రెండు లారీల మధ్య నలిగిన కారు | Sakshi
Sakshi News home page

రెండు లారీల మధ్య నలిగిన కారు

Published Thu, May 26 2016 2:49 AM

రెండు లారీల మధ్య నలిగిన కారు - Sakshi

లారీ ముందు నుంచి వెళ్లేందుకు యత్నం..
అదే సమయంలో ఎదురుగా మరో లారీ
రెండింటి మధ్య నుజ్జునుజ్జయిన కారు
పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
 
కామారెడ్డి: పక్కనే లారీ వెళ్తోంది.. దానికి ఎడమ పక్కనే కారు.. ఒక్కసారిగా ఆ కారు లారీ ముందుకు దూసుకొచ్చింది.. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా మరో లారీ వచ్చింది.. ఇంకేముంది..? క్షణాల్లో ఘోర ప్రమాదం! రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది! అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం ఉదయం నిజామాబాద్ జిల్లా     కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామ శివారులోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. పిల్లల్ని చదువుల కోసం తీసుకువెళ్తూ వారితోపాటు వారి తండ్రులూ  మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది.
 
ప్రమాదం ఎలా జరిగింది..?
ఆర్మూర్ మండలం ఆలూర్‌కు చెందిన ఎన్సాని లక్ష్మణ్ (34), ఆయన కుమారుడు హర్షవర్ధన్, నందిపేట మండలం వెల్మల్‌కు చెందిన గందె ప్రవీణ్ (33), ఆయన కూతురు లిఖిత, కొడుకు భరత్ బుధవారం ఉదయం ఆల్టో కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. భరత్‌ను కామారెడ్డిలో ఉంటున్న తాత, నానమ్మ, బాబాయ్‌ల వద్ద వదివెళ్లాల్సి ఉంది. టేక్రియాల్ బైపాస్ వద్దకు చేరుకోగానే కామారెడ్డి వైపు వెళ్లేందుకు కారును తిప్పారు.

సరిగ్గా ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీకొంది. అప్పుడే ఎదురుగా మరో లారీ రావడంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా ధ్వంసమైన కారు నుంచి మృతదేహాలను బయటకు తీసి, ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని మృతుల బంధువులను పరామర్శించారు.
 
ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు..
గందె ప్రవీణ్, ఎన్సాని లక్ష్మణ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒక్కచోటే చదివారు. ప్రవీణ్ వెల్మల్ గ్రామంలో కిరాణ షాపు నడుపుతుండగా, లక్ష్మణ్ ఆలూర్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. వేర్వేరు గ్రామాల్లో స్థిరపడినా వీరు తరచుగా కలుసుకునేవారు. తమ పిల్లలకు మంచి విద్యనందించాలని ఆరాటపడేవారు.

ప్రవీణ్ కూతురు లిఖిత ఇటీవలే నిజామాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసి బీటెక్ చదివేందుకు సిద్ధమైంది. కొడుకు భరత్ ఇటీవలే తొమ్మిదో పూర్తి చేశాడు. లక్ష్మణ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు హర్షిత్ ఇటీవలే టెన్త్ పూర్తి చేశాడు. లిఖితను ఇంజనీరింగ్ చదివించేందుకు మంచి కాలేజీలు చూడాలనుకున్నారు. హర్షిత్‌ను ప్రైవేటు కాలేజీలో చేర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ బయల్దేరారు. కానీ అంతలోనే ప్రమాదం వారిని కబలించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement