అర్ధరాత్రి యువతికి వేధింపులు

Torture Of A Young Woman At Midnight - Sakshi

ఒంగోలు నుంచి చీమకుర్తి వరకు బస్సును ద్విచక్రవాహనంపై వెంబడించిన వైనం

అక్కడ తనవారు లేకపోవడంతో మళ్లీ ఆటోలో ఒంగోలు చేరుకుని పోలీసులను ఆశ్రయించిన యువతి

ఇరువురు యువకులను అదుపులోకి తీసుకున్న అవుట్‌పోస్టు పోలీసులు 

సాక్షి, ఒంగోలు: పోలీసులు అప్రమత్తమత్తతతో ఓ యువతి రక్షణ పొందింది.  గుంటూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఆమె సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుంటూరు నుంచి ఒంగోలు బస్టాండుకు చేరుకుంది. ఇంటికి వెళ్ళేందుకు పడిగాపులు పడుతున్న సమయంలో ఇద్దరు యువకులు ఆమె చుట్టూ చేరి కామెంట్‌ చేస్తున్నట్లు అవుట్‌ పోస్టు పోలీసులు గుర్తించారు. వారిని అక్కడ నుంచి పంపేసి యువతిని ప్రశ్నించారు. తాను గుంటూరు నుంచి వచ్చానంటూ వివరాలు తెలియజేసి చీమకుర్తికి వెళ్లేందుకు ఉన్నట్లు పేర్కొంది. దీంతో వారు కనిగిరి బస్సు సిద్ధంగా ఉందని సూచించడంతో ఆమె బస్సుఎక్కింది. అయితే బస్సు వెళ్ళిన తరువాత ఇద్దరు యువకులు తమ ద్విచక్రవాహనంపై చీమకుర్తికి బయల్దేరారు.

బస్సును వెంబడిస్తున్నారని గమనించింది. చీమకుర్తిలో దిగిన తర్వాత యువతి వెంటనే తమ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసింది. అయితే వారు ఫోన్‌ లిఫ్టుచేయకపోవడంతో ఇంటికి ఎలా చేరాలో తెలియక తల్లిడిల్లిపోయింది.దీంతో అక్కడ ఆటో ఎక్కి ఒంగోలు బస్టాండుకు తీసుకువెళ్లాలని చెప్పడంతో బస్టాండుకు చేర్చాడు. దీంతో మరలా బస్టాండుకు వచ్చిన యువతిని చూసి.. ఒంగోలు అవుట్‌పోస్టు పోలీసులు విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని చెప్పడంతో వారు అప్రమత్తమయ్యారు. సదరు యువకులు ఆమె దగ్గరకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. వారిని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు తాము యువతిని వెంటాడిన విషయం నిజమేనని ఒప్పుకున్నారు. దీంతో ఇరువురిపై ఎస్సై రాంబాబు కేసు నమోదు చేశారు. ఒకరు గుంటూరు జిల్లా దుర్గి మండలంకు చెందిన జయబాబు (స్థానికంగా అంజయ్యరోడ్డులో నివాసం), మరొకరు లింగసముద్రం మండలంకు చెందిన యం.రమేష్‌ (స్థానికంగా మంగమూరు డొంకలో నివాసం)గా తెలిసింది.

అవగాహన రాహిత్యం
మహిళలు ఏదైనా ఆపద అనుకుంటే డయల్‌ 100కు కాల్‌చేయాలని పోలీసుశాఖ పదే పదే సూచిస్తున్నా వినియోగించుకునే విషయంలో మాత్రం అవగాహన రాహిత్యం స్పష్టంగా కనబడుతోంది. దీనిపై సీఐ భీమానాయక్‌ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండు కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. అతికొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top