జిల్లాలో సారా పరవళ్లు

Increasing naatu Saara Supply In Prakasam - Sakshi

సాక్షి, చీరాల(ప్రకాశం) : జిల్లా ప్రస్తుతం కరువు కాటకాలతో అల్లాడుతోంది. సాగు, తాగునీరు లేక దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరువు బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నాయి. ఇటువంటి కరువు జిల్లాలో నాటుసారా మాత్రం పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యంగా చీరాలతో పాటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, పెద్దదోర్నాల, పుల్లలచెరువు, అర్ధవీడు, మార్కాపురం ప్రాంతాల్లో జోరుగా నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారు. చీరాలకు గుంటూరు జిల్లా స్టూవర్టుపురం నుంచి రోజుకు 1000 లీటర్లకుపైగా నాటుసారా సరఫరా అవుతోంది. చీరాల్లోని రామ్‌నగర్‌లో తయారీదారులు నేరుగా ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌ ఇసుక భూముల్లో సారా తయారు చేస్తున్నారు. పశ్చిమాన అటవీ ప్రాంతాలతో పాటు తండాల్లో తయారీ చేసి పట్టణాలు, గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. సారా లభించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. గతం టీడీపీ ప్రభుత్వం జిల్లాలో నాటుసారా లేదని ప్రకటించింది. పాలకులు మాత్రం నాటుసారా రహిత జిల్లాగా ఎలా ప్రకటించారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చీరాలకు మరో పేరు క్షీరపురి. అంటే ఒకప్పుడు పాడిపరిశ్రమతో ఈ ప్రాంతం కళకళలాడేది.

ప్రస్తుతం ఆ స్థానంలో సారా వెల్లువగా మారింది. చీరాల ప్రాంతంలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారే. కాయ కష్టం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. పని ఒత్తిళ్లు, ఇతర కారణాలతో మద్యం మత్తుకు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కూలి చేసుకుని బతికే ఈ వర్గాల ప్రజలు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థితి లేక ప్రత్యామ్నాయ మార్గంగా సారా వైపు దృష్టి సారిస్తున్నారు. కొన్నేళ్లుగా చీరాల ప్రాంతంలో సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరంలో అంటే ఐదు కిలోమీటర్లలోపే గుంటూరు జిల్లా స్టూవర్టుపురం మందుబాబులతో కోలాహలంగా ఉంటుంది. నాటుసారా కడుపునిండా తాగి తమతో కలిసి మద్యం తాగే వారికి పార్శిల్‌ రూపంలో కొనుగోలు చేసి రైళ్లలో రోజూ తెస్తుంటారు. వేటపాలెం, పందిళ్లపల్లి, జాండ్రపేట, రామకష్ణాపురం, చీరాల, ఈపూరుపాలెంతో పాటు చినగంజాం, పలు ప్రాంతాల నుంచి స్టూవర్టుపురం వెళ్లి సారాతాగి వెంట కూడా తెచ్చుకోవటం నిత్యకత్యం. 

సారా రహిత జిల్లా ఎక్కడ?
జిల్లాలో నాటుసారా ఊసేలేదని గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌ ప్రకటించారు. కానీ ఎక్కడా సారా ఆగలేదు. జిల్లాలోని చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటు మారుమూల తండాల్లో కొందరు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారంటే సారా అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్‌ కాలనీకి చెందిన కొందరు స్టూవర్టుపురంలో సారాను ఐదు లీటర్ల క్యాన్‌ రూ.400 కొనుగోలు చేసి మందుబాబులకు గ్లాస్‌ రూ.10, క్వార్టర్‌ రూ.20 నుంచి 30 చొప్పున విక్రయిస్తున్నారు. అందులోనూ మొదటి క్వాలిటీ, రెండో క్వాలిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణ రోడ్డు, జాలమ్మ గుడి, ఉజిలీపేట, శంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్‌ సమీపంలో కూడా సారా విక్రయాలు రోజూ భారీ స్థాయిలో జరుగుతుంటాయి. 

స్థానికంగా కూడా తయారీ 
గతంలో కేవలం స్టూవర్టుపురంలో మాత్రమే సారా తయారై చీరాలకు సరఫరా చేసేవారు. కానీ సారాకు డిమాండ్‌ పెరగటంతో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌ పక్కన, రామ్‌నగర్‌ గ్యాంగి, మత్య్సకార గ్రామం వాడరేవు, విజిలీపేట, జాలమ్మగుడి, ఫ్లయిఓవర్‌ బ్రిడ్జి కింద, జవహర్‌నగర్‌ ప్రాంతాలు కాపుసారా అమ్మకాలకు నిలయాలుగా మారాయి. ఇందుకోసం ఎక్సైస్‌ అధికారులు కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని సారా నియంత్రణకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యక్తులు సారా అమ్మకందారులతో చేతుల కలపడంతో సారా పరవళ్లు తొక్కుతోంది. కాపుసారా తయారీకి అధిక మోతాదులో మిరపకాయలు, యూరియా, బ్యాటరీ పౌడర్‌తో పాటు ఇతర హానికర విష పదార్థాలు కలుపుతున్నట్లు సమాచారం.  

నామమాత్రపు దాడులతో సరి 
నాటుసారా వ్యవహారాన్ని స్థానిక పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. స్టూవర్టుపురం నుంచి చీరాలకు ఆటోలు, టూవీలర్స్‌లో నేరుగా తరలిస్తుంటారు. ఈపూరుపాలెం రోడ్డు పక్కనే రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ దాటుకుని నేరుగా ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలకు నాటుసారా తరలిస్తున్నా స్థానిక పోలీసులు సారా పట్టుకుంటే మనకేమి వస్తుందిలే అనుకున్నారెమో గానీ వారి జోలికి వెళ్లడం లేదు. ఎక్సైజ్‌ పోలీసులు పరిస్థితి మరీ దారుణం. వారికి సారా సామ్రాట్లు అంటే మహా భయం. ఎక్సైజ్‌ పోలీసులపై సారా అమ్మే మాజీ నేరగాళ్లు పలుమార్లు దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు  అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌తో పాటు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సబ్‌డివిజన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఉన్నా వారు సారా నియంత్రించడంలో నామమాత్రంగా కూడా దృష్టి పెట్టడం లేదు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top