సార్వత్రిక ఎన్నికల ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఎన్నికల సంఘం నమోదుకు మరింత గడువు పెంచడం... అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం...
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఎన్నికల సంఘం నమోదుకు మరింత గడువు పెంచడం... అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం... వెరిసి జాబితాలో అదనంగా చేరిన ఓటర్లతో కలిపి తుదిజాబితా ఖరారు చేశారు.
కొత్త ఓటర్లందరిని కలిపి జిల్లా ఓటర్ల సంఖ్య 28,25,945 మందికి చేరింది. తుది జాబితాలో పురుషులు 14,17,995 మంది, మహిళలు 14,07,800 మంది ఉన్నారు. కొత్త జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్తగా రూపొందించిన జాబితాను జిల్లాలోని 3,419 పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరీంనగర్ 3,22,562 మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా, 1,95,341 మంది ఓటర్లతో మానకొండూర్ నియోకవర్గం చివరి స్థానంలో ఉంది.
అక్కడ మహిళలే ‘కీ’లకం...
జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి, వేములవాడ, మానకొండూర్, హుస్నాబాద్, సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియలో అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి. నమోదు ప్రక్రియలో ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికి 1,03,542 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. రెండు నెలల కాలంలో మరో 82,715 మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు.