అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!! | Abdul Kalam's inspirational words towards goal | Sakshi
Sakshi News home page

అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!!

Jun 3 2018 12:39 AM | Updated on Aug 20 2018 5:43 PM

Abdul Kalam's inspirational words towards goal - Sakshi

అబ్దుల్‌ కలాంగారు ప్రతిజ్ఞచేయించినట్లుగా లక్ష్యసాధనకు ఏకాగ్రతతో శ్రమించాలి. లక్ష్య్యసాధన లో రెండు భాగాలు – లక్ష్యం  నిర్ణయించుకోవడం మొదటిదికాగా, రెండవది దాని సాధనకోసం శ్రమించడం. విద్యార్థులుగా మీరు విజేతల అనుభవాలను పరికించి చూడండి. లక్ష్యం నిర్ణయించుకునే దశ, లక్ష్యసాధన తరువాతి దశ.. గొంగళి పురుగు దశ, సీతాకోకచిలుక దశలా కనిపిస్తాయి. రేపు మీ జీవితంలో కూడా అంతే.

గొంగళిపురుగు ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించేలా ఉంటుంది. మీదపడితే దురదపెడుతుంది. దానిని చూడడానికి తాకడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయినా అది ఆకులుతిని తన నోటివెంట వచ్చే ద్రవంతో గూడుకట్టుకుని దానిలో పడుకుని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. తరువాత తాను కట్టుకున్న గూడు బద్దలు కొట్టుకొని బయటకు రావడంకోసం రెక్కలు విప్పడానికి ఉన్నచోటు దానికి సరిపోదు. గూడు గోడలు అడ్డుపడుతుంటాయి. అలా కొట్టుకుంటున్నప్పడు అది అలసిపోదు.

‘నేను బయటకి వచ్చి తీరుతా’ అన్న కృతనిశ్చయంతో శ్రమిస్తుంది. అలా కొట్టుకోగా కొట్టుకోగా గూడుకు చిన్న రంధ్రం పడుతుంది. ఇంకా శ్రమించగా ఆ రంధ్రం నెమ్మదిగా పెద్దదయి తనకు అడ్డుపడిన చిక్కులను తొలగించుకుంటూ గూట్లోంచి బయటపడుతుంది. రివ్వున ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడది.. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించిన పురుగు ఎంతమాత్రం కాదు. అసలు అది ముందు అలా ఉండేదంటే కూడా నమ్మశక్యం కాదు. ఎన్ని రంగులు, ఎన్ని రేఖలు, చిత్రవిచిత్రమైన గీతలు ముగ్గులు పెట్టినట్లుగా చాలా అందంగా కనబడుతుంది. పరమ సంతోషంగా గాలిలో ఎగురుతూ పోతుంటుంది.

ఆకులుతిని బతికిన గొంగళిపురుగు మరింత ఆశ్చర్యకరంగా పూలలో మకరందాన్ని తన తొండంతో జుర్రుకునే క్రమంలో పూరేకులమీద వాలినా వాటికి ఏ మాత్రం అపకారం జరగనివ్వదు, పాడు చేయదు. అది గూడు బద్దలు కొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురుపుల్లతోనో అడ్డొచ్చిన గూడును జాగ్రత్తగా తొలగించారనుకోండి. ఆశ్చర్యం.. సీతాకోకచిలుక బయటికొస్తుంది,కానీ ఎగరలేక కిందపడిపోతుంది. అదలా కష్టపడేక్రమం లోనే, దానికాళ్ళకు, దాని రెక్కలకు కావలసిన బలాన్నది సొంతంగా సమకూర్చుకుంటుంది. అదీ మనిషికి ఉండవలసిన సాధనాబలం.

‘భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు. మేధస్సు ఇచ్చాడు. ఇన్ని విద్యాలయాలు ఇచ్చాడు. ఇంత జ్ఞానాన్ని అందించే పుస్తకాలనిచ్చాడు. ఇంతమంది పెద్దలనిచ్చాడు. ఇంత గొప్ప సమాజాన్నిచ్చాడు. ఇన్ని ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనా?’ అని తనను తాను ప్రశ్నించకుంటూ లక్ష్యం దిశగా ఏకోన్ముఖంగా సాగిపోయిన విద్యార్థి సీతాకోకచిలుక లాగా సకలవర్ణశోభితమై తన కాళ్ళతో, తన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తూ వస్తాడు. అందుకే విజయానికి చిహ్నంగా పైకి ఎగురుతున్న సీతాకోకచిలుక బొమ్మను వేస్తారు.

గురువుగారి దగ్గర విద్యనేర్చుకోవడం అంటే... శిష్యుడు గురువుగారిని శ్రమపెట్టకుండా ఆయన దగ్గరచేరి విద్యపొందాలి. ఎలా !!! పూవుకు ఏ మాత్రం అపకారం చేయకుండా దాని గుండెల్లోకి చొరబడి సీతాకోకచిలుక మకరందాన్ని జుర్రుకున్నట్లు శిష్యుడు విద్యను సముపార్జించాలి.‘భృంగావళీచ మకరందరసానువిద్ధఝుంకారగీతనినదైఃసహసేవనయ ..... శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతమ్‌’.... సీతాకోక చిలుకులు ఎగురుతున్నాయి.

ఆ సవ్వడి మీకు వినబడడం లేదా, తెల్లవారుతోంది స్వామీ, మీరు లేవండి – అని వేంకటేశ్వరస్వామిని కూడా ప్రేమగా నిద్రలేపడానికి ఒకనాడు ఏవగింపు కలిగించిన ఇప్పటి సీతాకోచిలుక ఒక అద్భుతమైన ఉపమానంగా నిలుస్తున్నది. సాధకుడు దానినుంచి స్ఫూర్తిని పొందాలి. విజేతగా సప్తవర్ణాలతో మెరిసిపోవాలి.
 

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement