క్షణమొక యుగంలా.. | Missing AN-32: families struggeled | Sakshi
Sakshi News home page

క్షణమొక యుగంలా..

Jul 27 2016 1:22 AM | Updated on Sep 4 2017 6:24 AM

మా ఆయన వచ్చేస్తారంటూ ధైర్యం? వస్తారంటారా అని అనుమానం? ఎక్కడున్నారో అని ఆందోళన...

గోపాలపట్నం :  మా ఆయన వచ్చేస్తారంటూ ధైర్యం? వస్తారంటారా అని అనుమానం? ఎక్కడున్నారో అని ఆందోళన... ఇదీ విమానంలో గల్లంతైన ఎన్‌ఏడీ ఉద్యోగుల భార్యల్లో ఉద్విఘ్నమైన పరిస్థితి. ఎవరెళ్లి పలకరించినా ఇదే ఆవేదన.. ఆందోళన. ఎన్‌ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్‌వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్‌ మహారాణా, ఎన్‌.చిన్నారావు, జి.శ్రీనివాసరావులతో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు ఎయిర్‌ఫోర్సు విమానంలో వెళ్తూ గత శుక్రవారం ఉదయం గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం నుంచి నిద్రహారాలు సహించక ఆయా కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. క్షణమొక యుగంలా రాక కోసం ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి.
తిండి సహించడం లేదు..
గర్భిణి కావడంతో గంట్ల శ్రీనివాసరావు భార్య ఈశ్వరి పరిస్థితి మరింత బాధగా ఉంది. గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిండి సహించడం లేదు. కునుకు తీయడంలేదు. భర్త జాడ ఏమైందంటూ అందర్నీ వేడుకుంటోంది. ఎవరి నోట విన్నా ఇంకా తెలీదన్న మాటే వస్తుండడంతో సానుకూల కబురు కోసం టీవీ వార్తలను వింటోంది. ఆమె కాస్త అస్వస్థతకు గువ్వవడంతో కుటుంబసభ్యులు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శ్రీనివాసరావు తల్లి సూరీడమ్మ కొడుకు ఎక్కడున్నాడంటూ రోదిస్తోంది. 
గుండెలవిసిపోతున్నాయి..
గోపాలపట్నం శ్రీనివాసనగర్‌లో ఉన్న పాటి నాగేంద్ర కుటుంబం తీవ్రఆందోళన చెందుతోంది. ఆరు రోజుల యినా నాగేంద్ర రాకపోవడమేంటని ఆవేదన చెందుతున్నారు. భార్య పూర్ణిమ రోదనలతో గుండెలవిసిపోతున్నాయి. తల్లిదండ్రులు, అత్తమామలు దుఃఖం జీర్ణించుకోలేక, పూర్ణిమని ఓదార్చే శక్తి లేక కుంగిపోతున్నారు. నాగేంద్ర ప్రాణాలతో తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. పూర్ణిమకు తిండి, నీరు సహించక పోవడంతో ఆరోగ్యం మందగించింది. ఆమెకు వైద్యులు సెలైన్‌ ఎక్కించాల్సి వచ్చింది.    
కేరళ నుంచి నేవీ ఉన్నతాధికారుల ఫోన్‌
కేరళ నుంచి నేవీ ఉన్నతాధికారులు మంగళవారం పాటి నాగేంద్ర భార్య పూర్ణిమ, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. ఎయిర్‌ఫోర్స్‌ విమానం జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇంతవరకూ ఎలాంటి జాడ లేదని చెప్పారు. లేనిపోని వదంతులు నమ్మవద్దని, స్పష్టమైన సమాచారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement