పంచాయతీ ‘ప్రక్షాళన’ | Panchayat cleansing and catagiry for mandal | Sakshi
Sakshi News home page

పంచాయతీ ‘ప్రక్షాళన’

May 25 2016 2:47 AM | Updated on Mar 28 2018 11:26 AM

పంచాయతీ ‘ప్రక్షాళన’ - Sakshi

పంచాయతీ ‘ప్రక్షాళన’

గ్రామ పంచాయతీల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. అవకతవకలకు చెక్‌పెడుతూ పంచాయతీ పాలనను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది.

ఇక క్లస్టర్లుగా గ్రామ పంచాయతీలు 
ఆదాయం ఆధారంగా విభజన
ఒక్కో క్లస్టర్‌లో 2,3 పంచాయతీలు 
మండలాలకూ కేటగిరీలు
త్వరలో కార్యదర్శుల బదిలీలు

గ్రామ పంచాయతీల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. అవకతవకలకు చెక్‌పెడుతూ పంచాయతీ పాలనను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రెండు లేదా మూడు పంచాయతీలను ఒకచోటకు చేర్చుతూ వాటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా మండలాలను సైతం కేటగిరీలుగా విభజిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కార్యదర్శులను గ్రేడ్ల ఆధారంగా బదిలీచేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో సుదీర్ఘకాలంగా పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారికి తప్పనిసరిగా స్థాన చలనం కలిగించేందుకు రంగం సిద్ధం చేసింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 688 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే పంచాయతీ కార్యదర్శుల సంఖ్య వీటికి సమంగా లేకపోవడం.. కొన్ని పంచాయతీలు భారీ ఆదాయాన్ని కలిగి ఉండడంతో కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీ క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపారు. వాస్తవానికి వీటి విభజనకు సంబంధించి 2009లోనే గెజిట్ విడుదల చేసినప్పటికీ.. విభజన మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. పంచాయతీల్లో పాలన గాడితప్పుతుందని భావించిన యంత్రాంగం తాజాగా క్లస్టర్ల ఏర్పాటు పూర్తిచేసింది. ఇందులో పంచాయతీ ఆదాయాన్ని ప్రాతిపదికన విభజన జరిగింది. రూ.10లక్షల ఆదాయాన్ని మించిన పంచాయతీలన్నీ గ్రేడ్1లో వచ్చాయి.

ఆ తర్వాత రూ.10 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను విభజించి వాటి సంఖ్యను ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో 370 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. ఇందులో గ్రేడ్ 1 క్లస్టర్లు 134, గ్రేడ్ 2 క్లస్టర్లు 52, గ్రేడ్ 3 క్లస్టర్లు 83, గ్రేడ్ 4 క్లస్టర్లు 101 ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక కార్యదర్శిని నియమిస్తారు. దీంతో ఒక్కో కార్యదర్శి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతల్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది.

 మండలాలకూ ‘కేటగిరీ’..
జిల్లాలో 33 గ్రామీణ మండలాలున్నాయి. తాజాగా పంచాయతీ క్లస్టర్ల ప్రక్రియను పూర్తిచేసిన ఆ శాఖ మండలాలను సైతం మూడు కేటగిరీలుగా విభజించింది. పట్టణ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని విభజన చేపట్టారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యమున్న పంచాయతీలను కేటగిరీ ‘సీ’గా గుర్తించారు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ నేపథ్యమున్న వాటిని కేటగిరీ ‘బీ’లో, పూర్తి గ్రామీణ నేపథ్యమున్న మండలాలను కేటగిరీ ‘ఏ’ విభాగంలోకి చేర్చారు. దీంతో ‘ఏ’కేటగిరీలో 14 మండలాలు, ‘బీ’ కేటగిరీలో 10 మండలాలు, ‘సీ’ కేటగిరీలో 8 మండలాలను చేర్చారు. తాజాగా నిర్దేశించిన క్లస్టర్, కేటగిరీల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని పంచాయతీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శుల హోదా ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించిన పంచాయతీ శాఖ.. అందుకు సంబంధించి అభ్యంతరాలను సేకరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement