శ్రీశైలం నుంచి గృహాల తరలింపు
శ్రీశైలంలో నివాసిత గృహాలను సున్నిపెంట పరిధిలోని ఇరిగేషన్ స్థలంలోకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.
- టీటీడీ, నందినికేతన్ అతిథిగృహాల తొలగింపు
·- టోల్‌గేట్ నుంచి నందిమండపం వరకు రోడ్ల విస్తరణ
- శివరాత్రిలోగా దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్‌లోకి.
శ్రీశైలం: శ్రీశైలంలో నివాసిత గృహాలను సున్నిపెంట పరిధిలోని ఇరిగేషన్ స్థలంలోకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఈఓ భరత్ గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డిలు బుధవారం విజయవాడలో సీఎంతో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రధాన మాడా వీధుల్లో ఉన్న దుకాణాలన్నీ.. సిద్ధిరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లోకి మహాశివరాత్రిలోగా మార్చి వేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. సున్నిపెంట పరిధిలో 450కి పైగా ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని గుర్తించామని, ఈ స్థలంలో శ్రీశైలదేవస్థానం సిబ్బందితో పాటు క్షేత్రవ్యాప్తంగా ఉన్న 3,250 నివాసిత గృహాలను ఆ ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఈఓకు ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం కింద గృహ నిర్మాణ సంస్థ సున్నిపెంటలో కొత్తగా నిర్మించే ఆధునిక గృహాలకు అవసరమైన స్థలాన్ని ఇరిగేషన్ శాఖ దేవస్థానానికి అప్పగించాలని చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీశైల క్షేత్రపరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, శ్రీగిరి కాలనీలతో పాటు కొత్తపేటలో ఉన్న నివాసిత గృహాల వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలా లేక బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న) పథకం కింద గృహాలను కట్టించి ఇవ్వడమా అన్న విషయంపై అవసరమైన చర్యలు, సమీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎం దేవస్థానం ఈఓకు, జిల్లా కలెక్టర్‌కు సూచించినట్లు తెలిసింది.
ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం ..
శ్రీశైలమహాక్షేత్రంలో సుమారు 6 కిలోమీటర్లపైగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులలో పర్యావరణం దెబ్బ తినకుండా బృహత్తర ప్రణాళికలను అమలు చేయాలని సీఎం.. ఈఓకు సూచించారు. బసవణ్ణమార్గ్‌గా అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ రింగ్‌రోడ్డును తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుమార్గంలో కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాలలో శివదీక్ష భక్తులు రింగ్‌రోడ్డు ద్వారా స్థానికంగా ఉన్న అన్ని మఠాలను సందర్శనీయ స్థలాలను దర్శించుకుని స్వామిఅమ్మవార్ల ఆలయప్రాంగణం చేరుకుంటారు.
మాడా వీధుల విస్తరణ
శ్రీశైలం ఆలయ ప్రాకారం చుట్టూ ఉన్న మాడా వీధులను విస్తరించేందుకు ఈవో నిర్ణయం తీసుకున్నారు. రథవీధి, పోస్టాఫీస్‌రోడ్డు, టోల్‌గేట్ సమీపంలోని నందిసర్కిల్ నుంచి బస్టాండ్ దగ్గర ఉన్న నంది మండపం వరకు విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించి దేవస్థానానికి స్వాధీనం చేసిన టీటీడీ అతిథిగృహంతో పాటు వీఐపీల కోసం ఏర్పాటు చేసిన నందినికేతన్ అతిథిగృహాన్ని పడగొట్టాలని దేవస్థానం ఈఓ నారాయణభరత్ గుప్త నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీటీడీ ఆవరణంలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్, పోస్టాఫీస్‌రోడ్డులో ఉన్న ఆంధ్రాబ్యాంక్, టోల్‌గేట్ రోడ్డుమార్గంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంక్‌లను షాపింగ్ కాంప్లెక్స్‌లోకి మార్చుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులకు ఆదేశించారు.