జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన

Hyderabad Twin Blasts Case Accused Get Death Sentence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష  విధించింది.ఈ మేరకు  చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు  సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలకు రూ.10వేల జరిమానతో పాటు మరణ దండన విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన  ఐదో నిందితుడైన మహ్మద్‌ తారీఖ్‌ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది. 

గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్‌ న్యాయస్థానం నిందితులకు మరణ శిక్ష విధించింది.

ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, అమిర్‌ రజా ఖాన్‌లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు

ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్‌ రజాఖాన్, రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖా ష్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, మహ్మద్‌ తారీఖ్‌ అంజుమ్‌ ఎహసాన్‌)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top