బక్క పచ్చని మనిషి

బక్క పచ్చని మనిషి


ఒక పచ్చని మనిషి ఎక్కడైనా ఉంటే ఎలాగైనా తెలిసిపోతుంది.  ఆ చుట్టపక్కల చల్లని నీడ ఉంటుంది. ఒక మంచి పని ఏదైనా  జరుగుతోందంటే ఎలాగైనా తెలిసిపోతుంది. ఆ పరిసరాలలో సంతోషం విరగబూస్తూ ఉంటుంది. అలోక్‌ సాగర్‌ 32 ఏళ్లుగా  మధ్యప్రదేశ్‌లో ఉంటున్నారు. వనాలలో ఒకడిగా కలిసిపోయి,  గిరి జనాలకు మేలుకొలుపు పిట్టలా తిరుగుతున్నారు. అయితే ఆయన గురించి ఎవరికీ తెలీదు! ఒకప్పుడు ఆయన ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్‌!  రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌ రాజన్‌కు గురువు!! ఇప్పుడు?  చెట్టు, పుట్ట, ఒక అలోక్‌ సాగర్‌. అంతే!!



ఉండడానికైతే ‘కొచామూ’లో ఉంటారు అలోక్‌ సాగర్‌. కాలు మాత్రం ఒకచోట నిలవదు. చేతులూ ఖాళీగా ఉండవు. మొక్కల్ని, మంచి బలమైన విత్తనాలను పట్టుకుని పొద్దస్తమానం బెతుల్, హోషంగాబాద్‌ జిల్లాల్లోని గూడేల్లో తిరుగుతూ ఉంటాడు. మనిషి కనిపిస్తే ఆపుతాడు. మొక్క చేతిలో పెడతాడు. కొన్ని విత్తనాల కూడా ఇచ్చి సారం ఉన్నచోట చల్లమంటాడు. ఈ ముప్పై ఏళ్లలో ఆలోక్‌ నాటి, పెంచిన చెట్లే 50 వేలకు పైగా ఉన్నాయి. కొండల్లో, గుట్టల్లో ఆయన దిన దిన సంచారం సైకిల్‌ తొక్కుతున్న పొద్దుతిరుగుడు పువ్వులా అనిపిస్తుంది. దాహమైన  చోట ఆగుతారు. ఆకలైన చోట సైకిల్‌ దిగుతారు. గత ముప్పైఏళ్లుగా ఆయన ఇంతే. మనిషేం మారలేదు. ఒక్కోసారి ఒంటిపై చొక్కా కూడా ఉండదు. నడుముకు పంచె చుట్టుకుని వెళ్లిపోతారు.



తిరుగుతూ తిరుగుతూ తాండాలోకి

అలోక్‌కి ఢిల్లీలో సొంత ఇల్లుంది. సొంత మనుషులూ ఉన్నారు. వాళ్లందర్నీ వదిలేసి ఏళ్ల క్రితమే కొచామూ వచ్చేశారు. ఆయన రావడం కాదు, కొచామూనే ఆ పచ్చటి మనిషిని తెచ్చేసుకుందేమో! అంతలా ఉంటుంది ఇప్పుడు అక్కడి గ్రీనరీ. బెతుల్‌ శివార్లలోని చిన్న తాండా కొచామూ. అక్కడి గిరిజన జనాభా 750 మంది. ఇవ్వాళ్టికీ కరెంటు లేదు. రోడ్లు లేవు! ఆ చీకట్లోనే, ఆ గతుకుల్లోనే అలోక్‌ కూడా ఓ స్థానిక గిరిజనుడిలా ఉండిపోయారు. ఢిల్లీ నుంచి నేరుగా కొచామూ వచ్చేయలేదు అలోక్‌. మధ్యప్రదేశ్‌లోని కొండా కోనల్లో ఆరేళ్లు తిరిగి, చివరికి ఇక్కడ సెటిల్‌ అయ్యారు. ఇరవై ఆరేళ్లుగా ఈ తాండాలోనే ఉంటున్నారు.



లిస్టులో తేలని ‘ఎక్స్‌ట్రా’ మనిషి!

అలోక్‌ ఎక్కువకాలం ప్రొఫెసర్‌గా లేరు. 1982లో అకస్మాత్తుగా రిజైన్‌ చేసి బయటికి వచ్చేశారు. ‘‘ఈ డిగ్రీలు, పదవులపై ఆయనకు ఆసక్తి లేదని ఆయన మాతో కలిసి పనిచేసిన కొద్ది రోజుల్లోనే గమనించాం. ఆయన ఆలోచనలన్నీ అనుక్షణం ఆదివాసీల సంక్షేమం చుట్టూ పరిభ్రమిస్తుండేవి’’ అని ‘శ్రామిక్‌ ఆదివాసీ సంఘటన్‌’ సంస్థలో అలోక్‌తో దగ్గరి పరిచయం ఉన్న అనురాగ్‌ మోదీ అనే కార్యకర్త చెప్పేవరకు అలోక్‌ ఎందుకు ఉద్యోగం మానేశారో, ఎందుకు అజ్ఞాతంగా ఉండిపోయారో ఎవరికీ తెలీదు. ఆ అజ్ఞాతమైనా.. ఈ మధ్య బెతుల్‌లో జిల్లా ఎన్నికలు జరగబట్టి వీడిపోయింది కానీ.. లేదంటే అలోక్‌ సాగర్‌ విషయం మన దాకా వచ్చేది కాదు.



బెతుల్‌ ఎన్నికలకు ముందు ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని అధికారులు లెక్కలు తీస్తున్నారు. అలోక్‌ ఏ ఇంట్లోనూ, ఏ ఓట్ల జాబితాలోనూ లెక్కలోకి రాలేదు. పిలిచి అడిగితే ‘ఇదే నా ఊరు’ అంటాడు! ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే.. ‘ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాను’ అంటాడు! అధికారులకు అనుమానం వచ్చి, తక్షణం ఊళ్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించారు. అలోక్‌ ఊరొదిలి వెళ్లలేదు. ఊరికి దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాడు. స్థానిక అధికారులు అడిగినట్లే పోలీసులూ అడిగారు.. ‘ఇంతకీ మీరెవరు?’ అని! అలోక్‌ తనెవరో చెప్పలేదు. తన క్వాలిఫికేషన్స్‌ ఏమిటో చెప్పాడు. మిగతా వివరాలు పోలీసులు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు మీడియా తెలుసుకుంది.



‘ఇదే నా ఫ్యామిలీ’

అలోక్‌ తండ్రి ఐ.ఆర్‌.ఎస్‌. ఆఫీసర్‌. రెండేళ్ల క్రితమే చనిపోయారు. తల్లి ఢిల్లీ యూనివర్శిటీలోని మిరిండా హౌస్‌లో ఫిజిక్స్‌ టీచర్‌. అలోక్‌ తమ్ముడు ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్‌. ఫ్యామిలీ ఢిల్లీలోని పత్పర్‌గంజ్‌లో ఉంటుంది. అయితే తన ఫ్యామిలీ మాత్రం కోచామూనే అంటారు అలోక్‌. ‘‘ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తారు?’’ అనే ప్రశ్నకు ‘‘ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి’’ అని నవ్వుతూ అంటారు అలోక్‌. ‘ఉన్నచోటే చేయడానికి చాలా ఉంటుంద’నే అర్థం ఆ నవ్వులో ధ్వనిస్తుంది.



అజ్ఞాతంగా... ఆదివాసీల మధ్య

అలోక్‌ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు. మనిషి బక్కపలుచగా ఉంటాడు. పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, మీసాలు. కళ్లు శూన్యంలోకి చూస్తున్నట్లు ఉంటాయి. ప్రొఫెసర్‌ లుక్‌. కానీ ప్రొఫెసర్‌నని చెప్పుకోరు. సోషల్‌ యాక్టివిస్ట్‌ అనే మాటనూ ఒప్పుకోరు. మాట కూడా బంగారం. పచ్చ బంగారం! గిరిజనులు పచ్చగా ఉంటే, పర్యావరణ పచ్చగా ఉంటుందంటారు. పర్యావరణం పచ్చగా ఉంటే నగర జనం పచ్చగా ఉంటారంటారు. మొత్తం మీద ప్రకృతి, మనిషి పచ్చగా ఉండాలని అలోక్‌ అభిలాష. ఆకాంక్ష, ఆశయం. వాస్తవానికి అలోక్‌ సబ్జెక్ట్‌.. ఎన్విరాన్‌మెంట్‌ కాదు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌. ఢిల్లీ ఐఐటీలో 1973లో మాస్టర్‌ డిగ్రీ చేశారు. తర్వాత పీహెచ్‌డి కోసం యు.ఎస్‌. వెళ్లిపోయి, టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ యూనివర్శిటీలో చేరారు. తర్వాత ఇండియా వచ్చి, తను చదువుకున్న ఐఐటీలోనే ఫ్రొఫెసర్‌ అయ్యారు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు పెద్దపెద్ద హోదాల్లోకి చేరుకున్నారు. రఘురామ్‌ రాజన్‌ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ అయ్యారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top