టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆయన ఒకే రోజు తొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగసభల్లో పాల్గొంటున్నారు.
ఒకే రోజు తొమ్మిది చోట్ల బహిరంగ సభలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆయన ఒకే రోజు తొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు తమ అధినేత సభలను విజయవంతం చేసేందుకు జనసమీకరణపై దృష్టి సారించారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులను పరిచయం చేస్తూ ఇప్పటికే జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, రెండో విడత ప్రచారంలో భాగంగా పర్యటన పెట్టుకున్నారు.
కోదాడ బహిరంగ సభతో ప్రచారాన్ని మొదలు పెట్టి సూర్యాపేట సభతో ముగించనున్నారు. కోదాడ, హాలియా (నాగార్జునసాగర్), దేవరకొండ, చం డూరు(మునుగోడు), నకిరేకల్, తుంగతుర్తి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట సభల్లో పాల్గొంటారు. కోదాడ మొదలు మిర్యాలగూడ దాకా హెలికాప్టర్‌ను ఉపయోగించనున్న కేసీఆర్ మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి సభల్లో పాల్గొం టారు.
పచారానికి ఇంకా కేవలం ఆరు రోజులే మిగిలి ఉండడం, ఇప్పటి దాకా ఎక్కువ ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచారం చేయలేకపోవడంతో ఒకే చోట బహిరంగసభ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనాన్ని సమీకరించే పనిలో పడ్డారు. ‘రెండో విడత ప్రచారంలో భాగంగానే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తొమ్మిది సభల్లో పాల్గొంటున్నారు. ‘ఎక్కడా ఇబ్బంది లేకుండా, తొమ్మిది నియోజకవర్గాల్లో సభలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. కే సీఆర్ బహిరంగ సభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నాం..’ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి వివరించారు.