బిహార్‌లో పొత్తుల పర్వం


ఎన్నికల బిహార్‌లో సీట్ల సర్దుబాటు పర్వం ఒక కొలిక్కి వచ్చింది. ఇటు ముఖ్య మంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)-ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి... అటు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి సీట్ల పంపకాలు దాదాపు పూర్తి చేసుకున్నాయి. రాష్ట్రంలో తనకున్న విశ్వసనీయతపైనా, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ఈ పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపైనా ఆశలు పెట్టుకున్న నితీష్‌కు మిత్ర లాభం పెద్దగా కలిసిరాలేదు. సీట్ల సర్దుబాటుపై లెక్కలు వేసుకుంటుండగానే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ తన పార్టీకి ఇస్తామన్న స్థానాలపై ఆగ్రహోదగ్రుడై కూటమినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం నితీష్, లాలూ యాదవ్‌లను దెబ్బతీసింది.

 

 ఈ పరిణామం నుంచి కోలుకోకుండానే ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించి ఆ నాయకద్వయాన్ని మరింత కుంగదీశారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సీమాంచల్ (అరారియా, పూర్నియా, కిషన్‌గంజ్, కతిహార్ జిల్లాలు) ప్రాంతంలో మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తున్నది. అక్కడ మొత్తం 24 స్థానాలున్నాయి. అటు భూసేకరణ చట్ట సవరణ మొదలుకొని ఎన్నో అంశాల్లో జనం అసంతృప్తిని మూటగట్టుకున్న ఎన్‌డీఏ మాత్రం పెద్దగా అసంతృప్తి స్వరాలు వినిపించకుండానే సీట్ల పంపకాలను పూర్తిచేసుకోగలిగింది.

 

 నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా వీచినట్టుగానే బిహార్‌లో కూడా మోదీ గాలి వీచింది. అక్కడున్న 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 22 గెల్చుకోగా, దాని మిత్రపక్షాలకు 9 స్థానాలు లభించాయి. విడివిడిగా పోటీచేసిన అధికార జేడీ (యూ)కు 2, కాంగ్రెస్‌కు 2, ఆర్జేడీకి 4 వచ్చాయి. గెల్చుకున్న స్థానాలు తక్కువే అయినా ఓట్ల శాతం ఎన్డీయేతో పోలిస్తే తమకే అధికమని, కనుక అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పోటీ చేద్దామని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లు భావించాయి. ఈలోగా జేడీ(యూ), ఆర్జేడీలు సన్నిహితమై ఎస్‌పీ, దేవెగౌడకు చెందిన జనతాదళ్(ఎస్), ఐఎన్‌ఎల్‌డీ, ఎస్‌జేపీలను కూడా కలుపుకొని జనతా పరివార్‌గా ఏర్పడాలని నిర్ణయించారు.

 

 మొన్న ఏప్రిల్‌లో తామంతా విలీనమవుతున్నట్టు అందరూ ప్రకటించారు. అయితే తొలి సమావేశానికే దేవెగౌడ మొహం చాటేశారు. జనతా పరివార్ భావన ఆచరణరూపం దాల్చకుండానే ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఎత్తులేయడం ప్రారంభించారు. ఇందులో చేరితే యూపీలో తన ప్రాభవం కొడిగడుతుందేమోనన్న భయం ములాయంను మొదట్లోనే వెంటాడింది. దాంతో ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఇక కొత్త పార్టీ ఊసెత్తకుండా... కనీసం కూటమిగానైనా బరిలో దిగుదామని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు. కానీ ములాయం తప్పుకోవడంతో ఆ కూటమి కూడా అరకొరగానే మిగిలిపోయింది. ఇప్పుడు అందులో చెప్పుకోదగిన పార్టీలు జేడీ(యూ), ఆర్జేడీలు మాత్రమే. కాంగ్రెస్ ఉన్నా అది ‘ఆటలో అరటిపండు’ చందమే!

 

 పదేళ్ల నుంచి అధికారంలో ఉంటూ బిహార్‌ను అభివృద్ధి బాట పట్టించారని పేరొచ్చిన నితీష్‌కుమార్... తమ పార్టీతో సమానంగా ఆర్జేడీకి 100 సీట్లు కేటాయించడం, మరో 40 స్థానాలు కాంగ్రెస్‌కు ఇవ్వడం ఆయన బలహీనతను పట్టి చూపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీపడినప్పుడు ఈ పార్టీలన్నిటికీ కలిపి 45 శాతం ఓట్లు (ఎన్‌డీఏ కన్నా 9 శాతం అధికం)వచ్చి ఉండొచ్చుగానీ... కూటమిగా ఏర్పడితే అదే స్థాయిలో ఫలితాలు వస్తాయనడానికి లేదు. లాలూపై పడిన అవినీతి మరక, ఆయన పాలనలో రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులు కూటమికి ప్రతికూలంగా ఉండే అంశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ఈ కూటమి విజయం సాధించినా అధికారం కోసం ఏ స్థాయిలో హోరాహోరీగా పోరు జరుగుతుందో జనం ఊహించకపోరు. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఇది బతికి బట్టకట్టే కూటమి కాదనుకుంటే ఓటరు ఆ వైపునుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది.

 

 ఇదే సమయంలో ఎన్‌డీఏ కూటమి పెద్దగా గొడవలేమీ లేకుండా సీట్ల సర్దుబాటును పూర్తి చేసుకోవడం కూడా నితీష్ కూటమికి నష్టం చేకూర్చే అంశం. ఇవన్నీ చాలవన్నట్టు ఎంఐఎం రంగంలోకి దిగడం కూటమి ఆశలపై చన్నీళ్లు చల్లింది. ఇప్పటికే జీతన్‌రాం మాంఝీ వ్యవహారంలో నితీష్‌కుమార్ తీరుపై మహా దళితుల్లో అసంతృప్తి ఉంది. 2010లో నితీష్ గెలవడానికి కలిసొచ్చిన అంశాల్లో ఈ వర్గాల మద్దతు కూడా ఒకటి. ప్రస్తుత ఎన్నికల్లో ఎంఐఎం రంగప్రవేశం బీజేపీకే లాభిస్తుందని, అది పోటీ నుంచి విరమించుకోవాలని జేడీ(యూ), ఆర్జేడీ నేతలంటున్న మాట వాస్తవమే కావొచ్చు. కానీ ముస్లింల ఓట్లు తమకు మాత్రమే రావాలని, మిగిలిన పార్టీలు అందులో వాటా కోరుకోరాదని అనడం ఎలాంటి తర్కమో అర్థం కాదు. అసలు ఈ పార్టీల ఆచరణ ముస్లింలకు నమ్మకం కలిగించి ఉంటే, అవి నిజమైన సెక్యులర్ పక్షాలమని నిరూపించుకుని ఉంటే ఎంఐఎం లాంటి పార్టీకి అవి భయపడాల్సిన పనే లేదు.

 

 బీజేపీ 160 స్థానాలు తీసుకుని రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీకి 40, కుష్వాహా పార్టీ ఎల్‌జేఎస్‌పీకి 23, జీతన్‌రాం మాంఝీ పార్టీ హెచ్‌ఏఎంకి 20 సీట్లు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల మిత్రులను దారికి తెచ్చుకుని సీట్ల సర్దుబాటును బీజేపీ సజావుగా పూర్తి చేసుకోగలిగినా క్షేత్ర స్థాయిలో ఉండే అసంతృప్తి అంత త్వరగా చల్లారదు. ఎల్‌జేపీ నుంచి బుధవారం కీలకమైన నేతలు తప్పుకోవడమే ఇందుకు రుజువు. తమకు టికెట్లు లభ్యం కావని అర్థమయ్యాకే వారు బయటకు వెళ్లారని ఎల్‌జేపీ చెబుతున్న మాటల్లో వాస్తవం ఉండొచ్చు. కానీ మున్ముందు ఇలాంటి ఉదంతాలు ఇంకా పెరుగుతాయి. వాటి ప్రభావం సహజం గానే పార్టీల గెలుపు అవకాశాలపై ఉంటుంది. ప్రచారం ఇంకా పదునెక్కి ఎజెండాలోకి కొత్త కొత్త అంశాలు వచ్చి చేరుతున్నకొద్దీ ఇప్పుడున్న ఆధిక్యతలు మారే అవకాశం ఉంటుంది. ఈ రౌండ్‌లో అయితే ఎన్‌డీఏ కూటమే ముందంజలో ఉందని చెప్పుకోవాలి.

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top