కారిడార్‌ కల సాకారం

Sakshi editorial On Kartarpur Corridor

సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సిక్కు మత సంస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి రోజైన శనివారం కర్తార్‌పూర్‌ కారిడార్‌ మొదలుకాబోతోంది. పంజాబ్‌లో ఉన్న దేరా బాబా నానక్‌ దేవాలయం నుంచి పాకిస్తాన్‌ గడ్డపై ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాకు సిక్కు యాత్రీకులు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే ఈ కారిడార్‌ వల్ల ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి. శతాబ్దాలుగా కోట్లాదిమందికి మార్గనిర్దేశం చేస్తున్న సమున్నత సామాజిక, సాంస్కృ తిక ధారకు గురునానక్‌ ఆద్యుడు. సిక్కుల తొలి సమష్టి జీవన వ్యవస్థను ఆయన కర్తార్‌పూర్‌లోనే ప్రారంభించారు. తన చివరి రోజులు కూడా అక్కడే గడిపారు. అందువల్లనే అది సిక్కులకు అత్యంత పవిత్ర క్షేత్రం. దురదృష్టవశాత్తూ విభజన సమయంలో రావి నదికి అటువైపున్న కర్తార్‌పూర్‌ ప్రాంతం పాకిస్తాన్‌ పరిధిలోనికి వెళ్లింది. భారత్‌–పాక్‌ సరిహద్దునుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బార్‌ సాహిబ్‌... పంజాబ్‌లోని దేరా బాబా నానక్‌ దేవాలయం సమీపం నుంచి బైనాక్యులర్స్‌తో  చూస్తే స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ పవిత్ర క్షేత్రాన్ని స్వయంగా వెళ్లి, సందర్శించుకోలేనివారి కోసం అక్కడ ఎత్తయిన వేదిక నిర్మించారు. గట్టిగా పావుగంట కూడా పట్టని ప్రయాణం కాస్తా ఇరు దేశాల మధ్యా నెలకొన్న సమస్యల కారణంగా భక్త జనానికి వ్యయప్రయాసలు మిగిలిస్తోంది. కర్తార్‌పూర్‌ వెళ్లదల్చుకున్నవారు ముందు లాహోర్‌ వరకూ వెళ్లాలి. అక్కడినుంచి కర్తార్‌పూర్‌ చేరుకోవాలి. ఇదంతా 125 కిలోమీటర్ల దూరం. ఇతర లాంఛనాలు సరేసరి.
ఏమైతేనేం... ఇన్నాళ్లకు కర్తార్‌పూర్‌ కారిడార్‌ మొదలవుతోంది. ఇరు దేశాల మధ్యా ఇప్పుడున్న పొరపొచ్చాల నేపథ్యంలో ఇది లేవనెత్తే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌ సైన్యం ప్రవర్తన గురించి చెప్పుకోవాలి. అక్కడ ప్రభుత్వం గొంతు ఒకలా, పాక్‌ సైన్యం వైఖరి మరొకలా కనబడుతూ మన ప్రభుత్వానికి, సిక్కు భక్త జనానికి అయోమయాన్ని కలిగించాయి. పంజాబ్‌ నుంచి వచ్చే సిక్కులకు ఎలాంటి పత్రాలు అవసరం లేదని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రక టించారు. కానీ పాక్‌ సైన్యం ఇక్కడికొచ్చేవారందరికీ భారతీయ పాస్‌పోర్టులు ఉండి తీరాలని చెప్పింది. ఈ నిబంధన పాటిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని మన దేశం భావిస్తోంది. పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఈ పాస్‌పోర్టుల ఆధారంగా డేటాబేస్‌ రూపొందిస్తుందని, దీన్ని పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నదని సందేహిస్తోంది. ఈ నిర్మాణం హడావుడిగా పూర్తి చేయడంపైనా అనుమానాలున్నాయి. కొన్ని నెలలక్రితం ఖలిస్తాన్‌ సంస్థలుగా చెప్పుకున్న కొన్ని 2020లో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాయి. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌ను అంతర్జాతీయంగా హోరెత్తించడం ఈ రిఫరెండం ఉద్దేశం. అది ఏదో మేర జరిగినట్టు అందరినీ నమ్మించాలంటే ఈ కారిడార్‌ ప్రారంభం అత్యవసరమని పాక్‌ సైన్యం భావిస్తున్నట్టు అనుమానాలున్నాయి. ఇవి కేవలం అనుమానాలే అని కొట్టిపారేయడానికి వీల్లేని రీతిలో పాకిస్తాన్‌ తీరుతెన్నులున్నాయి. కర్తార్‌పూర్‌ సందర్శనపై రూపొందించిన వీడియోలో ఉద్దేశపూర్వకంగా ఖలి స్తాన్‌ ఉద్యమ నాయకుడు భింద్రన్‌వాలే, మరో ఇద్దరు ఉన్న పోస్టర్‌ కనబడేలా పెట్టడం ఇందుకొక ఉదాహరణ. అంతేకాదు...దర్బారాసాహిబ్‌ గురుద్వారా వద్ద ఒక చిన్న స్తంభం నిర్మించి అందులో ఒక అద్దాల బాక్స్‌ అమర్చి, ఒక బాంబును ప్రదర్శనగా పెట్టారు. దానికింద ‘1971లో భారత సైన్యం ప్రయోగించిన బాంబు’ అంటూ ఒక వ్యాఖ్యానం ఉంచారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో ప్రయోగించిన బాంబు పక్కనున్న బావిలో పడటంతో పెను ముప్పు తప్పిందని, ఇది వాహేగురు జీ సంకల్పబలమని ఆ స్తంభానికి పక్కనున్న శిలాఫలకంపై రాశారు. క్షేత్ర సందర్శకుల్లో భారత్‌ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడమే దీనంతటి ఉద్దేశమని వేరే చెప్పనవసరం లేదు. కర్తార్‌ పూర్‌లో సిక్కులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని మరో అసంబద్ధ నిబంధన విధించింది. నిజానికి గురునానక్‌ను అనుసరించేవారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. స్వర్ణదేవాలయంతో సహా సిక్కు గురుద్వారాలేవీ తమ మతస్తులను మాత్రమే అనుమతిస్తామన్న నిబంధన విధించవు. కేవలం శిరసుపై ఆచ్ఛాదన ఉంటే చాలు... ఏ మతాన్ని అవలంబించేవారికైనా గురుద్వారాల్లో ప్రవేశం ఉంటుంది. ఒకపక్క దర్బారా సాహిబ్‌ను సందర్శించుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించా మని చెప్పుకుంటూనే ఆ మత విశ్వాసాలకూ, దాని విశాల దృక్పథానికీ భిన్నంగా ఆంక్షలు విధిం చడం, ఆలయ ప్రాంగణంలో తప్పుడు ప్రచారానికి దిగడం పాక్‌ దురుద్దేశాలకు అద్దం పడుతోంది. 
మొత్తానికి కర్తార్‌పూర్‌ కారిడార్‌ సాకారం కావడం శుభసూచకమే అయినా మన నిఘా వ్యవ స్థలూ, సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పెంచింది. అసలు కర్తార్‌పూర్‌ సుల భంగా వెళ్లి రావడానికి ఇన్ని దశాబ్దాల సమయం పడుతుందని, రాకపోకలపై ఇన్ని ఆంక్షలుం టాయని విభజన సమయంలో ఎవరూ అనుకోలేదు. రావి నదికి ఆవలనున్న ఆ ప్రాంతానికి వంతెన దాటి వెళ్లేవారు. కానీ రాను రాను ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరిగి, చివరకు 1965  నాటి యుద్ధంలో ఆ వంతెన ధ్వంసం కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అసలు అక్కడి ప్రార్థనా మందిరం బాగోగుల్ని పాక్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. 1999లో అప్పటి ప్రధాని దివం గత వాజపేయి, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ల మధ్య చర్చలు జరిగి ఢిల్లీ–లాహోర్‌ బస్సు ప్రారం భమైన సందర్భంగా ఈ కారిడార్‌ గురించి వాజపేయి ప్రతిపాదించారు. అటు తర్వాతే దర్బారా సాహిబ్‌పై పాక్‌ శ్రద్ధపెట్టింది. కారిడార్‌ నిర్మాణం పనులు నిరుడు నవంబర్‌లోనే ప్రారంభమ య్యాయి. ఈ కారిడార్‌ కొత్త సమస్యలకూ, ఘర్షణలకూ కారణం కానీయరాదని, స్నేహ సంబం ధాలు పెంపొందించుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని పాక్‌ గ్రహించడం అవసరం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top