
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా యువత పెడచేవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది..
నడిరోడ్డుపై నిర్లక్ష్యం ఓ విద్యార్థిని పొట్టన బెట్టుకుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా యువత పెడచేవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో గురువారం చోటుచేసుకున్నఓ రోడ్డు ప్రమాదం.. నిర్లక్ష్య డ్రైవింగ్‌కు అద్దం పడుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాదపు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
సాక్షి, బీబీనగర్(భువనగిరి) : పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ బీటెక్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కానరాని లో కానికి వెళ్లాడు. బీబీనగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కుషాయిగూడకు చెందిన నేలపట్ల శివగౌడ్(18) యాదగిరిగుట్టలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ భువనగిరి వద్ద గల ఆరోరా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ వద్ద గల వీబీఐటీ కళాశాలలో గురువారం పరీక్ష రాసేందుకు తన స్నేహితులైన మండలంలోని చిన్నరావులపల్లికి చెందిన భరత్, సాయిరాంలతో కలసి ఒకే స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో సర్వీస్ రోడ్డు గుండా వస్తున్న వీరు కొండమడుగు మెట్టు వద్ద ప్రధాన రహదారిపై నుంచి మరో సర్వీస్ రోడ్డులోకి క్రాస్ అవుతుండగా ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివగౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా సాయికుమార్, భరత్‌లు తీవ్రంగా గాయపడ్డారు.
స్కూటీ ఢీకొని మరొకరు..
ఇన్నోవా స్కూటీని ఢీకొట్టిన సమయంలో రోడ్డు పక్కనే బస్సు కోసం వేచి ఉన్న కొండమడుగు పరిధిలోని మాధవరెడ్డి కాలనీకి చెందిన దొరబాబుకు స్కూటీ వెళ్లి తగలడంతో అతనికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనం మిషన్ భగీరథ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారిదిగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కృష్ణ తెలిపారు.
న్యాయం చేయాలని రాస్తారోకో
విద్యార్థి శివగౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం భువనగిరి ఏరియా ఆసుపత్రి ఎదుట విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధర్నా చేపట్టారు. వాహనం మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో శివ అక్కడిక్కడే మృతి చెందాడని, న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కారు యజమాని మృతుని కుటుం బానికి రూ. 2 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.