
గగన కుసుమం
ఇక ఆ పంటను చూడటం గగన ‘కుసుమ’మే అని అంతా అనుకున్నారు.
♦ అంతరిస్తున్న ‘కుసుమ’
♦ నారాయణఖేడ్‌లో మాత్రం సజీవం..
♦ నూనె గింజల పంటసాగులో రైతులు
♦ ఈ ఏడాది వెయ్యి హెక్టార్లలో సేద్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇక ఆ పంటను చూడటం గగన ‘కుసుమ’మే అని అంతా అనుకున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోయే దశలో ఉన్న ఈ నూనె గింజల పంట నారాయణఖేడ్ పల్లెల్లోని పంట పొలాల్లో మాత్రం జీవం పోసుకుంటోంది. నియోజకవర్గంలోని మనూరు, కంగ్టి, నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో విస్తారంగా కుసుమ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం వెయ్యి హెక్టార్లలో దీన్ని సాగు చేస్తున్నారు. మూడు నెలల్లోనే ఈ నూనె గింజల పంట చేతికొస్తుంది. రైతులు రబీలో అంతరపంటగా వేస్తున్నారు. విత్తనం మొలకెత్తితే చాలు, ఇక నీరు అవసరం లేదు. చలికాలంలో ఠమొదటిపేజీ తరువాయి
మంచుతో వచ్చే తేమను తీసుకొని పెరుగుతుంది. వ్యాధుల బారిన పడని, జంతువులు మేయని, కోతులు తినని గట్టి పిండం ఈ మొక్క. ఎప్పుడైనా పేను బంక పారితే కిరోసిన్‌ను నీళ్లలో కలిపి పిచికారీ చేస్తే చాలు. ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటాళ్లు పండుతుంది. క్షేత్రంలో పూర్తిగా ఇదే పంట వేస్తే 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన సుదర్శన్‌రావు అనే రైతు తెలిపారు. ప్రస్తుతం క్వింటాల్ ధర మార్కెట్‌లో రూ.4000 వరకు ఉంది. ఇక్కడి పల్లె ప్రజలు ఎక్కువగా కుసుమ నూనెను వంటకాల్లో వినియోగిస్తారు. ఈ నూనె రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్త నాళాలను శుద్ధి చేసి రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. ఈ నూనె వినియోగించే వారు గుండె జబ్బులకు దూరంగా ఉంటారని శాస్త్రీయంగా తేలింది.