వచ్చే ఏడాది ఫార్మా రయ్‌!

A new airplane uses charged molecules, not propellers or turbines, to fly - Sakshi

ధరలపరమైన ఒత్తిళ్లకు విరామం

అమెరికా మార్కెట్లో పరిమిత పోటీ

కలసివస్తున్న బలహీన రూపాయి

లాభదాయకమైన మాలిక్యూల్స్‌పై దృష్టి

ఆదాయాలు 15 శాతం పెరగొచ్చని అంచనాలు

న్యూఢిల్లీ: గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పేలవమైన పనితీరు చూపించిన ఫార్మా రంగం ఈ ఏడాది 20 శాతం రాబడులనిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపించిన రంగాల్లో ఇది కూడా ఒకటి. ఇక ముందూ ఫార్మా మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫార్మా కంపెనీల షేర్ల ర్యాలీకి ప్రధానంగా తోడ్పడినది డాలర్‌తో రూపాయి 15 శాతం మేర విలువను కోల్పోవడం. రూపాయి తగ్గడం వల్ల ఎక్కువగా లాభపడే కంపెనీ దివీస్‌ ల్యాబ్స్‌. ఈ సంస్థకు 90 శాతం ఆదాయాలు డాలర్‌ రూపంలోనే సమకూరుతున్నాయి. ఇక తమ ఆదాయాల్లో సగం మేర డాలర్ల రూపంలో పొందుతున్న డాక్టర్‌ రెడ్డీస్, క్యాడిలా హెల్త్‌కేర్, అరబిందో ఫార్మాలు కూడా బలహీన రూపాయి కారణంగా లబ్ధి పొందేవే.  

అమెరికాలో పరిస్థితులు మెరుగు
రూపాయి బలహీనతకు తోడు ఫార్మా రంగానికి కలిసివచ్చిన మరో అంశం అమెరికా మార్కెట్లో ధరల పోటీ తగ్గటం. ధరలపరంగా ఒత్తిళ్లు ఉన్న వాతావరణం గతేడాదితో పోలిస్తే మెరుగుపడింది. మరో రెండు త్రైమాసికాలు ఇదే కొనసాగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. నియంత్రణ పరమైన రిస్క్‌లు తగ్గడం, కాంప్లెక్స్, స్పెషాలిటీ ఔషధాల్లోకి ప్రవేశించడం వల్ల ఆదాయాలు, లాభాలు మెరుగుపడతాయని ఎడెల్వీస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ దీపక్‌ మాలిక్‌ అంచనా వేశారు. సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ఫార్మా కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌కు చెందిన కునాల్‌ ధర్మేష చెప్పారు.

అమెరికాలో ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. ఇక, కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోను క్రమబద్ధీకరించే చర్యలను కూడా అనుసరిస్తున్నాయి. కొన్ని మాలిక్యూల్స్‌పై నష్టాలు వస్తుండటంతో యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించిన వాటిని సైతం ఉపసంహరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో భారత కంపెనీలు ఇలా 548 ఔషధాలను అమెరికా మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నాయి. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది రెట్టింపు సంఖ్య. వీటిలో ఎక్కువ మందుల్ని వెనక్కి తీసుకున్నవి సన్‌ ఫార్మా, తెవా కంపెనీలే. వీటికి బదులు కంపెనీలు కాంప్లెక్స్‌ జనరిక్స్, తయారీకి కష్ట సాధ్యమైన, లాభదాయకమైన మాలిక్యూల్స్‌పై దృష్టి పెట్టాయి. తద్వారా తమ ఆదాయ, లాభాలను పెంచుకునే వ్యూహాలను అనుసరిస్తున్నాయి.

సానుకూలతలు...  
సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత కంపెనీల యాజమాన్యం అందించిన వివరాల ప్రకారం... లుపిన్‌కు సంబంధించి ఇండోర్‌లోని పితాంపుర్‌ యూనిట్‌–2కు, గోవా యూనిట్‌కు 2019 మధ్యనాటికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి క్లియరెన్స్‌ రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు యూనిట్లకు 2017 నవంబర్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌ యూనిట్ల క్లియరెన్స్‌కు సమయం పడుతుందని చెబుతున్నారు. విశాఖపట్నం దువ్వాడ అంకాలజీ ప్లాంట్‌లో గత నెల్లో ఎఫ్‌డీఏ తనిఖీలు ఆరంభం కాగా, దీనికి సంబంధించి సానుకూల ఫలితం రావచ్చని భావిస్తున్నారు.

మరోవైపు అమెరికా మార్కెట్లో జనరిక్‌ కంపెనీలు ధరలను శాసించే స్థాయిలో కాకుండా, ముక్కలుగా ఉండటాన్ని గమనించొచ్చు. అగ్ర స్థాయి పది కంపెనీల చేతిలో 55 శాతం మార్కెట్‌ ఉండటం ఇందుకు నిదర్శనం. దీంతో వాటి మధ్య స్థిరీకరణకు దారితీస్తుందని... శాండజ్‌కు చెందిన జనరిక్‌ ఔషధాలను అరబిందో 900 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయడం ఇందులో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత కంపెనీలకు రుణ భారం తక్కువగా ఉండటం, ఎక్కువ కంపెనీలు చేతిలో నగదు నిల్వలు కలిగి ఉండటంతో అమెరికాలో కొనుగోళ్ల అవకాశాలను సొంతం చేసుకుంటున్నాయని, ఇది పోటీ తగ్గేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఈ సానుకూలతల వల్ల జనరిక్‌ కంపెనీల ఆదాయాలు 15 శాతం పెరగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బ్రోకరేజీ సంస్థలు అరబిందో ఫార్మా, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ పట్ల సానుకూలంగా ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top