యువకుడి హల్‌చల్‌ | Young Man Halchal | Sakshi
Sakshi News home page

యువకుడి హల్‌చల్‌

May 21 2018 1:53 PM | Updated on Oct 22 2018 6:10 PM

Young Man Halchal - Sakshi

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సురేందర్‌రావు 

గద్వాల క్రైం: బానిస సంకెళ్లు విడిపించుకోవాలనుకున్న ఓ యువకుడు.. ఇటీవల సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను ఆసరాగా చేసుకుని.. గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, తానే కత్తితో గాయం చేసుకుని హల్‌చల్‌ సృష్టించాడు. పోలీసులు విచారించడంతో తానే ఈ పనిచేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఘటన వివరాలను గద్వాల డీఎస్పీ సురేందర్‌రావు ఆదివారం విలేకరులకు వెల్లడించారు.  

సరదాగా గడపాలని.. 

మండలంలోని సంగాలకు చెందిన కుర్వ నర్సింహులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొడుకు నరేష్‌ను మధ్యలోనే చదువు మానిపించి గొర్రెలు మేపేందుకు పంపించాడు. ఆరేళ్లుగా అడవులు, పొలాల్లో గొర్రెలను కాసిన నరేష్‌కు వీటి వెంట తిరగడం ఇష్టం లేదు. అయితే ఇంట్లో ఈ విషయం చెప్పినా కొడతారనే భయంతో చెప్పుకోలేకపోయాడు. దీంతో ఇటీవల సోషల్‌ మీడియాలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తుందని సమాచారం తెలుసుకున్న నరేష్‌ తాను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 17న సంగాల శివారులో గొర్రెల మంద ఆపాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నర్సింహులు తమ కుమారుడు నరేష్‌కు అన్నం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నరేష్‌ తనపై దొంగలు దాడిచేశారని తండ్రికి చెబితే గొర్రెలు విక్రయిస్తాడని, ఇక వీటిని కాసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో వ్యవసాయ పొలాల్లో దొరికిన పారం ముల్లుతో చేతు, కాళ్లపై రక్తం వచ్చేలా గాట్లు చేసుకుని తండ్రికి ఫోన్‌చేశాడు

. తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పి గ్రామంలోకి పరుగెత్తి తనను ఎవరో చంపడానికి యత్నించారని పరుగెత్తుకొచ్చి గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ చేపట్టారు. 

గీసుకున్న ఆనవాళ్లే.. 

ముందుగా బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించినట్లు డీఎస్పీ సురేందర్‌రావు తెలిపారు. అయితే వైద్యుల నివేదికలో గాయాలు కత్తితో చేసినవి కావని, కేవలం గీసుకోవడం వల్లే అయ్యాయని తేల్చారు. లోతుగా విచారించగా తనకు గొర్రెలను కాయడం ఇష్టం లేకనే ఇలా చేసినట్లు నరేష్‌ చెప్పాడన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే సందేశాలు, భయబ్రాంతులకు గురిచేసే వీడియోలు సోషల్‌ మీడియాలో పంపించే వారిపై కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో పార్థు గ్యాంగ్‌ సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు.

ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశం మేరకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్‌ ఎస్‌ఐ ఆంజనేయలు, గ్రామీణ ఎస్‌ఐ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement