
ప్రపంచ సవాళ్లకు ఎదురొడ్డుతున్న భారత్: జైట్లీ
ప్రపంచం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లను తట్టుకుని భారత్ నిలబడుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పేర్కొన్నారు.
ముంబై: ప్రపంచం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లను తట్టుకుని భారత్ నిలబడుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పేర్కొన్నారు. ఇక్కడి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో విద్య ఆవశ్యకతపై జరిగిన ఒక సదస్సులో జైట్లీ పాల్గొన్నారు. మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ జాఫర్ సరాష్‌వాలా, బీఎస్‌ఈ సీఈఓ అశిస్ చౌహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో కలిసి ఈ సందర్భంగా జైట్లీ బీఎస్‌ఈలో బెల్‌ను మోగించారు. కార్యక్రమంలో జైట్లీ ప్రసంగాన్ని క్లుప్తంగా చూస్తే...‘‘ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక,రాజకీయ సవాళ్లను అన్నింటినీ భారత్ ఎదుర్కొని నిలబడగలుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న భరోసా ఉంది. దేశం మరెంతో వృద్ధి సాధించడానికీ అవకాశాలు ఉన్నాయి. పలు దేశాలతో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాగుంది’’.