాల్లో నిగ్గుతేలిన శాస్త్రీ్తయ అంశాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి చాటారు దీపక్‌ సచ్‌దె. అమృత మట్టి, అమృత జలం తయారీ, వినియోగంతోపాటు పంటల వేరు వ్యవస్థను లోతుగా విస్తరింపజేయడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించడంపై ఆయన విశేష కృషి చేశారు. రైతులతోపాటు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు సైతం ఆయన వద్ద ఈ పద్ధతులపై శిక్షణ పొందారు కూడా. చనిపోవడానికి వారం ముందు కూడా ఉత్తర గుజరాత్‌లో శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇటార్సిలో రైలులో ప్రయాణిస్తూ నవంబర్‌ 1న గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 

అమృత కృషి పద్ధతులను అవలంభించిన పొలాల్లో అద్భుత ఫలితాలు సాధించినట్లు దీపక్‌ సచ్‌దె సాధికారికంగా ప్రకటించడం విశేషం. తమ వ్యవసాయ క్షేత్రంలోని సాగు భూమిలో సేంద్రియ కర్బనం 8.4%(ఐసిఎఆర్‌) ఉన్నట్లు తేలిందని ఆయన ప్రకటించారు(మన భూముల్లో ప్రస్తుతం 0.2 నుంచి 0.5 వరకు మాత్రమే సేంద్రియ కర్బనం ఉందని అంచనా). తమ వ్యవసాయోత్పత్తుల్లో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్‌ సి, విటమిన్‌ బి12 అత్యధిక పాళ్లలో ఉందని చెప్పేవారు. పండ్లు, కూరగాయల్లో అత్యంత ఎక్కువ పోషక విలువలతో పాటు  రుచికరంగా ఉంటాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని చెప్పేవారు. 

10 గుంటల స్థలం చాలు
 అమృత మట్టి, అమృత జలం ఉపయోగించే సాగు పద్ధతిలో అత్యధిక ఉత్పాదకత సాధించవచ్చు. ప్రతి రైతూ పది గుంటల(10 వేల చ.అ.) స్థలంలో సొంతంగా తన ఐదుగురి కుటుంబం సమృద్ధిగా తినడానికి సరిపోయేలా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకుంటూ ఆహార స్వావలంబన సాధించవచ్చని దీపక్‌ సచ్‌దె నిరూపించారు. దీనిపై పలు అధ్యయనాలు కూడా జరిగాయని భారతీయ సేంద్రియ రైతుల సంఘం(ఓ.ఎఫ్‌.ఎ.ఐ.) పేర్కొంది. మార్కెట్‌ కోసం సాగు చేసే పంటల్లో ఎకరానికి 40 క్వింటాళ్ల ధాన్యం, నిమ్మ చెట్టుకు 2 వేల కాయలు, చెరకు ఎకరానికి వంద టన్నులు, బొప్పాయి చెట్టుకు 150 కిలోలు, టమాటో ఎకరానికి 120 టన్నులు, వేరుశనగ ఎకరానికి 24 క్వింటాళ్ల వరకు ‘అమృత్‌ కృషి’ పద్ధతి ద్వారా అద్భుత దిగుబడులు సాధించామని దీపక్‌ సచ్‌దె ప్రకటించారు. 

అమృత మట్టితో ఇంటిపంటలు కూడా..
విస్తారమైన పంట భూములతోపాటు.. కొద్ది స్థలం ఉన్న పెరటి తోటల్లో, మేడలపైన కుండీలు, మడుల్లో సైతం అమృత సేద్యం నిక్షేపంగా సాగవుతోంది. ఈ చైతన్యాన్ని అనేక రాష్ట్రాల్లో కొందరు రైతులు, సేంద్రియ ఉద్యమకారులతోపాటు ముంబై వంటి నగరాల్లో అర్బన్‌ లీవ్స్‌ ఇండియా వంటి స్వచ్ఛంద సంస్థలు వంటబట్టించుకొని అద్భుత పోషక విలువలతో కూడిన అమృత పంటలు పండించుకొని తింటూ ఆనందంగా ఉన్నారు. మట్టిని నమ్ముకున్న వారికి మేలైన స్వావలంబన వెలుగుబాట చూపిన దీపక్‌ సచ్‌దె కృషిపై మరిన్ని వివరాలకు.. www.amrutkrushi.com
 

పొలం అంతటా మట్టి పరుపులు లేదా ఎత్తు మడులు (రెయిజ్‌డ్‌ బెడ్స్‌) తయారు చేసుకొని పంటలు పండించడం అమృత కృషిలో ఒక విశేషం. పొలమైనా, పెరడైనా, మేడపైన మడి లేదా కుండీ అయినా సరే.. అమృత మట్టిని ఎక్కడికక్కడే బెడ్‌లపై తయారు చేసుకొని పంటలు పండించాలన్నది ఇందులో ముఖ్య విషయం. అమృత జలం తయారీ పద్ధతి: ఒక లీటరు గోమూత్రం, ఒక కిలో తాజా ఆవు పేడ, 50 గ్రా. బెల్లాన్ని, 10 లీటర్ల నీటిని ఒక తొట్టెలో కలపాలి. మూడు రోజులు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ మూడు సార్లు కలగలపాలి. మూడు రోజుల తర్వాత వాడుకోవచ్చు. అమృత జలానికి పది రెట్లు నీరు కలిపి పంటలకు వాడుకోవచ్చు. 

అమృత మట్టి తయారీ పద్ధతి: అమృత మట్టి అనే కంపోస్టు లేదా సేంద్రియ ఎరువు తయారీకి ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. ఒక చోట ఎరువు తయారు చేసి మరో చోటకు తీసుకెళ్లి వేసి పంటలు పండించడం అనేది ఈ పద్ధతిలో వీలుకాదు. ఎందుకంటే.. ఏ పొలంలో అమృత మట్టిని ఎత్తు మడులపై తయారు చేస్తామో ఆ మడులపైనే వివిధ రకాల పంటలను కలిపి పండించాల్సి ఉంటుంది. తగినంత అమృత జలం పోసిన పాత్రలో పచ్చి ఆకులు, ఎండిన ఆకులు కలిపి వేసి 24 గంటల పాటు ఉంచాలి.

అమృత మట్టి గురించి వివరిస్తున్న దీపక్‌ సచ్‌దె

మడు(బెడ్‌)ల తయారీ: 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలా బెడ్‌ను నిర్మించుకోవాలి. బెడ్‌లో మొదటి పొరగా ఆకులు నానబెట్టిన అమృత జలాన్ని పోయాలి. దీనిపైన నేలపై పొర నుంచి సేకరించిన మట్టిని ముందు నేలపై పొరలాగా పరవాలి. దీనిపైన మళ్లీ అమృత జలాన్ని పోయటం, పైన మట్టిని పరవటం ఇలా.. బెడ్‌ను పొరలు పొరలుగా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించాలి. ప్రతి వారం రోజులకు బెడ్‌లో ఉన్న కంపోస్టును కలపాలి. సూక్ష్మజీవుల చర్యలు జరిపేందుకు తగినంత తేమ ఉండేలా అమృత జలంతో బెడ్‌ను తడుపుతుండాలి. ఈ మిశ్రమం పూర్తిస్థాయి కంపోస్టుగా మారేందుకు 30 రోజుల సమయం పడుతుంది. 

విభిన్న రకాల పంటలకు చెందిన విత్తనాలను ఎంచుకొని బెడ్‌పై నాటుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను అమృత జలంలో ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత బెడ్‌లో ఉన్న కంపోస్టు విత్తుకోవాలి. విత్తిన తర్వాత ఆకులతో ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పై అమృత జలాన్ని పిచికారీ చేయటం ద్వారా విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను అందించాలి. 21 రోజుల పాటు ఇలా చేయటం ద్వారా అన్ని విత్తననాలు మొలకెత్తేలా చూడాలి. ఆ తరువాత వివిథ దశల్లో పెరిగే మొక్కలకు కత్తిరింపులు చేపట్టాలి. మొలకెత్తిన 21 రోజులకు మొక్కల్లో పావు వంతు భాగాన్ని కత్తిరించాలి. 42వ రోజు రెండోసారి, 63వ రోజు పూత దశలో మూడోసారి కత్తిరించాలి. మూడో కత్తిరింపులో బెడ్‌పైన మొక్కలను అర అంగుళం వదిలి పైభాగం మొత్తం కత్తిరించాలి. ఇలా కత్తిరించిన భాగాలను అమృతజలంలో 8 గంటలు నానబెట్టి అమృత మట్టిలో కలపాలి.

బెడ్స్‌పైన ఆచ్ఛాదన కల్పించాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే.. అమృతమట్టితో కూడిన బెడ్స్‌ పంటల సాగుకు సిద్ధమైనట్టే. ఇంత కష్టపడి అమృత మట్టిని తయారు చేసుకోవడం అసరమా? అన్న ఓ సాధారణ ప్రశ్న చప్పున మదిలోకి వస్తుంది. అయితే, దీని ఫలితాల గురించి తెలుసుకుంటే నిస్సందేహంగా అవసరమే అని మీకే అనిపిస్తుంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడి పండించే కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో పోల్చితే అమృత మట్టి ఉపయోగించి పండించిన కూరగాయల్లో అధికంగా పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిలో మాంసకృత్తులు 5 రెట్లు, కాల్షియం 20 శాతం అధికంగా కలిగి ఉంటాయి. సాధారణంగా మాంసాహారంలోనే లభించే విటమిన్‌ బి12ను కూడా అమృత మట్టితో ఉపయోగించి పండించిన ఆహారోత్పత్తుల్లో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది కూడా. కష్టే ఫలి అన్నమాట!  
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top