భారీ చార్జీల బాదుడు

Editorial On Price Hike on Telecom Services - Sakshi

టెలికాం సంస్థల మధ్య కొన్నేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న టారిఫ్‌ల పోరు చల్లారింది. అవన్నీ ఏకమై ఇప్పుడు వినియోగదారుల పనిపట్టడానికి సిద్ధమయ్యాయి. వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌ టెల్‌ సంస్థలు కాల్, డేటా చార్జీలను సోమవారం అర్థరాత్రి నుంచి దాదాపు 50 శాతం పెంచబోతు న్నట్టు ఆదివారం ప్రకటించాయి. రిలయన్స్‌ జియో మరో మూడు రోజులు గడిచాక కొత్త రేట్లు అమలు చేస్తానంటూనే ఈ పెరుగుదల 40 శాతంవరకూ ఉండొచ్చునని తెలిపింది. 4జీ ఇప్పటికే పాతబడి 5జీ ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఊహించని రీతిలో వారికి ఈ ధరల షాక్‌ తగిలింది. ధరల బాదుడు విషయంలో ఇప్పటికే టెలికాం కంపెనీలు ఓదార్పు వచనాలు పలుకుతున్నాయి. ఈ పెరుగుదల వారంరోజులపాటు టీ కోసం పెట్టే ఖర్చంత కూడా ఉండదని నచ్చజెబుతున్నాయి. మార్కెట్‌లో రకరకాల కంపెనీలొచ్చాక స్మార్ట్‌ ఫోన్‌లు చవగ్గా లభించడం, కాల్‌ చార్జీలు, డేటా చార్జీలు అందుబాటులోకి రావడం, ఉచిత కాల్స్‌ లభ్యత తదితరాలన్నీ వినియోగదారుల సంఖ్యను అమాంతం పెంచేశాయి. 

ముఖ్యంగా 2016లో రిలయన్స్‌ జియో దూకుడుగా రంగ ప్రవేశం చేయడం ఆ రంగంలో అప్పటికే ఉన్న సంస్థలన్నిటినీ వణికించింది. అపరిమిత వాయిస్‌ కాల్స్, డేటా టారిఫ్‌ అత్యంత చవగ్గా ఉండటంతో ఇతర సంస్థలు కూడా ఆ తోవన వెళ్లక తప్పలేదు. ఒకసారంటూ వినియోగదారులను కోల్పోతే మళ్లీ పెంచుకోవడం అసాధ్యమని ఆ సంస్థలు ఆందోళన పడ్డాయి. అప్పటినుంచే పోటాపోటీగా టారి ఫ్‌ల తగ్గింపు, వాయిస్‌ కాల్స్, డేటా వినియోగం వంటివాటిపై పరిమితి పెంపు మొదలయ్యాయి.  కేంద్రానికి వివిధ టెలికాం సంస్థలు చెల్లించాల్సిన లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రం వినియోగ చార్జీల బకా యిల విషయంలో ఈమధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసలే టారిఫ్‌ పోటీతో నష్టాలు మూట గట్టుకుంటున్న సంస్థల్ని మరింత కుంగదీశాయి. ఆ సంస్థలన్నీ చెల్లించాల్సిన బకాయిలు లక్షా నాలుగువేల కోట్లని లెక్కతేలింది. మొన్న సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి వోడాఫోన్‌ ఐడియా రూ. 50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ 23,045 కోట్లు నష్టాలు ప్రకటించాయి.  

ఆర్థిక మాంద్యం పర్యవసానంగా ఉపాధి లేమి, నిరుద్యోగితవంటివి పెరిగి, అందరినీ భయ పెడుతున్న వర్తమానంలో ఫోన్‌ చార్జీలే కాస్త చవగ్గా ఉన్నాయి. ఎవరికి వారు కావలసినప్పుడు, కావలసినంతసేపు మాట్లాడుకోవడానికి వీలుండేది. కాస్త ఖాళీ దొరికిందంటే వాట్సాప్, ఫేస్‌బుక్‌ వగైరా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫొటోలు, వీడియోలు వీక్షించడానికి, పంపడానికి, ఛాటిం గ్‌కు అందరూ తహతహలాడేవారు. ఈ మాధ్యమాలు భావ వ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాది మందికి గొంతునివ్వడంతోపాటు ఎందరో ఎదగడానికి తోడ్పడుతున్నాయి. చవగ్గా మొబైల్, కాల్‌ డేటా లభించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. కానీ అన్నింటిలో మంచీ చెడు ఉన్నట్టే ఇందులోనూ ఉన్నాయి. ఫోన్‌ ఒక సామాజిక రుగ్మతగా మారుతోందని, స్థలకాలాదులు కూడా చూసుకోకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దానికి అతుక్కుపోతున్నారని... కుటుంబ బాంధవ్యాలపై కూడా దీని దుష్ప్రభావం పడుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల కరింపులన్నీ గుడ్‌ మార్నింగ్‌లకూ, గుడ్‌నైట్‌లకూ పరిమితమయ్యాయి. స్వప్రయోజనపరులు, అసాంఘిక శక్తులు ఈ పరిస్థితిని చక్కగా వినియోగించుకుని వదంతులు వ్యాప్తి చేయడం, తప్పుడు సమాచారం ప్రచారంలో పెట్టడం, మార్ఫింగ్‌లు చేయడం ఎక్కువైంది. ఇప్పుడు పెరిగిన టారిఫ్‌లు అలాంటివారందరికీ కళ్లెం వేస్తాయి. కాకపోతే ఈ చెడుతో పాటు మంచిని కూడా కత్తిరిస్తాయి.

యూపీఏ హయాంలో ఒకసారి ఎయిర్‌టెల్‌ , ఐడియా సంస్థలు చార్జీలు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు టెలికాం మంత్రిగా ఉన్న కపిల్‌ సిబల్‌ ఇది సరికాదని హితవు చెప్పారు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో మాట్లాడి ధరల పెంపు విషయంలో ఏదో ఒకటి చేయమని కోరతామని ప్రభుత్వం తెలిపింది. రోజులు మారాయి. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ప్రపంచం మొత్తం మీద మన దేశంలో మాత్రమే కాల్, డేటా చార్జీలు తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా టారిఫ్‌ల పెంపుదలకు ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు కూడా ఇలాంటి షాకులుం టాయంటున్నారు. ఇది నిజమే కావొచ్చు. కానీ అత్యంత చవకైన చార్జీలతో ఆకర్షించి, కోట్లాదిమంది వినియోగదారుల్ని పెంచుకుంటూపోయి తీరా అందరూ అలవాటు పడ్డాక అదును చూసి భారీ టారిఫ్‌లతో మొత్తడం వ్యాపార సంస్థలకు కొత్తగా అబ్బిన విద్య కాదు. టారిఫ్‌ పెంపును వారం రోజులకయ్యే టీ ఖర్చుతో ఒక కంపెనీ ప్రతినిధి పోల్చారు. తాను ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఒక విధంగా అది సరైన పోలికే. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు విపరీతంగా పెరిగిన టీ అలవా టుకు మూలం కూడా ఈ వ్యాపార సూత్రంలోనే ఉంది. ఈస్టిండియా కంపెనీ వ్యాపారులు మొదట దాన్ని ఉచితంగా ఇచ్చి అలవాటు చేసి ఆ తర్వాత దానికొక మార్కెట్‌ను సృష్టించు కోగలిగారు. 

దేశంలో వందకోట్ల మొబైల్‌ ఫోన్లు వినియోగంలో ఉన్నాయని ఒక అంచనా. ఇకపై వీరంతా  అదనంగా సగటున 50 శాతం వరకూ చెల్లించకతప్పదు. మొబైల్‌ కనెక్షన్‌కు ఆమధ్య తప్పనిసరి చేసిన కనీస నెల చార్జి కూడా రూ. 35 నుంచి రూ. 49కి పెరిగింది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై కొంత పరిమితి దాటాక నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సివస్తుంది. తాజా నిర్ణయంతో వినియోగ దారులు జారిపోకుండా ఉండటానికి వివిధ సంస్థలు రకరకాల పథకాలతో సిద్ధమవుతున్నాయి. ఏ పేరు పెట్టుకున్నా, ఎన్ని వెసులుబాట్లు కల్పిస్తామంటున్నా దాదాపు గత మూడేళ్లుగా వినియోగ దారులకు దొరికిన స్థాయిలో అవేమీ ఉండవు. స్వర్ణయుగం అనదగ్గ ఆ దశ దాటిపోయింది. అయితే వెనక్కి వెళ్లలేనంతగా వినియోగదారులంతా అలవాటు పడిపోయారు గనుక వారి సంఖ్య తగ్గదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని పలువురు నిపుణులు వేస్తున్న అంచనాలు ఏమేరకు సరైనవో చూడాల్సి ఉంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top