ఇచ్చి... పుచ్చుకుంటే సంతృప్తి!

Tax savings on charitable donations - Sakshi

దాతృత్వ విరాళాలపై పన్ను ఆదా

నేరుగా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొచ్చు

వాటి గత చరిత్ర చూసి ఇవ్వడమే సరైనది

వీటి గురించి తెలియకపోతే ప్రత్యామ్నాయాలు

ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ తరహా సంస్థలూ ఉన్నాయ్‌

అందరిలోనూ లేకపోవచ్చు కానీ... సామాజిక సేవ చేయాలని, ఇతరులకు తమ వంతు తోడ్పాటునివ్వాలన్న ఆలోచన, ఆసక్తి ఉన్న వారు కూడా మన మధ్య చాలామంది ఉన్నారు. మనసులో కోరిక ఉన్నా... సమయాభావం, దూరాభారాలు, వ్యక్తిగత బాధ్యతలు తదితర అంశాలు చాలా మందిని దాతృత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నాయన్నది కాదనలేం. ఈ సమాజం నుంచి ఆర్జించిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా కొంతయినా రుణం తీర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ‘‘సమాజం మనకు ఏమిచ్చిందన్నది కాదు... మనం సమాజానికి ఏమిచ్చాం?’’ అన్నదే ముఖ్యమన్న డైలాగ్‌ గుర్తుండే ఉంటుంది. ఎవరికి తోచినంత వారు విరాళంగా ఇవ్వొచ్చు. కష్టపడి మీరు సంపాదించినది ఇతరుల జీవితాలను నిలబెడుతుందంటే అందులో ఉన్న సంతృప్తే వేరు కదా! ఇలా దాతృత్వ కార్యక్రమాల కోసం చేసే విరాళాల వల్ల పన్ను పరిధిలోకి వచ్చే వారికి ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

ఎవరికి...?
ఎన్నో సామాజిక కార్యక్రమాల కోసం ఏర్పాటైనవే స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు). ఇవి ప్రజల నుంచి విరాళాలు సమీకరిస్తుంటాయి. ఈ తరహా ఎన్‌జీవోల గురించి తెలిసి ఉంటే, వాటికి నేరుగా విరాళాలు అందించొచ్చు. కాకపోతే ఇచ్చే ముందు ఆయా సంస్థల చరిత్రను, చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఒకటి రెండు సార్లు పరిశీలించడం మర్చిపోవద్దు. మీరు ఎంచుకున్న ఎన్‌జీవోలకు చేసే విరాళాలపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ ప్రయోజనానికి అర్హత ఉందా? సదరు ఎన్‌జీవో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద అనుమతి పొందిందా? అన్నది చూడాలని నిపుణుల సూచన. ఎన్‌జీవోల ట్రస్టీలు ఎవరు, గత కాలం పనితీరుపై మీడియా కథనాలు కూడా పరిశీలించాలి. ఎన్‌జీవోలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారానూ కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది.

అయితే, ఓ స్వచ్ఛంద సంస్థ పనితీరు, ఇతర వ్యవహారాల వివరాలు తెలుసుకోలేకపోతే, తగినంత సమయం లేకపోతే, ఎవరికి విరాళం ఇవ్వాలన్నదానిపై స్పష్టత రాకపోతే... ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్, గివ్‌ ఇండియా వంటి మధ్యవర్తిత్వ స్వచ్ఛంద సంస్థలను పరిశీలించొచ్చు. మీరు ఈ సంస్థలకు విరాళం అందిస్తే... అవి అర్హత కలిగిన ఎన్‌జీవోలకు నిధులను అందిస్తాయి. ‘‘ఎన్‌జీవోలకు నిధులు అందిస్తుంటాం. ఎన్‌జీవోల కార్యక్రమాలకు చేయూతనిస్తాం. అంతేకాదు దాతలను ఎన్‌జీవోలతో మా వేదిక ద్వారా అనుసంధానించి విరాళాలు ఇచ్చే అవకాశం కల్పిస్తాం’’ అని ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ సీవోవో నగ్మాముల్లా తెలిపారు.

కైవల్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ అనేది ఒకానొక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ప్రిన్సిపాళ్లు, టీచర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా నాణ్యమైన విద్య కోసం కృషి చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నిధుల సాయాన్ని ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌ ద్వారా విరాళాల రూపంలో పొందుతోంది. విరాళాలను కైవల్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు ఇవ్వడంతోనే సరిపుచ్చకుండా, టీచర్ల శిక్షణ కోసం అవసరమైన వనరులను కూడా ఎడెల్‌గివ్‌ సమకూర్చింది. అలాగే, దాతృత్వ సంస్థ ‘దస్రా’ కూడా భిన్న రకాల స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందిస్తోంది. పారిశుద్ధ్యం, విద్య, పరిపాలన, జీవనోపాధి మెరుగుదల వంటి కార్యక్రమాల కోసం సహకారం అందిస్తోంది. విరాళాలు ఇచ్చే వారు ఇందులో దేనికోసం వినియోగించాలో చెప్పి మరీ అందించే అవకాశం కూడా ఉంది.  

ఇవీ అనుకూలతలు...
ఎడెల్‌గివ్, దస్రా వంటి సంస్థలకు విరాళాలిచ్చే ముందు... ఈ స్వచ్ఛంద సంస్థల నిధుల వినియోగం తీరు, ప్రాజెక్టుల కాల వ్యవధి తదితర అంశాలను పరిశీలించుకునే అవకాశం అయితే ఉంది. విరాళాలు అందించే దాతలకు చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు అవి చేపడుతున్న పలు కార్యక్రమాలపై తాజా సమాచారాన్ని ఈ మెయిల్స్, పోస్ట్‌ ద్వారా అందిస్తుంటాయి. తాము ఇస్తున్న డబ్బులను ఎందుకోసం, ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయో తెలుసుకునేందుకు నేరుగా క్షేత్ర స్థాయిలో సందర్శించి చూసుకునే అవకాశం కూడా కల్పిస్తుండడం గమనార్హం. దీనివల్ల తమ కష్టార్జితం విరాళంగా ఇవ్వడం వల్ల అవి మంచి పనులకు ఏ విధంగా వినియోగమవుతున్నాయో చూసి సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది.  
ఈ విధమైన ఆత్మ సంతృప్తికి తోడు ఆదాయపన్ను చట్టం కింద మినహాయింపులు కూడా సొంతం చేసుకోవచ్చు. సెక్షన్‌ 80జీ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఏ సంస్థకు విరాళం ఇచ్చారన్న దానిపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి, జాతీయ క్రీడా నిధి, జాతీయ సాంస్కృతిక నిధి, నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌లకు చేసే విరాళాలపై గరిష్ట పరిమితి లేకుండా పూర్తి మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు.

జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్, ప్రధానమంత్రి కరువు సాయ నిధికి చేసే విరాళంలో 50 శాతానికి పన్ను మినహాయింపు ఉంది. ఇలా 100 శాతం, 50 శాతం పన్ను మినహాయింపులు లభించే ఇతర విరాళాలు కూడా ఉన్నాయి. కాకపోతే విరాళం ఇచ్చే వారి వార్షిక స్థూల ఆదాయంలో 10 శాతానికి సమానంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను మినహాయింపు పొందాలనుకునే వారు ఎన్‌జీవోలకు ఇచ్చే విరాళాలకు రసీదులు తీసుకోవడం మర్చిపోరాదు. రసీదులో సంస్థ పేరు, చిరునామా, పాన్‌ నంబర్, రిజిస్ట్రేషన్‌ నంబర్‌తోపాటు విరాళం ఇచ్చిన వారి పేరు, ఎంత మొత్తం అనే వివరాలు తప్పకుండా ఉండాలి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top