సీఆర్పీఎఫ్‌ జవాన్‌ అనుమానాస్పద మృతి

CRPF Jawan Suspicious death In Srikakulam - Sakshi

రెయ్యిపాడులో ఘటన

కుటుంబ కలహాలున్నట్లు అనుమానం

శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: మండలంలోని రెయ్యిపాడుకు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ వాండ్రాసి అప్పారావు(30) ఆదివారం తనఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉంటూ ఎవరికీ హాని తలపెట్టని ఇతడు మృతి చెందాడనే సమాచారంతో గ్రామస్తులు హతాశులయ్యారు. కొంతకాలంగా కుటుంబంలో కలహాలే మృతికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు వివరాల మేరకు... గ్రామానికి చెందిన భద్రాచలం, పుణ్యవతిల రెండో కుమారుడు అప్పారావుకు చెన్నై సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌ నుంచి 10 రోజుల కిందట బరంపురం వద్ద భగా సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌కు బదిలీ అయింది. దీంతో 10 రోజుల సెలవుపై ఇంటికి చేరుకున్నాడు. ఈ సెలవు పూర్తి కావడంతో ఈ నెల 4న తన తండ్రి భద్రాచలం బరంపురం సీఆర్పీఎఫ్‌ యూనిట్‌కు సాగనంపాడు.

అక్కడ్నుంచి రెండ్రోజుల్లోనే మృతుడు అప్పారావు మళ్లీ ఇంటికి వచ్చేశాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి 11 గంటల సమయంలో తండ్రి కాలకృత్యాల కోసం లేవగా, అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన భార్యను పిలిచాడు. కుమారుడిలో ఎటువంటీ చలనం లేకపోవడంతో నిర్ఘాంతపోయారు. ఇదిలాఉంటే, 2005లోనే సీఆర్పీఎఫ్‌లో ధోబీగా చేరిన అప్పారావు కొంతకాలానికి మానసిక సమస్యతో బాధపడుతుండేవాడు. 2018 జనవరి 30న చెన్నైలోని సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత విధుల్లోకి చేరలేదు. సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అప్పట్లోనే మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో కుటుంబ సభ్యులకు దొరకడంతో మిస్సింగ్‌ కేసును ఎత్తివేశారు.

మృతిపై పలు అనుమానాలు:
మృతుడు అప్పారావు వివాదరహితుడిగా పేరుంది. అయితే మద్యం సేవించే అలవాటు ఉంది. పైగా ఇతని జీతం మొత్తం కుటుంబ సభ్యులే తీసుకోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తరచూ వివాహం, జీతం, మద్యం సేవించే విషయాల్లో కుటుంబ సభ్యులతో గొడవలయ్యేవి. స్నేహితుల వద్ద తన బాధను చెప్పేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులపై అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ మేరకు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు తండ్రి భద్రాచలం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ కేవీ సురేష్‌ శవ పంచనామా చేయించిన తదుపరి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top