అమ్మకానికి ‘ఆధార్‌’

Aadhaar details available for Rs 500 - Sakshi

ఆధార్‌ కార్డు గురించి, పౌరుల వ్యక్తిగత గోప్యతకు దానివల్ల కలుగుతున్న నష్టం గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగానికి తాజా పరిణామం మింగుడుపడటం లేదు. నాలుగురోజులక్రితం ఆంగ్ల దినపత్రిక ట్రిబ్యూన్‌ మహిళా జర్నలిస్టు ఒకరు రూ. 500 చెల్లించి కోట్లాది మంది పౌరుల సమస్త వివరాలూ పొందుపరిచిన  ఆధార్‌  లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సంపాదించారు. ఆమె మరో రూ. 300 చెల్లించి కావలసిన ఆధార్‌ కార్డు వివరాల కాపీని పొందడానికి వీలయ్యే సాఫ్ట్‌వేర్‌ను రాబట్టారు. పంజాబ్‌ రాజధాని చండీ గఢ్‌లో జరిగిన ఈ ఉదంతం గురించి అక్కడి ఆధార్‌ అధికారులను ప్రశ్నిస్తే వారు విస్మయపడ్డారు.

ఆంగ్ల చానెల్‌ ‘ఇండియా టుడే’ విలేకరులు రహస్య కెమెరాలతో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తే అందులో మరింత దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడ య్యాయి. రూ. 2 చొప్పున చెల్లిస్తే కావలసినంతమంది వివరాలు ఇవ్వడానికి అనే కులు సిద్ధపడ్డారు. ఆ విలేకరులు అలా చెల్లించి 15,000మంది వివరాలను పొందారు. ఇది వెల్లడైన వెంటనే అప్రమత్తమై ఎక్కడెక్కడ లోపాలున్నాయో వెదికి సరిదిద్దడానికి బదులు ప్రభుత్వ యంత్రాంగం విలేకరుల మీద కేసులతో విరుచుకు పడింది. ఆధార్‌ డేటా లీకైన విషయం బయటపడటం ఇది మొదటిసారి కాదు. నిరుడు మే నెలలో లీక్‌ సంగతిని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఇది ఆధార్‌ కార్డును రూపొందించే యూనిక్‌ ఐడెంటిఫి కేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ లోపం కాదని, ఆ సమాచా రాన్ని ఉపయోగించుకుంటున్న వివిధ ప్రభుత్వ విభాగాల అవగాహనలేమి కారణ మని తెలిపింది.

210 ప్రభుత్వ విభాగాలు తమ తమ వెబ్‌సైట్లలో ఆధార్‌ వివరా లుంచాయని, దీన్ని గమనించి తొలగింపజేశామని వివరించింది. ఆ సమయంలో దాదాపు 10 కోట్లమంది పౌరుల వివరాలు బహిర్గతమయ్యాయని అంచనా వేశారు. అయితే పౌర సమాజ కార్యకర్తలు మాత్రం ఆధార్‌ డేటా ‘బయటి వ్యక్తుల’ చేతు ల్లోకి పోయిందని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. చివరకు అదే నిజమని తాజా ఉదంతాలు వెల్లడిస్తున్నాయి.
పౌరుల నుంచి వివరాలు సేకరించి ఆ డేటాను నిక్షిప్తం చేసేందుకు దేశ వ్యాప్తంగా 3 లక్షలమంది ఆపరేటర్లను కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ స్కీం (సీఎస్‌ సీఎస్‌) కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నియ మించింది. ప్రస్తుతం ఆ పనిని చాలాచోట్ల పోస్టాఫీసులకూ, కొన్ని బ్యాంకు శాఖ లకూ అప్పగించింది.

పర్యవసానంగా రోడ్డునపడిన అనేకమంది ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని వారి ద్వారా కొందరు ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఆధార్‌ సమా చారాన్ని అంగట్లో విక్రయిస్తున్నారని ట్రిబ్యూన్‌ పత్రిక అంటున్నది. ఇన్నాళ్లూ నిద్రపోయింది చాలక ఇప్పుడు అప్రమత్తం చేసిన మీడియాపై ప్రభుత్వం విరుచు కుపడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సమస్య తలెత్తాక ప్రభుత్వమైనా, యూఐ డీఏఐ బాధ్యులైనా చేయాల్సింది వెబ్‌సైట్‌ అన్యుల చేతుల్లోకి ఎలా పోయిందో ఆరా తీయడం. ఎందుకంటే ఆ వెబ్‌సైట్‌ కోసం వినియోగిస్తున్న సర్వర్లు, అందుకు ఉప యోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ అసాంఘిక శక్తుల చేతుల్లో పడటం కోట్లాదిమంది పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తుంది.

ఆ సర్వర్లు, సాఫ్ట్‌వేర్‌ దుర్భేద్యమైనవని ఇన్నాళ్లూ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. కేవలం యూఐడీఏఐ డైరెక్టర్‌ జనరల్, రాష్ట్ర స్థాయిలో ఉండే ఆ సంస్థ ప్రాంతీయ కేంద్రాల అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ మినహా మరెవరూ అధికారిక పోర్టల్‌ను తెరవలేరని అన్నది. కానీ రూ. 500 ఖర్చుపెడితే అది సంపాదించడం అత్యంత సులభమని ట్రిబ్యూన్‌ పత్రిక నిరూపించింది.  

ఆధార్‌ వ్యవహారం 2009లో మొదలైనప్పుడు పలువురు సామాజిక కార్య కర్తలు ఇది ప్రమాదకరమైన చర్య అని హెచ్చరించారు. ఇలాంటి ప్రాజెక్టునే మొదలుపెట్టిన బ్రిటన్‌ ఆ డేటాను కాపాడటం అసాధ్యమని గుర్తించి మధ్యలోనే దాన్ని విరమించుకున్న సంగతిని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం వినలేదు. అప్పుడు విపక్షంలో ఉండి ఆధార్‌ను వ్యతిరేకించిన బీజేపీ అధికారంలోకొచ్చాక దాన్ని మరింత విస్తృతపరిచింది. డేటా లీకయ్యే ప్రమాదమున్నదని చెప్పినప్పుడే ప్రభుత్వం నిపుణుల సహాయసహకారాలతో అందులో వాస్తవమెంతో తెలుసుకోవ డానికి ప్రయత్నించి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు.

కనీసం పౌరుల డేటా సేకరించిన బ్రిటన్‌ మధ్యలో ఎందుకు ఆపేసిందో, అందుకు గల కారణాలేమిటో తెలుసుకుని ఉంటే సమస్య తీవ్రత అర్ధమయ్యేది. పౌరుల సమస్త అవసరాలకూ ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసినప్పుడు అనివార్యంగా ఏదో ఒక స్థాయిలో డేటా లీక్‌ కావడం తప్పదు. తాజా పరిణామం గమనిస్తే అసలు మూలంలోనే పెను లోపమున్నదని అర్ధమవుతుంది. అరకొర పరిజ్ఞానంతో ఒక మూఢ విశ్వాసాన్ని ఏర్పరుచుకుని, దానికి భిన్నంగా ఎవరు ఏం చెప్పడానికి ప్రయత్నించినా మూర్ఖంగా కొట్టిపారేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ తమ డేటా లీక్‌ కాదని, అసాధ్యమని వాదించినవారు ఇప్పుడు కొత్త వాదన లంకించు కుంటున్నారు. ఆధార్‌ సమాచారం బయటికొస్తే ఏం కొంప మునుగుతుందన్న తర్కం లేవదీస్తున్నారు.

డేటా చౌర్యం చేసినవారు తప్పుడు పేర్లతో సిమ్‌ కార్డులు పొందడానికి, బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి వాటిద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. అసలు వ్యక్తికి సంబంధం లేకుండా, తెలియకుండా ఇవన్నీ జరిగిపోతుంటాయి. అమాయక పౌరులల్లో నమ్మకం కలిగించి వారిని ఎన్నో రకాలుగా మోసగించడానికి వీలుంటుంది. అన్ని టికీ ఆధార్‌ తప్పనిసరి చేయడాన్ని, దాని చెల్లుబాటును ప్రశ్నించే పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అది తేలేలోగా కనీసం ఆధార్‌పై అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్ణయించాలి. డేటా చౌర్యం జరి గినప్పుడు అందుకు బాధ్యత ఎవరిదో నిర్ధారించి చర్యలు తీసుకోవాలి. కళ్లు మూసుకు కూర్చుంటే, ప్రశ్నించినవారిని దబాయిస్తే సమస్య పరిష్కారం కాదని గ్రహించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top