ఇవేం నిబంధనలు!! | US Criticises India's Data Localisation Norms | Sakshi
Sakshi News home page

ఇవేం నిబంధనలు!!

Apr 10 2019 9:39 AM | Updated on Apr 10 2019 9:39 AM

US Criticises India's Data Localisation Norms - Sakshi

భారత్‌ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్‌ నిబంధనలు, ఈ–కామర్స్‌ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది.

న్యూఢిల్లీ: భారత్‌ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్‌ నిబంధనలు, ఈ–కామర్స్‌ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది. ఇవి అత్యంత వివక్షాపూరితంగాను, వాణిజ్యాన్ని దెబ్బతీసేవిగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019లో విదేశీ వాణిజ్యానికి ప్రతిబంధకాలు అంశంపై అమెరికా వాణిజ్య విభాగం (యూఎస్‌టీఆర్‌) రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘భారత్‌ ఇటీవలే డేటాను స్థానికంగా భద్రపర్చాలని (లోకలైజేషన్‌) నిబంధనలను ప్రతిపాదించింది. ఇలాంటి వాటివల్ల డేటా ఆధారిత సేవలు అందించే సంస్థలు అనవసరంగా, వృథాగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా మెరుగైన సేవల ప్రయోజనాలను స్థానిక సంస్థలు పొందనీయకుండా చేస్తుంది. సీమాంతర డేటా వినియోగంపై ఆంక్షలు విధించడం వివక్ష చూపడమే అవుతుంది. ఇవి అమెరికా, భారత్‌ మధ్య డిజిటల్‌ వాణిజ్యానికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉంది. ఈ–కామర్స్‌ విధానం ముసాయిదాలో ఇలాంటి విచక్షణాపూరిత, వాణిజ్యాన్ని దెబ్బతీసే నిబంధనలను భారత్‌ పునఃసమీక్షించాలని అమెరికా భావిస్తోంది‘ అని నివేదిక పేర్కొంది.

చెల్లింపుల సమాచారం అంతా భారత్‌లోనే స్థానికంగా భద్రపర్చాలన్న నిబంధన వల్ల పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ వ్యయాలు పెరిగిపోతాయని, అంతర్జాతీయంగా సేకరించిన డేటాను ఒకే దగ్గర భద్రపర్చుకుని, వినియోగించుకునే  విదేశీ సంస్థలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది. దేశీయంగా డేటా, ఇన్‌ఫ్రా అభివృద్ధి, ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్, నియంత్రణపరమైన సవాళ్ల పరిష్కారం, దేశీ డిజిటల్‌ ఎకానమీకి ఊతమివ్వడం తదితర అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రత్యేక ఈ–కామర్స్‌ విధానం ముసాయిదా రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపైనే అమెరికా తాజాగా స్పందించింది.  

భారత్‌లో భారీ టారిఫ్‌లు..
ఇక భారత వాణిజ్య విధానాలపై కూడా నివేదికలో అమెరికా విమర్శలు గుప్పించింది. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యంత భారీగా సుంకాలు విధిస్తోందని పేర్కొంది. పూలపై 60 శాతం, రబ్బర్‌పై 70 శాతం, ఆటోమొబైల్స్‌పై 60 శాతం, మోటార్‌సైకిల్స్‌పై 50 శాతం, కాఫీ మొదలైనవాటిపై 100 శాతం, ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌పై 150 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోందని పేర్కొంది. అంతేగాకుండా వాణిజ్యానికి అవరోధాలు కల్పించేలా కొన్ని వైద్యపరికరాల ధరలను నియంత్రించడం, ఇథనాల్‌ దిగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి కూడా చేస్తోందని ఆరోపించింది.

ఈ–కామర్స్‌ ముసాయిదాతో డిజిటల్‌ లక్ష్యాలకు విఘాతం
ఐఏఎంఏఐ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో 2022 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగించేదిగా ఈ–కామర్స్‌ విధాన ముసాయిదా ఉందని ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. దీనివల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డేటా, ఇన్‌ఫ్రా అభివృద్ధి, ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్, నియంత్రణ నిబంధనలపరమైన సవాళ్లు, దేశీ డిజిటల్‌ ఎకానమీ వృద్ధికి తీసుకోదగిన చర్యలు మొదలైన వాటికి సంబంధించి రూపొందించిన జాతీయ ఈ–కామర్స్‌ విధాన ముసాయిదాపై పరిశ్రమవర్గాల స్పందన కోరిన మీదట ఐఏఎంఏఐ తాజా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘డేటా లోకలైజేషన్‌ తప్పనిసరి చేయడం, ఈ–కామర్స్‌ పరిధిలోకి డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌.. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ మొదలైనవన్నీ చేర్చడం, డిజిటల్‌ సేవల్లోకి విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించే అవకాశాలు మొదలైనవాటి వల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఎకానమీని నిర్మించాలంటే ఇవే చాలా కీలకం‘ అని పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement