పురిపండా పులిపంజా

Article On Puli Panja Book - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

పురిపండా అంటేనే పులిపంజా. పులిపంజా అంటేనే పురిపండా అని సాహితీవేత్తలు వ్యాఖ్యానిస్తుంటారు. అభ్యుదయ కవితోద్యమ తొలి దశ నుంచి యువకవులకు తోడు నిలిచినవాడు పురిపండా అప్పలస్వామి. నవీన సాహిత్య యుగోదయానికి, నవ కవులకు ‘దివిటీ నవుతా’ అంటూ ఎలుగెత్తి చాటిన దార్శనికుడు. వాడుకభాషా పితామహుడైన గిడుగు రామ్మూర్తికి శిష్యులై వ్యావహారిక భాషను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టేందుకు కృషి చేసి సఫలీకృతులయ్యారు. 

పురిపండా మొత్తం అరవై రచనలు చేశారు. వీటిలో పులిపంజా కవితాసంపుటి ఓ విస్ఫులింగం. లండన్‌ నుంచి విదేశాంధ్ర ప్రచురణగా ఇది వెలువడింది. 41 కవితల సమాహారమిది. సాంఘిక దురన్యాయాలపై పంజా విప్పిన కవి బెబ్బులి పురిపండా. జాతీయోద్యమంలో కార్యకర్తగా పనిచేయడం వల్ల బూజులా వేళ్లాడుతున్న సనాతన భావాలపై తిరుగుబాటు చేశారు.

‘నా గేయం/ మీ  కవనం/ మీ ఖడ్గం నా గేయం/ కుబుసం వొదిలిన సర్పం/ నా గీతం పులిపంజా’ అంటూ సమాజానికి ప్రగతి కవితా సందేశాన్నిచ్చారు. 
‘గుడిలోని దైవమా! ఆలింపవోయి/ గుడిలోని దయ్యమా! పైకి రావోయి/ నీ పాదపూజకై/ వెదకి తెచ్చిన పూలు/ నీ పాదసేవకై/ నింపి తెచ్చిన నీళ్లు/ పనికి రావంటారు/ మైలపడెనంటారు’ ఇలా సాగుతుందీ ‘గుడిలోని దైవమా’ గేయ కవిత. ఆనాటి సమాజంలో బుసలు కొడుతున్న అస్పృశ్యతపై తీవ్రంగా చలించి రాసిన ఈ కవిత నాటి సాహితీ సభల్లో అందరినీ కదిలింపజేసింది. హరిజనోద్ధరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రాసిన ఈ కవితను ఆంగ్లంలో అనువదించి గాంధీజీకి వినిపిస్తే ఎంతో మెచ్చుకున్నారు.

‘ఇక్కడ అడుగు పెడితే/ ఎందుకో నా వొళ్లు/ కంపరమెత్తుతుంది/ ఖద్దరు వొదిలేసి/ కత్తి పట్టాలనిపిస్తుంది/ అహింస అబద్ధమనిపిస్తుంది... భగత్సింగులాగ/ విప్లవకారుణ్ణయి/ ఎర్రజెండా ఎత్తాలనిపిస్తుంది/... పద్మనాభం గాలి నిండా/ వీరగాథ వినిపిస్తుంది/ పద్మనాభం ధూళినిండా/ వీరరక్తం కనిపిస్తున్నది’ అనే ఖండికను ఎంతో భావోద్వేగంతో రాశారు. కుంఫిణీ దొరల కుతంత్రాలను ప్రతిఘటించి పూసపాటి విజయ రామరాజు పద్మనాభం (విశాఖ జిల్లా) వద్ద యుద్ధం చేసి వీరమరణం పొందారు. ఈ ఉదంతం పురిపండా మనసును ద్రవింపజేసింది. అమరవీరుని త్యాగానికి నివాళిగా రాసిన స్మృతిగీతం అది.
‘మానవ శవాల మంటపాలపై/ ప్రభువుల పతాక రెగిలే భువిలో/ రాతి విగ్రహం రక్షిస్తుందా? పూజామంత్రం బువ్వెడుతుందా?’ ఇదీ పురిపండా భవ్య కవితావేశం. 
‘తొలినాటి సంద్రాలు/ తుహినగిరి శిఖరాలు/ ఇంకిపోతున్నాయిలే/ కుంగిపోతున్నాయిలే’ అంటూ సుడిగాలి కవితలో ఛాందస భావాలను ఖండించారు. ఆధునిక భావజాలానికి ఆహ్వానం పలికారు.
– వాండ్రంగి కొండలరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top