మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

woman committed suicide because of harrasement - Sakshi

ఫేస్‌బుక్‌లో అపార్ట్‌మెంట్‌ నిర్వాహకుని అనుచిత వ్యాఖ్యలు 

నిద్రమాత్రలు మింగి సెల్ఫీ వీడియోను పోస్టు చేసిన బాధితురాలు

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో తనపై అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేయడంతో మనస్తాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు మంగళ వారం వెల్లడించారు. ఉప్పర్‌పల్లిలో హెచ్‌ఈఆర్‌ అపార్ట్‌మెంట్‌లోని 403 ఫ్లాట్‌లో తబస్సుం (32), భర్త సలీమ్‌ ఉన్నీస్సా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఉంటున్నారు.

అపార్ట్‌మెంట్‌లో కనీస సౌకర్యాలు అంతంతమాత్రమే ఉన్నా మెయింటెనెన్స్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనికితోడు గత నెలలో చార్జీలను పెంచారు. అపార్ట్‌మెంట్‌ను పాతబస్తీ డబీర్‌పురా ప్రాంతానికి చెందిన సలీమ్‌ నిర్వహిస్తున్నాడు. అపార్ట్‌మెంట్‌ నిర్వహణ విషయమై ఈ నెల 20న తబస్సుం.. సలీమ్‌ను ప్రశ్నించింది. ఆ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ విషయమై అదేరోజు సాయంత్రం సలీమ్‌.. తబస్సుంకు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. ఈ వ్యవహారాన్ని తబస్సుం సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేసి 21న రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా ఇదే విషయమై పోలీసులు తబస్సుంను మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇంటికి వచ్చిన తబస్సుం ఫేస్‌బుక్‌లో సలీమ్‌ పోస్టు చేసిన అనుచిత కామెంట్లు చూసింది. దీంతో మనస్తాపం చెంది అదే ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియోలో 90 నిద్రమాత్రలు చూపుతూ మింగింది.

తనను వేధించిన సలీమ్‌ను కఠినంగా శిక్షించాలని వీడియో లైవ్‌లో తెలిపింది. ఈ వీడియోను చూసిన స్నేహితులు విషయాన్ని ఆమె భర్తకు తెలిపారు. ఆమెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడ నుంచి ఉస్మానియాకు తరలించారు. మరో 16 గంటల పాటు ఏమి చెప్పలేని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనను సలీమ్‌ దుర్భాషలాడిన విషయాన్ని తబస్సుం ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయన సూచన మేరకే కేసు పెట్టింది. పోలీసులు అదే రోజు సలీమ్‌ను శిక్షించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదంటూ అంజదుల్లాఖాన్‌ వెల్లడించారు.  

మనస్తాపంతో ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియోలో ఆత్మహత్యాయత్నం  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top