స్ప్రింగ్‌ మ్యాట్రెస్‌లో పెప్స్‌ హవా | Pepes Hava in Spring Matter | Sakshi
Sakshi News home page

స్ప్రింగ్‌ మ్యాట్రెస్‌లో పెప్స్‌ హవా

Oct 13 2017 12:47 AM | Updated on Oct 13 2017 3:47 AM

Pepes Hava in Spring Matter

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పరుపుల తయారీలో ఉన్న పెప్స్‌ ఇండస్ట్రీస్‌ భారత్‌లో స్ప్రింగ్‌ మ్యాట్రెస్‌ విభాగంలో తన హవాను కొనసాగిస్తోంది. ఈ విభాగంలో ఐదేళ్లుగా తాము టాప్‌లో ఉన్నామని కంపెనీ జాయింట్‌ ఎండీ జి.శంకర్‌ రామ్‌ చెప్పారు. గురువారం సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో డోర్‌ హౌజ్‌ ఏర్పాటు చేసిన పెప్స్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

డిజైనింగ్‌కు పెద్ద పీట వేయడం వల్లే స్ప్రింగ్‌ మ్యాట్రెస్‌ అమ్మకాల్లో తొలి స్థానంలో ఉన్నామని చెప్పారు. 90 ఉత్పాదనలకు ట్రేడ్‌మార్క్‌ ఉందని తెలియజేశారు. ప్రపంచస్థాయి నాణ్యతగల మెమొరీ ఫోమ్‌ పరుపులను ఇటీవలే ప్రవేశపెట్టామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల పరుపులు విక్రయించామని, 2017–18లో 3.25 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారాయన. ‘‘కంపెనీని 12 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అయిదేళ్లలో రూ.100 కోట్ల స్థాయికి చేరుకున్నాం. మొదట్లో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. కస్టమర్లే మా బ్రాండ్‌ను ప్రచారం చేశారు’’ అని ఆయన వివరించారు.

తెలంగాణలో ప్లాంటు: కంపెనీకి కోయంబత్తూరుతో పాటు ఉత్తరాదిన మరో మూడు ప్లాంట్లున్నాయి. కోయంబత్తూరులో రూ.20 కోట్లతో ఫోమ్‌ మ్యాట్రెస్‌ తయారీకై అత్యాధునిక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది.

2016–17లో కంపెనీ టర్నోవరు రూ.254 కోట్లు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 75 శాతం. 2020 నాటికి టర్నోవరును రూ.750 కోట్లకు చేర్చాలని పెప్స్‌ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో రూ.500 కోట్లు స్ప్రింగ్‌ మ్యాట్రెస్‌ విభాగం నుంచే సమకూరుతుందని శంకర్‌ రామ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2020 కల్లా ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్ల సంఖ్యను 400లుకు చేరుస్తాం. యాక్సెసరీస్‌ విభాగంలో మరింత విస్తరిస్తాం. మూడేళ్లలో మరో రెండు ప్లాంట్లు నెలకొల్పే అవకాశం ఉంది. ఇందులో ఒకటి తెలంగాణలో పెట్టాలని భావిస్తున్నాం’ అని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement