మళ్లీ స్నేహ ‘హస్తం’! | all over again DMK interest on UPA | Sakshi
Sakshi News home page

మళ్లీ స్నేహ ‘హస్తం’!

Mar 27 2014 12:22 AM | Updated on Sep 2 2017 5:12 AM

మళ్లీ స్నేహ ‘హస్తం’!

మళ్లీ స్నేహ ‘హస్తం’!

రాష్ట్రంలో అత్యధిక సీట్లు కైవశం చేసుకోవాలనే లక్ష్యంతో డీఎంకే ముందుకెళుతోంది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

సాక్షి, చెన్నై:
రాష్ట్రంలో అత్యధిక సీట్లు కైవశం చేసుకోవాలనే లక్ష్యంతో డీఎంకే ముందుకెళుతోంది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక, ఆ పార్టీ తరపున ప్రచారానికి ఎంపీ కనిమొళి, నటి కుష్బు, నటుడు వాగై చంద్రశేఖర్ సైతం సిద్ధమయ్యారు.
 
వయోభారంతో ఉన్న కరుణానిధి ఈ పర్యాయం ప్రచారం బాట పట్టేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఇందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండడమే. ఈ పర్యాయం ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీఎంకే అధినేత కరుణానిధి తానూ ప్రచారానికి వస్తున్నానని గత వారం ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల చొప్పున ఆయన పర్యటించాలని నిర్ణయించారు.
 
ఇందులో భాగంగా బుధవారం తన ఎన్నికల ప్రచారానికి కరుణానిధి శ్రీకారం చుట్టారు. చేపాక్కం వేదికగా బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో కరుణానిధి పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులు ఉత్తర చెన్నై ఆర్  గిరిరాజన్, దక్షిణ చెన్నై టీకేఎస్ ఇళంగోవన్, మధ్య చెన్నై దయానిధి మారన్‌ను ఓటర్లకు పరిచ యం చేశారు. వారి గెలుపు లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రమించాలని పిలుపు నిచ్చారు.
 
రాష్ట్రంలో కక్ష సాధింపు ధోరణి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. డీఎంకే పథకాలను నిర్వీర్యం చేశారని, వాటిని కొనసాగించి ఉంటే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించేదని పేర్కొన్నారు. ఆ పథకాల్ని పక్కన పెట్టి, తమ స్వలాభమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ధ్వజమెత్తారు. తమ పథకాల్ని తుంగలో తొక్కిన జయలలిత తాము వేసిన రోడ్లు, వంతెనల మీద ఎలా ప్రయాణిస్తున్నారని ప్రశ్నించారు.
 
కాంగ్రెస్‌తో బంధం
తన ప్రసంగంలో కాంగ్రెస్ తీరును తీవ్రంగానే కరుణానిధి దుయ్యబట్టారు. వారు చేసిన తప్పుల కారణంగానే రాష్ట్రంలో పాతాళంలోకి కాంగ్రెస్ నెట్టబడిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని విరుచుకుపడ్డారు. 2జీ వ్యవహారంలో తమను ఉక్కిరి బిక్కిరి చేశారని, తమ పార్టీకి తలవంపులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అంతేగాక తమను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని శివాలెత్తారు.
 
2జీ కేసులో తాము నిర్ధోషులమన్న  విషయం త్వరలో తేలనుందన్నారు. ఇందుకు కారణం ఆధారాలు దొరక్క సీబీఐ తలలు పట్టుకుంటుండడమేనని వివరించారు. మతత్వ పార్టీలకు డీఎంకే వ్యతిరేకమని, అలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడకూడదన్నారు. చేసిన తప్పులకు చింతించడంతో పాటు, తప్పును సరిదిద్దుకుని ముందుకు వస్తే కాంగ్రెస్‌ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
 
మతత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీగా, అలాంటి ప్రభుత్వం రాకూడదన్న లక్ష్యంతో తాము మనస్సు మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. తమ మీద కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిందో వివరించాలంటే సమయం చాలదని, మనస్సు మార్చుకోనున్న దృష్ట్యా వాటిని మరవక తప్పదన్నారు.
 
మీడియాపై విమర్శలు
రాష్ట్రంలో మీడియా అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జయలలితకు అనుకూల వార్తలు రాస్తూ, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జయలలిత ఆస్తుల కేసు విచారణ విషయం ఏ ఒక్క మీడియాలోనూ రాక పోవడాన్ని బట్టి చూస్తే ఆమెకు అనుకూలంగా ఇక్కడి మీడియా ఏ మేరకు వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు.
 
డీఎంకేకు సిద్ధాంతాలు ముఖ్యమని, వాటి పరిరక్షణకు ఎంతటికైనా సిద్ధమన్నారు. పార్టీ పరిరక్షణ, సిద్ధాంతాలు, ఆశయాల సాధనకు ఎవరు అడ్డొచ్చినా, తనా, మనా అన్న బేధం లేకుండా బయటకు పంపించి తీరుతామని హెచ్చరించారు. ఇలాంటి విషయాల్లో బంధాలకు, బాంధవ్యాలకు చోటు లేదని, దీన్ని గుర్తెరిగి నడుచుకుంటే మంచిదంటూ పరోక్షంగా పార్టీలోని అళగిరి మద్దతుదారులకు హెచ్చరిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement