ట్యూబ్స్‌ హబ్‌గా హైదరాబాద్‌! | Hyderabad as tubes hub! | Sakshi
Sakshi News home page

ట్యూబ్స్‌ హబ్‌గా హైదరాబాద్‌!

May 19 2018 12:52 AM | Updated on Sep 4 2018 5:44 PM

Hyderabad as tubes hub! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహనాల టైర్లలో వాడే ట్యూబుల తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా నిలుస్తోంది. సైకిళ్లు మొదలు మైనింగ్‌లో ఉపయోగించే భారీ వాహనాల వరకూ అన్ని రకాల ట్యూబులూ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి.

ముడి సరుకు విదేశాల నుంచి వస్తున్నప్పటికీ...  మానవ వనరుల లభ్యత, మంచి పని వాతావరణం ఉండడంతో కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటిగా ఇక్కడ కార్యకలాపాలు ఆరంభించాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఇక్కడి ట్యూబులు ఎగుమతి అవుతున్నాయి. ట్యూబ్, టైర్‌ పరిశ్రమపై దిగుమతులు ప్రభావం లేకపోగా... మొత్తంగా భారత్‌లో తయారవుతున్న ట్యూబుల్లో హైదరాబాద్‌ కంపెనీల వాటా 25 శాతం పైగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నెలకు 5 కోట్ల ట్యూబులు...
దేశవ్యాప్తంగా నెలకు సుమారు 5 కోట్ల ట్యూబులు తయారవుతున్నాయని సమాచారం. వ్యవస్థీకృత రంగంలో 55 శాతం మేర ఉత్పత్తి అవుతుండగా... ట్యూబుల పరిశ్రమలో సగం వాటా టూవీలర్లు, త్రీవీలర్లదే. ఉత్పత్తి పరంగా చూస్తే వ్యవస్థీకృత రంగంలో 38 శాతం, అవ్యవస్థీకృత రంగంలో 12 శాతం హైదరాబాద్‌ చుట్టుపక్కలున్న కంపెనీల్లో జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

టాప్‌ కంపెనీలు మన్నికైన ట్యూబుల కోసం బ్యుటైల్‌ను (ఒక రకమైన సింథటిక్‌ రబ్బర్‌) ముడిపదార్థంగా వినియోగిస్తున్నాయని ‘న్యూమెక్స్‌’ ప్రమోటర్‌ రవిశంకర్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.  చిన్నాచితకా కంపెనీలు తక్కువ ధరలో వచ్చే సహజ రబ్బరుతో తయారు చేస్తున్నాయి. ట్యూబ్‌లెస్‌ టైర్ల వాడకం పెరుగుతుండడంతో ట్యూబ్‌ తయారీ కంపెనీలు భవిష్యత్‌పై ఆందోళగానే ఉన్నాయి. అయితే గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లతో ట్యూబ్‌లెస్‌ టైర్లలో గాలి తగ్గుతూ ఉంటుంది. దీంతో ట్యూబ్‌లెస్‌ టైర్లలోనూ కస్టమర్లు ట్యూబులను పెట్టుకుంటున్నారు.

ఏటా 18 కోట్ల టైర్లు..
భారత్‌లో 41 టైర్ల తయారీ కంపెనీలు 62 ప్లాంట్లను నిర్వహిస్తున్నాయి. ఎంఆర్‌ఎఫ్, సియట్, అపోలో, బిర్లా, బ్రిడ్జ్‌స్టోన్, మిషెలిన్, టీవీఎస్, జేకే వంటి బ్రాండ్లు ప్రముఖంగా పోటీపడుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన న్యూమెక్స్‌ కూడా ఈ మార్కెట్లోకి ప్రవేశించింది. టూవీలర్లు, కార్లు, ట్రాక్టర్ల వంటి 30 విభాగాల్లో ఇవి టైర్లను తయారు చేస్తున్నాయి. 2017–18లో సుమారు 18 కోట్ల టైర్లు అమ్ముడయ్యాయి. దీన్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలది 53 శాతం వాటా. మొత్తం పరిశ్రమ విలువ రూ.53,000 కోట్లుంది.

ఎగుమతులు రూ.10,000 కోట్లకు చేరువలో ఉన్నాయి. భారత టైర్లకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండడంతో ఎగుమతులు మూడేళ్లుగా ఏటా 8–10 శాతం వృద్ధి నమోదు చేయనున్నాయి. దేశీయ పరిశ్రమ సైతం 2022 వరకు ఇదే స్థాయిలో వృద్ధి సాధిస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. రానున్న అయిదేళ్లలో దేశంలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు టైర్ల పరిశ్రమలో ఉంటాయని అంచనా వేసింది.


పెరిగిన ధరలు..
క్రూడ్‌ ఆయిల్‌ ధర కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది. బ్యారెల్‌ ధర ప్రస్తుతం 80 డాలర్లు దాటింది. క్రూడ్‌ నుంచి వచ్చే కొన్ని ఉప ఉత్పాదనలు సింథటిక్‌ రబ్బర్‌ తయారీలో ముడి పదార్థంగా వాడతారు. దీంతో టైర్ల ధరలకు క్రూడ్‌తో ముడిపడి ఉంటుంది. మే మొదటి వారంలోనే టైర్ల ధరలు 3 శాతం వరకు పెరిగాయని సమాచారం. క్రూడ్‌ ధర అధికం అవుతుండడంతో జూలైలో టైర్ల ధరలను మరోసారి సవరించే అవకాశం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement