‘అతి–మిత’ల మధ్య అటల్జీ! | ABK Prasad Article On Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

‘అతి–మిత’ల మధ్య అటల్జీ!

Published Tue, Aug 21 2018 12:40 AM | Last Updated on Thu, Aug 23 2018 10:26 PM

ABK Prasad Article On Atal Bihari Vajpayee - Sakshi

1996లో హైదరాబాద్‌ సందర్శించిన వాజ్‌పేయితో రచయిత 

బీజేపీలోని మత–మితవాద శక్తుల నుంచి ఎదురయ్యే ఆటుపోట్లకు తట్టుకోలేని వాజ్‌పేయి మధ్యేవాదిగా కూడా నిలవగలిగిన స్థితి లేదు. అందుకనే అంతరంగంలో ఘర్షణ లకు లోనై నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుని వాటికి అనుగుణంగా నిలబడలేకపోయారు. గుజరాత్‌లో(2002) జాతీయ మైనారిటీ వర్గానికి చెందిన సుమారు 2,000 మందిని ఆనాటి బీజేపీ సీఎం మోదీ హయాంలో ఊచకోత కోసిన ఘటనను ఆయన సహించలేకపోయారు. నాడు ప్రధాని హోదాలో వాజ్‌పేయి ‘రాజధర్మాన్ని’ పాటించడంలో విఫలమైన గుజరాత్‌ పాలకులడిపై చర్యతీసుకోవాలని కోరుతూ తీర్మానం చేయాలని గోవా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కోరినా ఆయన మాట చెల్లలేదు.

దాదాపు పద్నాలుగేళ్ల నాడే ప్రజా నాయక దశ నుంచి పక్కకు తప్పుకోడానికి ముందు అటల్‌ బిహారీ వాజ్‌పేయిలో మనం మర చిపోరాని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఒకటి, ప్రజలనుద్దేశించి అనర్గళంగా ప్రసంగించగల ఆయన ఆగిఆగి ఆలోచించి మాట్లాడేవారు. ఆ రోజుల్లో ప్రజలు చాలా ఓపికగా వింటుండేవారు. తన ఉపన్యాసాల్లో ఆచి తూచి మాట్లాడడాన్ని ఓ కళగా అలవాటు చేసుకున్నారు. ఇలా విరామం పాటించడం వల్ల భావాలను జాగ్రత్తగా క్రోడీకరించుకోవడానికి వీలుకలిగేది. బహిరంగ సభల్లో ఇచ్చే ఉపన్యాసాలపై ఓ విధమైన నాట కీయ ప్రభావం పడేది. సమన్వయ, సామరస్య భారతా వనికి అనుకూలుడిగా వాజ్‌పేయికి పేరుంది. రామా లయ నిర్మాణం కోసం బీజేపీ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ సాగించిన అయోధ్య రథయాత్రను 2000 డిసెంబ ర్‌లో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి ‘జాతీయ వాంఛ’గా అభివర్ణించారు.
– నీలాంజన్‌ ముఖోపాధ్యాయ, సుప్రసిద్ధ వ్యాఖ్యాత

ఆరెస్సెస్‌లో అంతర్భాగమైన రాజకీయపక్షంగా అవతరించిన బీజేపీలోని అతివాద, మితవాద పక్షాల మధ్య సమదూరంలోనే ఉంటూ ఘర్షణలకు తావు లేని సమన్వయ భారతాన్ని, కులాతీత, మతాతీత సెక్యులర్‌ వ్యవస్థను కాపాడిన నేత వాజ్‌పేయి. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు తుది శ్వాస వరకూ తట్టు కుంటూ వచ్చిన గౌరవనీయుడు. బహుశా అందువ ల్లనే ఆయనను ‘ఉండదగని పార్టీలో ఉన్న సచ్ఛీ లుడు’ అంటూ ఉండడం కద్దు. అందుకే ఆయనను ‘రెండు పడవలపై కాళ్లు పెట్టి సాగుతున్న’ వ్యక్తిగా కొందరు విమర్శకులు భావిస్తూవచ్చారు. పార్టీనేతగా, లౌకికవాదిగా తాను బహిరంగంగా విమర్శించి నట్టు కనిపించకపోయినా–కవితాపరంగానో, సందే శాత్మకంగానో ఆయన భావాలు అన్యాపదేశంగా చివ రిదాకా వ్యక్తమౌతూనే వచ్చాయి. కేఎన్‌ గోవిందా చార్య వంటి కరుడుగట్టిన పెద్దలు వాజ్‌పేయిని ‘ముసుగులో దాగి ఉన్న ఆరెసెస్‌ మనిషి’గా ముద్ర వేసి చులకన చేయడానికి ప్రయత్నించారు. ఆయన వ్యక్తిత్వానికి, దార్శనికతకు, ప్రజాస్వామ్య విలువలకు, భిన్నాభిప్రాయాలు గౌరవించే స్వభావానికి అసంఖ్యాక ప్రజానీకం గౌరవ వందనం సమర్పిం చింది. ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న అన్ని వర్గాల, పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొనడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 

నిర్దుష్ట నిర్ణయాలు తీసుకోలేకపోయారు!
వాజ్‌పేయిని ‘ముఖోటా’ అని గోవిందాచార్య నిందించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పైకి మాత్రమే ఆయన అనుకూలంగా కనిపించినా, ఆచరణలో బాబ్రీమసీదు విధ్వంసానికి అనుమతించడాన్ని కవితా రూపంలో వ్యతిరేకిస్తూ హెచ్చరించారు. రెండు, బాబ్రీమసీదు కూల్చివేతకు ముందురోజు (1992 డిసెంబర్‌ 5) ‘కరసేవ’ కార్యకర్తలనుద్దేశించి ఆయన పరోక్షంగా కవితా రూపంలో చేసిన హెచ్చరిక. ఈ రెండు హెచ్చరికల ప్రధాన సారాంశం: ‘‘చదును చేయకుండా కోసుగా(పదునుగా) ఉన్న రాళ్ల గుట్టలతో నిండిన నేల అది. అక్కడ ఎవరూ కూర్చోవడానికి ప్రయత్నించరు. ఈ ఎత్తుపల్లాల నేలను చదును చేయాల్సి ఉంటుంది సుమా! కాని, రేపు ఏం జరగనుందో నాకు తెలియదు. నేనైతే అయోధ్యకు వెళ్లాలనుకున్నానుగాని, అయ్యా నా ప్రయాణం అటుకాదు, ఇటూ అంటూ ఢిల్లీ వైపు సుమా, అని చూపారు!’’ అంటే, చివరకు వాజ్‌పేయి జోస్యమే నిజమై కూర్చుంది. అంత పనీ జరిగింది.

బీజేపీలోని మత–మితవాద శక్తుల నుంచి ఎదురయ్యే ఆటుపోట్లకు తట్టుకోలేని వాజ్‌పేయి మధ్యేవాదిగా కూడా నిలవగలిగిన స్థితి లేదు. అందుకనే అంతరంగంలో ఘర్షణలకు లోనై నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుని వాటికి అనుగుణంగా నిలబడలేకపోయారు. అంతేగాదు, గుజరాత్‌లో(2002) జాతీయ మైనారిటీ వర్గానికి చెందిన సుమారు 2,000 మందిని ఆనాటి బీజేపీ ముఖ్యమంత్రి హయాంలో ఊచకోత కోయగా ఆ పరిణామాన్ని ఆయన సహించలేకపోయారు. నాడు ప్రధాని హోదాలో వాజ్‌పేయి, ‘రాజ ధర్మాన్ని’ పాటించడంలో విఫలమైన గుజరాత్‌ పాలకులపై చర్యతీసుకోవాలని కోరుతూ తీర్మానం చేయాలని గోవా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అడ్వాణీ, అరుణ్‌జైట్లీని కోరారు. అలా చేస్తే పార్టీలో ఆంతరంగిక కల్లోలం వస్తుందని చెప్పిన ఈ నేతలు వాజ్‌పేయి నోరు కట్టేసిన సంగతి లోకానికి తెలిసిన బహిరంగ రహస్యమే. ప్రధాని హోదాలో ఉండి కూడా ఇలా అడుగడుగునా పాలనా వ్యవస్థను, తన అధికారాన్ని సజావుగా సాగకుండా చేయడంలో బీజేపీలోని ప్రతీప శక్తులు ప్రయత్నించాయి. 

ఆరెస్సెస్‌ నేతలను బుజ్జగించడంలో విఫలం!
ముసుగులోని సంఘ్‌ నేతగా గోవిందాచార్య ఆడిపోసుకున్నా ఆరెస్సెస్‌ నేతలను మచ్చిక చేసుకోవడంలో వాజ్‌పేయి విఫలమయ్యారనేది అగ్రశ్రేణి విమర్శకుడు, పాత్రికేయుడు నీలాంజన్‌ ముఖోపాధ్యాయ అభిప్రాయం. 1999లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏఐఏడీఎంకే వైదొలిగాక ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఒక ఓటు తేడాతో వీగిపోయింది. తన సర్కారు ఇలా కూలిపోయాక నిజాయితీకి నిండుకుండగా జీవితాంతం నిలబడిన వాజ్‌పేయి వెంటనే రాజీనామా చేశారేగాని అధికారంలో కొనసాగే ప్రయత్నాలు చేయలేదు. మరి ఈనాడు పూటకో పార్టీ, రోజుకో మాట మార్చే నేతలు మన మధ్య తిరుగుతున్నారు. విధానాలపై ఎన్ని విభేదాలున్నా వ్యక్తుల మధ్య గౌరవ సంబంధాలుండాలని ఆయన సదా కోరుకున్నారు. రాజకీయంగా విభేదించిన తొలి ప్రధాని నెహ్రూను, ఎమర్జెన్సీ ద్వారా అప్రదిష్టపాలైన ఇందిరాగాంధీని, రాజీ వ్‌గాంధీని కూడా ఆయన గౌరవప్రదంగానే పలకరించేవారు. ఇరుగు పొరుగు దేశాలతో ఆయన సంత్సం బంధాలు బలపడేందుకు కృషిచేశారు.

ఈ దేశాల నేతలతో స్నేహం పెంపొందే రీతిలో వ్యవహరించారు. కార్గిల్‌ యుద్ధకాలంలోనూ పాకిస్తాన్‌తో చెడి పోయిన ఉన్న సంబంధాలను పునరుద్ధరించి శాంతి ప్రతిష్ఠాపన కోసం తహతహలాడిన వ్యక్తి వాజ్‌పేయి. అందుకోసం స్వయంగా పాకిస్థాన్‌కు బస్సు యాత్ర చేశారు. చైనాతోనూ ఘర్షణల నివారణకు నెహ్రూ హయాంలో బెడిసిన సంబంధాలను పునరుద్ధరించ డానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సార్క్‌ దేశాల సదస్సుల్లో ఆయన చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. లాహోర్, ఆగ్రా శిఖరాగ్ర సమా వేశాల్లో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్, సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌తో చర్చల అనంతరం సంధి పత్రాలను ఆచరణలో సఫలం చేయడానికి వాజ్‌పేయి ఎంతో కృషిచేశారు. కాని ఇప్పటికీ  జమ్మూకశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కుదరడం తేలిక కాదని తెలిసి కూడా ఆయన అందుకు గట్టి ప్రయత్నమే చేశారు. కశ్మీర్‌ సమస్యకు శాంతి చర్చలు మినహా మరో మార్గం లేదని, చారిత్రకంగా దేశ విభ జనతో సంక్రమించిన సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని గ్రహించిన దౌత్యనీతి శిఖరం వాజ్‌పేయి.

ఫెర్నాండెజ్‌తో ఇబ్బందులు!
లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండి కూడా స్వతంత్ర భారతదేశాన్ని ఏలిన 14మంది ప్రధాన మంత్రుల్లో తొమ్మిది మంది తమ హయాంలో వాజ్‌పేయి మాదిరిగా స్నేహ వాత్సల్యంతో పాకిస్తాన్‌ పర్యటించిన పాపానపోలేదు. అలాగే, చైనాతోనూ ‘పంచశీల’ ప్రాతిపదికగా గతంలో నెలకొన్న స్నేహ సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నమూ జరగ లేదు. కానీ వాజ్‌పేయి ప్రధానమంత్రిత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన లోహియా సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్‌ ఈ ఉభయ దేశాల సంబంధాల్లో ‘పుల్లలు’ పెట్టడానికి తన వంతు పని తాను చేయడం వల్ల వాజ్‌పేయి కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రధానికి తెలియకుండా కొన్ని ఉత్తరాలను అమెరికా మెరమెచ్చుల కోసం రాయడంవల్ల చైనాతో మన సంబంధాలు మరికొంత కాలం బెడిసి కొట్టాయని మరవరాదు. అలాగే పండిత నెహ్రూపై వాజ్‌పేయి వైఖరి కూడా సామరస్యపూర్వకమేగాని, వైమనస్యంతో కూడినది కాదు. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు విదేశాంగ శాఖ కార్యాల యంలో ఉన్న సౌత్‌ బ్లాక్‌లో ఉండే జవహర్‌లాల్‌ నెహ్రూ ఫొటోను ఎవరో తీసేశారు. దీన్ని ఎవరు తొలగించారు, అది ఇప్పుడెక్కడ ఉందన్న ప్రశ్నలకు ఎవరి నుంచీ జవాబు రాలేదు.

దీంతో వాజ్‌పేయి ఆగ్రహంతో నెహ్రూ ఫొటోను వెంటనే అది అంతకు ముందు ఉన్న  చోటులోనే దాన్ని అమర్చాలని ఆదే శించారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్‌పేయిని జమ్మూ–కశ్మీర్‌ సమస్యల పరిశీలనకు పంపడం ప్రజాస్వామిక పద్ధతిలో విలక్షణమైన ధోరణిగా పరిగణించాలి. బహుశా ఈ ప్రజాస్వామ్య వైఖరి కొరవడబట్టేనేమో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ సభ సందర్భంగా ప్రధాని ప్రసంగ వేదిక దగ్గరలో ఉన్న డిస్‌ప్లే బోర్డుమీద తొలి దేశీయాంగమంత్రి సర్దార్‌ పటేల్‌ బొమ్మ తప్ప, తొలి ప్రధాని, నవభారత నిర్మాతల్లో అగ్రగణ్యుడైన పండిట్‌ నెహ్రూ ఫొటో కన్పించలేదు. బహుశా అందుకే వాజ్‌పేయి ప్రధానమంత్రి పదవి అనేది కేవలం అనుభవించదగిన ఒక వస్తువు కాదని, కనుకనే ‘‘భారత రాజకీయ రంగస్థలంపైకి లాగి పునర్జీవితం ప్రసాదించిన నాయకుడు వాజ్‌ పేయి’’ అని ప్రసిద్ధ పత్రికా వ్యాఖ్యాత మోనురంజన్‌ అన్నమాట అక్షర సత్యం. కాకపోతే ఆర్థిక రంగంలో ప్రపంచీకరణకు స్వాగతం పలికి, దేశంలోకి విదేశీ పెట్టుబడులను రెండుచేతులా ఆహ్వానిం చడంలో మన్మోహన్‌ సింగ్, వాజ్‌పేయి, నరేంద్ర మోదీల మధ్య తేడా లేదు. ప్రస్తుతం మనది వెనక్కిపోతున్న భారతమేగానీ, వెలిగిపోతున్న ఆర్థికం కాదనీ అల్లకల్లోలంగా మారిన దేశ ప్రజల జీవనమే సాక్ష్యం!

- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement