గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

Mukesh Ambani, Lakshmi Mittal among world is top CEOs - Sakshi

సీఈఓ వరల్డ్‌ మ్యాగజైన్‌ గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌

అత్యంత ప్రభావశీల సీఈఓల్లో

10 మంది భారతీయులు

వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మెక్‌మిలన్‌ టాప్‌  

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓ వరల్డ్‌ మ్యాగజైన్‌  తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మెక్‌మిలన్‌ అగ్రస్థానంలో నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ జాబితాలో చోటు లభించింది. భారత్‌కు సంబంధించి ర్యాంకింగ్‌ విషయానికి వస్తే,  ఆర్సిలార్‌ మిట్టల్‌ చీఫ్‌ లక్ష్మీ మిట్టల్‌ 3వ ర్యాంక్‌తో ముందు నిలిచారు.  అయితే ఆయన కంపెనీ కేంద్రాన్ని లగ్జెంబర్గ్‌గా పేర్కొనడం జరిగింది. దీనితో 49వ ర్యాంక్‌తో ముకేశ్‌ అంబానీ దేశంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లయ్యింది.  

టాప్‌ 3గా లక్ష్మీ మిట్టల్‌: గ్లోబల్‌ జాబితాలో వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మెక్‌మిలన్‌ ముందు నిలవగా, రెండవ స్థానంలో రాయల్‌ డచ్‌ షెల్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెన్‌ వాన్‌ బెవుర్డెన్‌ నిలిచారు. మూడవ స్థానంలో  ఆర్సిలర్‌ మిట్టల్‌ చైర్మన్‌ అండ్‌ సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ ఉన్నారు. నాల్గవ ర్యాంక్‌ను సౌదీ ఆరామ్‌కో సీఈఓ అమిన్‌ హెచ్‌ నాసర్‌ సొంతం చేసుకున్నారు. బీపీ చీఫ్‌ బాబ్‌ డుబే ఐదవ స్థానాన్ని, ఎక్సాన్‌మొబిల్‌ సీఈఓ డారిన్‌ ఉడ్స్‌ ఆరవస్థానాన్ని, ఫోక్స్‌వ్యాగన్‌ సీఈఓ హెర్బర్ట్‌ డియాస్‌ ఏడవ స్థానాన్ని, టయాటా సీఈఓ అరియో టయోడా ఎనిమిదవ స్థానాన్ని పొందారు. 9,10 స్థానాలను వరుసగా యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్, బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఓఈ వారెన్‌ బఫెట్‌ పొందారు. అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ 11వ స్థానాన్ని, యునైటెడ్‌హెల్త్‌గ్రూప్‌ సీఈఓ డేవిడ్‌ విచ్‌మన్‌ 12వ స్థానాన్ని, శాంసంగ్‌  సీఈఓ కిమ్‌ కి–నామ్‌ 13వ స్థానాన్ని దక్కించుకున్నారు.  

గర్వకారణం: ఓఎన్‌జీసీ, ఐఓసీ
తమ సంస్థల సీఈఓలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.  

ప్రాతిపదిక ఇది...: సీఈఓలకు సంబంధించి సీఈఓ వరల్డ్‌ మ్యాగజైన్‌ గ్లోబల్‌ ర్యాకింగ్స్‌ ప్రతిష్టాత్మకమైనవి. 96 దేశాల్లో 1,200కిపైగా సీఈఓలను ఈ ర్యాంకింగ్స్‌కు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వ్యాపార పనితీరు, సీఈఓ పూర్తి బాధ్యతల కాలంలో కంపెనీ సాధించిన ఫైనాన్షియల్‌ రిటర్న్స్‌ తుది ర్యాంకింగ్‌లో 60 శాతం వెయిటేజ్‌ని కలిగిఉంటాయి. పర్యావరణం, పాలనాతీరు, కంపెనీలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌ షేర్లు, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో మార్పులు వంటి అంశాలు మిగిలిన 40 శాతం వెయిటేజీలో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top