బయటపడుతున్న నోట్ల కట్టలు! | There is huge amount of Cash Seized in different places | Sakshi
Sakshi News home page

బయటపడుతున్న నోట్ల కట్టలు!

Mar 13 2019 3:25 AM | Updated on Mar 13 2019 4:23 AM

There is huge amount of Cash Seized in different places - Sakshi

మంగళగిరిలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

పట్నంబజారు(గుంటూరు)/మంగళగిరిటౌన్‌/ఉండి/తెనాలి రూరల్‌: ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలో కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. దీంతో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం చేసిన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నోట్లకట్టలు బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా  పరిసర ప్రాంతాల్లో రూ.కోటి 43లక్షల 92వేలు, మంగళగిరిలో రూ.82లక్షల 62 వేలు, ఉండిలో రూ.63 లక్షలు, తెనాలిలో 2.50 లక్షలు పట్టుబడ్డాయి. వివరాల్లోకి వెళితే..గుంటూరు అమరావతి రోడ్డు అరండల్‌పేట పోలీసులు ఓ ప్రైవేటు వాహనంలో తరలిస్తున్న రూ.1కోటి 15 లక్షలు పట్టుకున్నారు. అయితే నగదు సౌత్‌ ఇండియా బ్యాంకుకు చెందినవిగా వాహనంలో ఉన్నవారు తెలిపారు. నగదును ఐటీ అధికారులకు అప్పజెప్పారు. శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌లో కృష్ణనగర్‌కు చెందిన సుబ్బారెడ్డి సుజిత్‌ అనే యువకుడి వద్ద రూ.22లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పలకలూరురోడ్డులో  రూ.4లక్షలు పట్టుకున్నారు. వాటిలో రూ.1లక్ష 63 వేలకు ధ్రువీకరణ పత్రాలు ఉండటంతో మిగతా రూ.2లక్షల 52 వేలు ఐటీ అధికారులకు అప్పజెప్పారు.

గురజాలలో కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వజ్రాల పెద్ద అంబిరెడ్డి ద్విచక్ర వాహనంపై రూ.4.40 లక్షలు తీసుకువెళుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద రెండు వేర్వేరు కార్లలో తీసుకువెళ్తున్న రూ.82లక్షల 62 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుంకర శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉండవల్లి నుంచి కారులో మంగళగిరి వస్తుండగా రూ.70లక్షల 62వేలు కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన వివరాల గురించి శ్రీనివాసరావును అడగ్గా, ఉండవల్లిలో పొలం అమ్మి కొంత డబ్బు తీసుకుని మంగళగిరి రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. మరో చోట తనిఖీల్లో టి.మహీధర్‌ అనే వ్యక్తి కారులో రూ.12లక్షలను గుర్తించారు. సాయి శర్వణ్‌ కంపెనీ తరఫున కొండవీటి వాగుకు సంబంధించిన పనులు చేస్తున్నామని, ఆ పనులకు సంబంధించిన సొమ్మని మహీధర్‌ పోలీసులకు తెలిపాడు. అయితే పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని గుంటూరు ఐటీ అధికారులకు అప్పగించారు. నగదుకు సంబంధించిన పత్రాలు సమర్పించి తీసుకోవచ్చని తెలిపారు. తనిఖీల్లో స్టాటిస్టిక్స్‌ సరౌండింగ్‌ టీమ్‌ ఇన్‌చార్జి శైలశ్వేత, పట్టణ సీఐ రవిబాబు, ఎస్‌ఐ భార్గవ్, పీఎస్‌ హరిచందన తదితర సిబ్బంది పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యాను నుంచి రూ.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాన్‌ ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందినదని, అందులోని నగదు విజయవాడ నుంచి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న సదరు బ్యాంకు శాఖలకు చేరవేస్తున్నారని తెలియడంతో పోలీసులు బ్యాంకు అధికారులను పిలిపించి నగదుపై ఆరా తీశారు.  ఆ నగదు బ్యాంకు లావాదేవీల కోసమేనని తేలడంతో ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి, అధికారుల నుంచి హామీ పత్రాలు తీసుకుని నగదు విడిచిపెట్టారు.

తెనాలి మండలంలో..
తెనాలి మండలంలోని హాఫ్‌పేట వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష, మరో యువకుడి నుంచి రూ.50 వేలు, సంగంజాగర్లమూడిలో ఓ వ్యక్తి నుంచి రూ.లక్షను పోలీసులు పట్టుకున్నారు. నగదు విషయమై పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement