ఉపాధికి కాస్త ఊపిరి

New Guidelines For Extended Lockdown India - Sakshi

జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన 24 గంటల తర్వాత భిన్న రంగాలకు వివిధ మినహాయింపులిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ కారణంగా నిర్వా్యపకత్వంలో వుండిపోయిన వివిధ వర్గాలకు ఇదొక తీపి కబురు. ఈనెల 20 నుంచి అమల్లోకొచ్చే ఈ మార్గదర్శక సూత్రాల వల్ల వ్యవసాయం, తయారీ రంగ పరిశ్రమలూ మళ్లీ యధాప్రకారం పనిచేస్తాయి. మత్స్యపరిశ్రమ, ఎరువుల పరిశ్రమలు, నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి హోల్‌సేల్, రిటైల్‌ మార్కెట్లు తెరుచుకుంటాయి. అయితే కంటెయిన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించిన ప్రాంతాలకు ఈ మార్గదర్శకాలు వర్తించవు. అలాగే విద్యాసంస్థలు, థియేటర్లు, వాణిజ్య సంస్థలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలు, మతపరమైన ఉత్సవాలు, ప్రార్థనా మందిరాలు తదితరాలకు అలాంటి వెసులుబాట్లు లేవు. ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని అదుపు చేయడం కోసం గత నెల 24న కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించాక నగరాలు, పట్టణాల్లో పనిచేసుకునే లక్షలాదిమంది వలస కార్మికులు, పల్లెసీమల్లోని లక్షలమంది వ్యవసాయ కూలీలు, ఇతరులూ నానాయాతనలూ పడ్డారు.

ఎలాంటి ఉద్రిక్తతలూ లేకుండా ఉన్నట్టుండి సమస్తం స్తంభింపజేయడం ఎందుకో వారికి అర్థంకాలేదు. యజమానులు ఆవాసాలు ఖాళీ చేయమనడం, ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు పోదామని ప్రయత్నిస్తే రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడి వక్కడే నిలిచిపోవడం వారిలో భయాందోళనలు కలిగించాయి. సాధారణ పౌరులకు మాత్రమే కాదు... ప్రభుత్వాలకు కూడా ఇలాంటి పరిస్థితులు కొత్తే. అందువల్లే  హఠాత్తుగా వచ్చిపడిన లాక్‌డౌన్‌తో చాలాచోట్ల ప్రభుత్వాలు కూడా తడబడక తప్పలేదు. కనుకనే ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోని కుటుంబాలకు వెనువెంటనే ఆహారపదార్ధాలు అందినా, దాని వెలుపలే వుండి పోయిన వారు ఇబ్బందులు పడ్డారు. కనుకనే వందల, వేల కిలోమీటర్లయినా స్వస్థ లాలకు పోవడానికే సిద్ధమయ్యారు. వీరిని  ఆదుకోవడానికి ప్రభుత్వాలు భిన్న మార్గాలు వెదక వలసివచ్చింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు అలాంటి వర్గాలకు పూర్తి ఉప శమనాన్నిస్తాయని చెప్పలేం గానీ ఉన్నంతలో పరిస్థితిని మెరుగుపరుస్తాయి. రైతు కూలీలకు, హమాలీలకు పనులు దొరుకుతాయి. పంటల కోతకు, విత్తనాలు నాటేందుకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులిచ్చారు.

రైతులు, కూలీలు ఇక స్వేచ్ఛగా తమ పనులు చేసుకోవచ్చు. అయితే భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. వీరితోపాటు వెటర్నరీ సేవలు అందించే వైద్యులకు, ఇతర సిబ్బం దికి  కూడా వెసులుబాటు వుంటుంది. అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాలు వగైరా తరలించడానికి కూడా అవకాశమిస్తారు. లాక్‌డౌన్‌ అమలు మొదలయ్యాక రైతులంతా ఎంతో కలవరపడ్డారు. ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంట కోత కొచ్చే సమయంలో ఆటంకాలెదురుకావడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. స్థానికంగా పోలీసులను బతి మాలుకుని పొలంవద్దకెళ్లినా కూలీల కొరత తప్పలేదు. దూరప్రాంతాలనుంచి రావాల్సిన కోతల యంత్రాలు లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధాన్యాన్ని తరలించడానికి కూడా సమస్యలే. తాజా మార్గదర్శకాల ప్రకారం ధాన్యం సేకరణ, తరలింపు వగైరా కార్యకలాపాల్లో పాల్గొనే సంస్థలకు కూడా వెసులుబాటు లభిస్తోంది. పంట రుణాల చెల్లింపు గడువును వచ్చే నెల 31 వరకూ పొడిగించారు. రైల్వేల్లో పనిచేసే వివిధ రకాల కాంట్రాక్టు ఉద్యోగులందరూ విధి నిర్వహణలో వున్నట్టు పరిగణించి వారికి వేతనాలు చెల్లిస్తామని ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.  

అయితే ప్రైవేటు సంస్థలూ ఇదే విధంగా చేయాలని ఇచ్చిన సలహా ఎంతమంది పాటిస్తారో అనుమానమే. వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయిన వర్తమానంలో  ఆ సంస్థలు బక్కజీవులపై కనికరం చూపి స్తాయనుకోవడం భ్రమ. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిర్మాణ రంగానికి సంబంధించిన రూ. 52,000 కోట్ల సెస్‌ మొత్తాన్ని ఆ కార్మికులకు వెచ్చించాలని మార్గదర్శకాలు సూచించాయి. కానీ ఈ రంగంలో చట్టబద్ధంగా నమోదైన కార్మికుల సంఖ్య చాలా స్వల్పమని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సమస్యలు ఎదుర్కోని రంగమంటూ లేదు. అందులో వ్యవసాయం, పారిశ్రామిక రంగం ముఖ్యమైనవి. సాగు దిగుబడులు వచ్చే సమయం గనుక వాటిని తరలించడం, నిల్వచేయడం, మార్కెట్లకు తరలించడం ఎంతో ముఖ్యం. ప్రకృతి సహకరించి, పంటలు బాగా పండిన తరుణంలో వాటిని సకాలంలో సంరక్షించుకోవడం చాలా అవసరం.

లేనట్టయితే తిండి గింజలకు సమస్య ఏర్పడుతుంది. అలాగే పండ్లు, అరటి, మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ, మాంసం, ఆక్వా ఉత్పత్తులు వగైరా రవాణా, మార్కెటింగ్‌ కీలకం. నిత్యావసర వస్తువులు, ఫార్మా ఉత్పత్తులు, గ్రామీణ పరిశ్రమలు, బొగ్గు, ఖనిజాలు, జౌళి, ఇటుకబట్టీలు వగైరాలకు వెసులుబాట్లున్నాయి. ప్రత్యేకార్థిక మండళ్లలోని పరిశ్రమలు, ఎగుమతి ఆధారిత పరిశ్రమలు, ఐటీ హార్డ్‌ వేర్‌ సంస్థలు వగైరాలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవచ్చు. ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, ప్లంబర్లు కూడా యధావిధిగా తమ పనులు చేసుకోవచ్చు. ఈ రంగాల కార్యకలాపాలు మొదలైతే చాలా మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఈ కష్టకాలంలో రైతులకూ, రైతుకూలీలకు, ఉపశమనం దొరు  కుతుంది. ఆర్థిక వ్యవస్థలో చలనం వస్తుంది. ఈ వెసులుబాట్లు లభించని పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటే, అందులోని కార్మికులకు ఆర్థిక ఆసరా లభిస్తుంది. లాక్‌డౌన్‌ సవ్యంగా అమలై, కరోనా మహమ్మారి నియంత్రణలోకొచ్చిన సూచనలు కనిపిస్తే రెండో దశ లాక్‌డౌన్‌ పూర్తయ్యే మే 3 లోగా మరికొన్ని రంగాలను కేంద్రం అనుమతించే అవకాశముంది. అటువంటి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిద్దాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top