ఒత్తిడితో బాల్యం చిత్తు | students in strees | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో బాల్యం చిత్తు

Sep 17 2016 11:48 PM | Updated on Sep 4 2017 1:53 PM

ఒత్తిడితో మధన పడుతున్న విద్యార్థి

ఒత్తిడితో మధన పడుతున్న విద్యార్థి

నేటి తల్లిదండ్రులది ఒకటే కోరిక.. అదేమంటే.. తమ పిల్లలు ఐఐటీల్లో సీటు సాధించాలి. ఇంజినీరు కావాలి. లేదా మెడిసిన్‌ సీటు సాధించి డాక్టర్‌ కావాలి. దానికోసం ఎంత ఖర్చయినా భరించడానికి.. ఏ కష్టమైనా పడటానికి సిద్ధం అన్న ధోరణిలో ఉన్నారు.

 
–చదువుల పరుగులో రనౌట్‌ 
–ఇష్టమైన రంగాన్ని ఎంచుకోనివ్వని తల్లిదండ్రులు
–కార్పొరేట్‌లో బాల్యం సమిధ
యూనివర్సిటీ క్యాంపస్‌‌:
నేటి తల్లిదండ్రులది ఒకటే కోరిక.. అదేమంటే.. తమ పిల్లలు ఐఐటీల్లో సీటు సాధించాలి. ఇంజినీరు కావాలి. లేదా మెడిసిన్‌ సీటు సాధించి డాక్టర్‌ కావాలి. దానికోసం ఎంత ఖర్చయినా భరించడానికి.. ఏ కష్టమైనా పడటానికి సిద్ధం అన్న ధోరణిలో ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచనా సరళితో ఉన్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమలా తమ పిల్లలు కష్ట పడకూడదని తలుస్తున్నారు. అందుకోసం లక్షలు వెచ్చించి కార్పొరేట్‌ సంస్థల్లో చేర్పిస్తున్నారు. దీంతో తరగతి గదుల్లో   వికసించాల్సిన బాల్యం ఒత్తిడికి గురై, మోడువారి పోతుంది. ప్రస్తుతం ఆత్మహత్యలకు పాల్పడే వారిలో 90 శాతం టీనేజీ వారే ఉండగా, వారిలో చదువు కారణంగా ఆత్మహత్యకు చేసుకునేవారు 75 శాతం ఉన్నారు. ఈ గణంకాలు పరిశీలిస్తే చిన్నారుల ఆత్మహత్యలు ఎంత ప్రమాదకరస్థాయిలో ఉన్నాయో అవగతమవుతుంది. 
విద్యార్థి ఆసక్తికి తగ్గిన ప్రాధాన్యం
ర్యాంకులు, డాక్టర్‌ , ఇంజినీరు చదువులే లక్ష్యంగా ప్రస్తుత విద్యావిధానం కొనసాగుతోంది. పాఠశాలల యాజమాన్యాలు కూడా తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. విద్యార్థులకు ఇష్టమైన చదువు చదువుకునే స్వేచ్ఛ ఇవ్వడం లేదు. విద్యార్థుల్లోని ఇష్టాన్ని, వారికి ఏ రంగంపై ఆసక్తి ఉందన్న విషయం గుర్తించి ప్రొత్సాహిస్తే అందులో వారు రాణించగలరు. ప్రఖ్యాత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ తాను చదువులో ఫెయిల్‌ అయినప్పటికీ తనకు ఇష్టమైన క్రికెట్‌లో రాణించి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. నిన్నటికి నిన్న పీవీ సింధు రియో ఒలంపిక్స్‌లో రజతం సాధించి పేరు ప్రఖ్యాతులు సాధించారు. అలాగే చిన్నతనంలో పేపర్‌ బాయ్‌ పనిచేసిన అబ్దుల్‌ కలాం మిసైల్‌ మ్యాన్‌గా ఎదిగి రాష్ట్రపతి అయ్యారు. ప్రపంచంలో 64 కళలు ఉన్నాయి. ఏ కళపైన అయినా ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు రాణిస్తారు. అయితే ఆ దిశగా ఏ తల్లీదండ్రీ ఆలోచించడం లేదు. ఫలితంగా వికాసానికి బాటలు వేయాల్సిన విద్య, భారంగా మారుతోంది. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. దాన్ని తట్టుకోలేక, అనుకున్న లక్ష్యాలు సాధించలేక, తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు నెరవేర్చలేని స్థితిలో చిన్నారులు బలవర్మణాలకు పాల్పడుతున్నారు.           
 నిబంధనలు ఏం చెపుబుతున్నాయంటే.. 
 దేశంలో విద్యావిధానంపై కొఠారి కమిషన్‌ కొన్ని సిఫారసులు చేసింది. అలాగే 1952లో మొదలియార్‌ కమిషన్‌ ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఎలా ఉండాలన్న అంశంపై పలు సిఫారసులు చేసింది. 2010 ఏప్రిల్‌ 1నుంచి అమలులోకి వచ్చిన విద్యహక్కు చట్టం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయమని చెప్పింది. అయితే అది విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అయి ఉండాలి. విద్యార్థుల మానసిక వికాసం ఎదుగుదలకు అవకాశం ఇవ్వాలి. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:25 గా ఉండాలి. ప్రతి పీరియడ్‌ 45 నిమిషాల పాటే ఉండాలి. ఉదయం 4, సాయంత్రం 3 పీరియడ్‌లు మాత్రమే ఉండాలి. ఇందులో కో–కరికులం యాక్టివిటీస్‌ అంటే క్రీడలు, సంగీతం, నత్యం, కళలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే 6 గంటలకు మించి విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థులను శిక్షించకూడదు. ఐదేళ్లు నిండిన తరువాతే పాఠశాలలో చేర్చాలి. అర్హత కల్గిన ఉపాధ్యాయులను నియమించాలి. ఏదేనా ప్రమాదం జరిగితే ప్రతి గదికి ఫైర్‌ ఇంజన్‌ వెళ్లే విధంగా విద్యాసంస్థ భవనాలు ఉండాలి. చక్కటి క్రీడా మైదానం ఉండాలి. తప్పని సరిగా సైకాలజిస్ట్‌ ఉండాలి. 
 జరుగుతుందేమిటి?
 నిబంధనల్లో ఉన్నదానికి విరుద్ధంగా నేటి విద్యావిధానం కొనసాగుుతోంది. గాలి, వెలుతురు లేని గదుల్లో వందకు మించి విద్యార్థులను కుక్కుతున్నారు. అపార్ట్‌మెంట్‌లు, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అర్హతలేని వారితో విద్యబోధన చేయిస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. హాస్టల్‌ విద్యార్థులను ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు చదివిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు 6 గంటలు కూడా నిద్ర పోలేక పోతున్నారు. సరైన మార్కులు పొందని తెచ్చుకోని వారిని అవమానాలకు గురి చేస్తున్నారు. వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇదే నేటి ఈ పరిస్థితికి దారితీస్తోంది.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement