మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఓ నమ్మకం, బలమైన విశ్వాసం.
* శ్రీకాకుళం జిల్లాలో జనభేరి సభల్లో విజయమ్మ
శ్రీకాకుళం, న్యూస్‌లైన్:‘‘మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఓ నమ్మకం, బలమైన విశ్వాసం. అన్ని వర్గాల ప్రజల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తిగా ఆయన రాష్ట్రంలో ఐదేళ్ల మూడు నెలలపాటు సువర్ణపాలన అందించారు. మనిషిని మనిషిలా చూసారు కాబట్టే అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతలా అభివృద్ధి, సంక్షేమంతో కూడిన పాలన అందించి అందరివాడయ్యారు. మళ్లీ ఆయన పాలన రావాలంటే ఆయనలాంటి మంచి నేతను ఎన్నుకోవాలి. జనం కోసం జగన్‌బాబు గత నాలుగున్నరేళ్లుగా ఇంటికి దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉంటూ మీ గుండె చప్పుడును తెలుసుకున్నాడు. అలాంటి నాయకుడే ప్రస్తుతం మన రాష్ట్రానికి కావాలి. రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి.. రాష్ట్ర విభజన కష్టాలను తొలగించాలి. కొత్త రాజధాని నిర్మించుకోవాలి. ఇదంతా జగన్‌తోనే సాధ్యం..’’ అని దివంగత వైఎస్ సతీమణి, వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి వై.ఎస్.విజయమ్మ చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని కవిటి, పూండి, పాతపట్నం, ఆమదాలవలసల్లో నిర్వహించిన వైఎస్‌ఆర్ జనభేరి సభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రతి చోటా వేలాదిమంది జనం విజయమ్మకు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థులు నర్తు రామారావు, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణ, తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.