ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఆ తర్వాత వాటిని విస్మరించే రాజకీయ పార్టీలపై కోర్టుల్లో పిటిషన్ వేసుకునే అవకాశం ఓటర్లకు కల్పించాలని సీపీఐ అనుబంధ రైతుసంఘం, రైతు స్వరాజ్య వేదిక ఎన్నికల సంఘాన్ని కోరాయి.
రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘానికి రైతుసంఘాల లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఆ తర్వాత వాటిని విస్మరించే రాజకీయ పార్టీలపై కోర్టుల్లో పిటిషన్ వేసుకునే అవకాశం ఓటర్లకు కల్పించాలని సీపీఐ అనుబంధ రైతుసంఘం, రైతు స్వరాజ్య వేదిక ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈమేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశాయి.
వ్యవసాయ రుణాల మాఫీపై వివిధ పార్టీలు ఇస్తున్న హామీలను అందులో ప్రధానంగా ప్రస్తావించాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని రైతుసంఘ నేతలు పశ్య పద్మ, డాక్టర్ జీవీ రామాంజనేయులు, కన్నెగంటి రవి కోరారు. లేకుంటే ఓటర్లే వాటిపై కోర్టుల్లో పిటిషన్లు వేసేందుకు అనుమతి ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.