
నమో సభలు.. నారా డెరైక్షన్!
‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది... వెంటనే దేశం పటిష్టం కావాల్సిన అవసరం ఉంది.
* బీజేపీ నేతల ప్రచార ప్రణాళికకు గండికొట్టే యత్నం
* టీడీపీ పోటీ చేసే కీలక ప్రాంతాల్లో మోడీ సభల కోసం బాబు ఎత్తుగడ
* సన్నిహిత బీజేపీ పెద్దలతో చకచకా ఏర్పాట్లు
* చంద్రబాబు ప్లాన్ ప్రకారమే మోడీ తుది దఫా పర్యటన
సాక్షి, హైదరాబాద్: ‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది... వెంటనే దేశం పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దేశం కోసం మోడీకి జై కొడుతున్నాను’... బీజేపీతో టీడీపీ దోస్తీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పే కారణమిది. ఇంతకూ దేశం అంటే... భారతదేశం మాత్రం కాదు. అది కచ్చితంగా తెలుగు‘దేశ’మేనని ఇప్పుడు స్పష్టమవుతోంది.
పొత్తు తనకు అనుకూలంగా ఉండాలనే ధ్యాసతోనే అడుగడుగునా కమలనాథులను దెబ్బకొట్టేందుకే యత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణలో పార్టీ బలం పెరిగిందని భావించిన బీజేపీ నేతలు... మోడీతో విస్తృతంగా ప్రచారం చేయించి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు యత్నిస్తుండగా, ఇప్పుడు చంద్రబాబు వారి ఆశలపై నీళ్లు కుమ్మరించేందుకు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు.
* సొంతగా ఎన్నికల బరిలో దిగితే ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో, బీజేపీ తెలంగాణ నేతలు వద్దు మొర్రో అన్నా చంద్రబాబునాయుడు బలవంతంగా పొత్తు కుదుర్చుకున్నారు. అలా తెలంగాణ రాష్ట్రం సాధనలో ప్రధాన భూమిక పోషించిన బీజేపీ ప్రాభవానికి బాబు గండికొట్టారు.
* పొత్తులో భాగంగా కీలక నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలోనే ఉండేలా చంద్రబాబు చక్రం తిప్పడంతో బీజేపీ నేతులు ఉసూరుమన్నారు.
* దక్కిన నియోజకవర్గాల్లోనైనా మోడీ ప్రభంజనంతో పాగా వేద్దామనుకుంటుండగా బాబు అక్కడా అడ్డుపడుతున్నారు.
* బీజేపీ పోటీలో ఉన్న నియోజకవర్గాల పరిధిలో మోడీతో విస్తృతంగా ప్రచారం చేయించాలని తెలంగాణ నేతలు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
* మోడీ సూచన మేరకు మెదక్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర నియోజకవర్గాలతో ఓ రూట్‌మ్యాప్ రూపొందించారు.
* రెండు పర్యాయాలుగా పర్యటనకు వచ్చేందుకు మోడీ సమ్మతించడంతో తొలి బహిరంగసభను మెదక్‌లోగాని, నిజామాబాద్‌లో గాని ఏర్పాటు చేయాలనుకున్నారు.
* మలివిడతలో సుడిగాలిలా ఒకే రోజు ఐదారు బహిరంగసభల్లో ప్రసంగించేలా ఓ ప్రణాళిక రూపొందించుకున్నారు.
* అయితే, తెలంగాణలో బీజేపీని దెబ్బతీసి సొంత ప్రయోజనాల కోసం మరోసారి చంద్రబాబు రంగంలోకి దిగారు.
* టీడీపీ కోసం మోడీతో సభలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుని తనకు సన్నిహితులైన బీజేపీ పెద్దల ద్వారా ప్రయత్నం ప్రారంభించారు.
* ఖమ్మం, ఆదిలాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాలతోపాటు తెలుగుదేశం పోటీపడుతున్న నగరశివారులోని రంగారెడ్డి ప్రాంతం, చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధిలో మోడీ సభలు ఉండేలా చూస్తున్నట్టు సమాచారం.
* వాస్తవానికి మోడీతో ఇప్పటికే తొలివిడత బహిరంగసభలు నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు.
* అయితే, రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో అది వాయిదాపడింది.
* దీన్ని ఆసరా చేసుకున్న బాబు, మోడీ ప్రచార సభలను హైజాక్ చేసేపనిలో బిజీగా ఉన్నారు.