సర్కారీ కొలువుల మేళాలో.. మెరవాలంటే! | Telangana State Latest Govt Jobs 2015 - 2016 | Sakshi
Sakshi News home page

సర్కారీ కొలువుల మేళాలో.. మెరవాలంటే!

Aug 6 2015 1:54 AM | Updated on Sep 3 2017 6:50 AM

తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.

 తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల  భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇందులో తొలి విడతగా ప్రభుత్వ అనుమతులు, పరీక్ష విధివిధానాలకు  సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. వివిధ శాఖల్లో 15,552 ఉద్యోగాల భర్తీకి జీవో  జారీ అయింది. ఏదైనా డిగ్రీ అర్హతతో భర్తీచేసే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4తో పాటు ఇంజనీరింగ్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. కొత్త రాష్ట్రంలో సరికొత్త కొలువుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న అభ్యర్థులు అసలు కసరత్తును ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. అభ్యర్థులకు ఉపయోగపడేలా సర్కారీ కొలువును చేజిక్కించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్...
 
 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే టక్కున గుర్తొచ్చేది.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా చేపట్టే నియామకాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం చూస్తే టీఎస్‌పీఎస్సీ ద్వారా 3,783 ఉద్యోగాల భర్తీ జరగనుంది.
 
 గ్రూప్ 1, 2లలో దాదాపు 500:
 గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ద్వారా దాదాపు 500 ఉద్యోగాల భర్తీ జరగనుంది. గ్రూప్-1లో 52, గ్రూప్-2లో 434 పోస్టులను గుర్తించారు. గ్రూప్-1 పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఉద్యోగార్థులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. అదే విధంగా గ్రూప్-2లో వెయ్యికిపైగా పోస్టులను ఆశించగా, 434 పోస్టుల భర్తీకే ఆమోదం తెలపడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.కొత్తగా గ్రూప్-3 తెరపైకి వచ్చింది. గతంలో గ్రూప్-2లో నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో ఉన్న ఉద్యోగాలను ఇకపై ప్రత్యేకంగా గ్రూప్-3 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
 
 సందిగ్ధత వీడి సన్నద్ధత దిశగా:
 ఉద్యోగాల భర్తీ విధానం, పరీక్షల స్వరూపం, సిలబస్ తీరుతెన్నులపై స్పష్టత వచ్చింది. అందువల్ల ఇప్పటివరకు పరీక్షల విషయంలో సందిగ్ధతతో ఉన్న అభ్యర్థులు దాన్ని వీడి పరీక్షలకు సన్నద్ధం కావాలి. సిలబస్‌ను పరిశీలించి, సబ్జెక్టుల వారీగా బలాబలాలను బేరీజు వేసుకోవాలి. వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2లలో పేర్కొన్న తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
 
 సమయపాలనకు ప్రాధాన్యం:
 గ్రూప్స్ పరీక్షల ఔత్సాహికులు సిలబస్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించి, ప్రిపరేషన్ పరంగా సమయం ఆదా అయ్యేలా చూసుకోవాలి. గ్రూప్-1 పరీక్ష ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. గ్రూప్-2 మాత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటుంది. ఈ రెండు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఉమ్మడి అంశాలను డిస్క్రిప్టివ్ కోణంలో అధ్యయనం చేయాలి. ముఖ్యమైన అంశాలతో బిట్లు, షార్ట్‌నోట్స్ రాసుకోవాలి.
 
 కొత్త పేపర్ కోసం ఏం చేయాలి?
 గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్‌లో కొత్తగా చేర్చిన తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాల కోసం 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలపై దృష్టిసారించాలి. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు, వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు, రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టిసారించాలి.
 
 తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ:
 చరిత్రకు సంబంధించి తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతంతో సంబంధమున్న సంఘటనలను అధ్యయనం చేయాలి.
 
 జాగ్రఫీకి సంబంధించి తెలంగాణలోని ముఖ్యమైన నదులు- పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టిపెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎకానమీ విషయంలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు- ఉత్పాదకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన తప్పనిసరి.
 
 ఆందోళన అనవసరం
  తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి రూపొందించిన విధానాల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదు. చరిత్ర, జాగ్రఫీలపై అవగాహన ఉన్నవారికి సాధారణంగానే ఈ ప్రాంతంలోని ముఖ్య అంశాల గురించి పరిచయం ఉంటుంది. కొత్త పేపర్ (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) విషయంలో భయపడనక్కర్లేదు. వాస్తవంగా దీన్ని అనుకూలంగా మలచుకోవాలి. అంతేకాకుండా సిలబస్‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తిస్తూ తులనాత్మకంగా అధ్యయనం చేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.
 - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్,
 ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
 
 వ్యూహాత్మక ప్రిపరేషన్‌తో..
 
 గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్‌లోని అంశాలు విస్తృతంగా కనిపిస్తున్నప్పటికీ జనరల్‌స్టడీస్‌పై అవగాహన ఉన్న అభ్యర్థులు సులభంగానే అధిగమించేలా ఉన్నాయి. జనరల్‌స్టడీస్‌లోని అంశాలను, విడివిడిగా పేర్కొనడం వల్ల సిలబస్ కొంత విస్తృతంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక జనరల్ ఎస్సే విషయంలో అభ్యర్థులు ఇప్పటి నుంచే విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిపరేషన్ సమయంలో ఒక అంశంపై సొంత ఎస్సే రాసి, సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవడం; మోడల్ టెస్ట్‌లు రాయడం వంటివి చేయాలి.
 - వి. గోపాల కృష్ణ, డెరైక్టర్ బ్రెయిన్ ట్రీ అకాడమీ.
 
 గ్రూప్-1 పరీక్షా విధానం: (మొత్తం 1000 మార్కులు)
     సబ్జెక్టు    మార్కులు
     {పిలిమినరీ పరీక్ష (వ్యవధి: 2.30 గంటలు)
     జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్). 150 ప్రశ్నలు    150
     మెయిన్ రాత పరీక్ష (ఒక్కో పేపర్‌కి 3 గంటల వ్యవధి)
     జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్)    150    
 పేపర్-1:    జనరల్ ఎస్సే     150
 (1. సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; 2. ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన
 అంశాలు; 3. భారత రాజకీయ స్థితిగతులు; 4. భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వం;
 5. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి; 6. విద్య, మానవ వనరుల అభివృద్ధి)
 పేపర్-2:    హిస్టరీ, కల్చర్ - జాగ్రఫీ.    150
 (1. భారతదేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757-1947);
 2. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; 3. భారతదేశ, తెలంగాణ జాగ్రఫీ)
 పేపర్-3:    ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన    150
 (1. భారతీయ సమాజం, నిర్మాణం, సామాజిక ఉద్యమాలు;
 2. భారత రాజ్యాంగం; 3. పరిపాలన)
 పేపర్-4:    ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్    150
 (1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ;
 3. అభివృద్ధి, పర్యావరణ సమస్యలు)
 పేపర్-5:    సైన్స్-టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్    150
 (1. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; 2. విజ్ఞానశాస్త్ర వినియోగంలో
 ఆధునిక ధోరణులు; 3. డేటా ఇంటర్‌ప్రిటేషన్, సమస్యా పరిష్కారం)
 పేపర్-6:    తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం    150
 (1. తెలంగాణ తొలి దశ (1948-1970); 2. సమీకరణ దశ (1971-1990);
 3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014))
     మొత్తం    900
     ఇంటర్వ్యూ
     ఇంటర్వ్యూ    100
     మొత్తం    1000
 
 గూప్-2 పరీక్షా విధానం: (మొత్తం 675 మార్కులు)
     సబ్జెక్టు    {పశ్నలు    మార్కులు
 పార్ట్-ఏ (ఆబ్జెక్టివ్ పద్ధతి) (ఒక్కో పేపర్‌కి 2.30 గంటల వ్యవధి)
 పేపర్-1:    జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్    150     150
 పేపర్-2:    హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ.     150     150
 (1. తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర.     (ఒక్కో విభాగం
 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2. భారత రాజ్యాంగం, రాజకీయాలు     నుంచి 50)
 అవలోకనం; 3. సాంఘిక నిర్మాణం, అంశాలు, ప్రభుత్వ విధానాలు)
 పేపర్-3:    ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.    150    150
 (1. భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు; 2. తెలంగాణ     (ఒక్కో విభాగం
 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3. అభివృద్ధి, మార్పు అంశాలు)    నుంచి 50)
 పేపర్-4:    తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్    150    150
 (1. తెలంగాణ తొలి దశ-ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970);    (ఒక్కో విభాగం
 2. సమీకరణ దశ (1971-1990); 3. తెలంగాణ ఏర్పాటు దశ,    నుంచి 50)
 ఆవిర్భావం (1991-2014))
 పార్ట్-బి
     ఇంటర్వ్యూ    75
     మొత్తం    675
 
 గ్రూప్-3 పరీక్షా విధానం (మొత్తం మార్కులు 450)
 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ పద్ధతి).. (ఒక్కో పేపర్‌కి 2.30 గంటల వ్యవధి)
     సబ్జెక్టు    {పశ్నలు    మార్కులు
 పేపర్-1:    జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్.    150    150
 పేపర్-2:    హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ.     150    150
 (1. తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర     (ఒక్కో విభాగం
 ఆవిర్భావం; 2. భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం;     నుంచి 50)
 3. సాంఘిక నిర్మాణం, అంశాలు, ప్రభుత్వ విధానాలు)
 పేపర్-3:    ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.    150    150
 (1. భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు, సవాళ్లు; 2. తెలంగాణ     (ఒక్కో విభాగం
 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3. అభివృద్ధి, మార్పు అంశాలు)    నుంచి 50)
     మొత్తం    450
 
 కంప్యూటర్ పరీక్ష (ప్రాక్టికల్)
 కంప్యూటర్లు, సంబంధిత సాఫ్ట్‌వేర్ వినియోగం-ఆఫీస్ అటోమేషన్‌లో ప్రొఫిషియన్సీ        30 నిమిషాలు 50 మార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement